ఇల్లు కొన్నాక ధీమాగా ఉండాలంటే..

నచ్చిన ఇంటిని లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ముచ్చటపడి ఇంటీరియర్‌ చేయిస్తున్నారు.

Published : 18 Feb 2023 01:13 IST

నచ్చిన ఇంటిని లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ముచ్చటపడి ఇంటీరియర్‌ చేయిస్తున్నారు. ఇందుకు ఖర్చు ఎంతైనా వెనకాడటం లేదు. సొంతింటి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు.. ఇంటి బీమా విషయంలోనూ చొరవ చూపితే మరింత ధీమాగా ఉండొచ్చు. నగరంలో ఇటీవల కాలంలో నివాసాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కలపతో చేయిస్తున్న ఇంటీయర్స్‌తో గతంలో పోలిస్తే ముప్పు పెరిగింది. ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు పెరగడంతో విద్యాదాఘాతాలకు ఆస్కారం ఉంది. మీరు జాగ్రత్తగానే ఉన్నా బహుళ అంతస్తుల్లో నివాసాలు కాబట్టి ఎక్కడ మంటలు అంటుకున్నా ఇతర నివాసాలకు వ్యాపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి రోడ్డుమీద పడే దుస్థితి రాకుండా బీమాతో ఆర్థిక ధీమాను పొందొచ్చు.

గృహరుణం తీసుకునేటప్పుడు.. దానికి అనుబంధంగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీని తీసుకుంటుంటారు. రుణగ్రహీతకు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఈ పాలసీ రుణాన్ని చెల్లించేందుకు తోడ్పడుతుంది. కానీ నిర్మాణానికీ, ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టానికి బాధ్యత వహించదు. దీనికోసం ప్రత్యేకంగా గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇల్లు, అందులోని వస్తువులకు ఏదైనా నష్టం సంభవించినప్పుడు ఆర్థికంగా ఆ నష్టాన్ని భర్తీ చేసేదే గృహ బీమా.

రెండు రకాలు

ఇందులో రెండు రకాలు ఉన్నాయి.  ఇంట్లో ఉన్న వస్తువులకు రక్షణ కల్పించే కంటెంట్‌ ఇన్సూరెన్స్‌. విద్యుత్తు ఉపకరణాలు, ఫర్నిచర్‌, ఆభరణాలు తదితర వాటికి రక్షణ లభిస్తుంది. దొంగతనం, అగ్ని ప్రమాదాల్లో జరిగిన నష్టాలను భర్తీ చేస్తుంది.
* నిర్మాణానికి ఏదైనా నష్టం జరిగితే పరిహారం చెల్లించే స్ట్రక్చర్‌ ఇన్సూరెన్స్‌. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆస్తికి నష్టం వాటిల్లితే పరిహారం ఇస్తుంది.
దీ మీ ఇల్లు ఎక్కడ ఉంది అనేదాన్ని బట్టి, ఏ తరహా పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉన్నప్పుడు స్ట్రక్చరల్‌ హోం ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు లేనప్పుడు కంటెంట్‌ ఇన్సూరెన్స్‌ సరిపోతుంది.
* ఏ రకం పాలసీ తీసుకున్నా... ముందుగా అందులో వర్తించేవి ఏమిటి? మినహాయింపులు ఉన్నాయా? అన్నది చూసుకోవాలి. మార్కెట్లో ఉన్న వివిధ పాలసీలను పోల్చి చూసుకోవాలి. ప్రీమియం, అందిస్తున్న ప్రయోజనాలు పరిశీలించాలి.

ఎంత మొత్తానికి...

ఇంటికి ఎంత విలువైన పాలసీ తీసుకోవాలన్నదీ ముఖ్యమే. ముందు ఆస్తి విలువను లెక్కించాలి. దీని కోసం నిపుణులను సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు కంటెంట్‌  ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని అనుకుంటుంటే వస్తువుల జాబితా తయారు చేసుకోండి.వాటి విలువ ఎంతుంటుందో చూసుకోండి. ఆ వస్తువు పోతే.. దాని వల్ల మీకు జరిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేయాలి. దీన్ని బట్టి, మీ వస్తువుల విలువ ఎంతనేది ఒక అంచనా వస్తుంది. తరుగు తర్వాత వస్తువు విలువ లేదా వస్తువును కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం.. ఈ రెండింటిలో ఏది కావాలన్నదీ నిర్ణయించుకోవచ్చు.
* ఇంటి విలువ ఏటా మారుతూ ఉంటుంది. కొత్త వస్తువులు వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి, ఏటా ఈ పాలసీని సమీక్షించుకుంటూ ఉండాలి. దీనివల్ల వాస్తవ విలువకన్నా.. మీ గృహ బీమా తగ్గకుండా ఉంటుంది.
* గృహ బీమా పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థకు ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకండి. మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు బీమా ప్రతిపాదిత పత్రంతో పాటు జత చేయండి. వస్తువుల గురించి పూర్తి సమాచారం అందించండి. బిల్లులను ఆధారాలుగా ఉంచుకోండి. మీ అవసరాలను బట్టి, గృహ  బీమాకు పలు అనుబంధ పాలసీలనూ జోడించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు