జీవో 111 రద్దుతో రియల్‌పై ప్రభావమెంత?

సిటీకి చేరువలో 84 గ్రామాలు.. 1.32 లక్షల ఎకరాల భూములు.. 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. రద్దు చేసిన జీవో 111 పరిధిలోని ప్రాంతమిది. జీవో రద్దు చేశారు కానీ విధివిధానాలు ప్రకటించలేదు.

Updated : 20 May 2023 10:53 IST

పర్యవసానాలపై మిశ్రమ అభిప్రాయాలు  

సిటీకి చేరువలో 84 గ్రామాలు.. 1.32 లక్షల ఎకరాల భూములు.. 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. రద్దు చేసిన జీవో 111 పరిధిలోని ప్రాంతమిది. జీవో రద్దు చేశారు కానీ విధివిధానాలు ప్రకటించలేదు. హెచ్‌ఎండీఏ నిబంధనలే ఇక్కడ వర్తిస్తాయని తాజాగా మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇన్నాళ్లు అక్కడ సాగుకు తప్ప ఇతరత్రా భూ వినియోగానికి అవకాశం లేదు. హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం.. అన్ని ప్రాంతాల మాదిరి ఇక్కడ నాలా ఛార్జీలు చెల్లించి భూ వినియోగ మార్పిడితో నిర్మాణాలను చేసుకోవచ్చు. సిటీకి చేరువలో లక్షల ఎకరాలు అందుబాటులోకి రావడంతో మిగతా ప్రాంతంలోని స్థిరాస్తి రంగంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? భూముల ధరలు కొన్నాళ్లపాటు నిలకడగా ఉంటాయా? ఇళ్లు అందుబాటులో ధరలో దొరుకుతాయా? రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు ఏమంటున్నాయి?.తెలుసుకుందాం..

జంట జలాశయాల పరిరక్షణ కోసం జీవో 111ను దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వం జారీ చేసింది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాన్ని కన్జర్వేషన్‌ జోన్‌గా ప్రకటించారు. దీంతో జలాశయాలతోపాటు ఈ ప్రాంతంలోని పచ్చదనంతో నగరం ఊపిరి పీల్చుకుంటోంది. ఇలాంటి ప్రాంతంలో గ్రీన్‌ సిటీ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వాలని గతంలో స్థిరాస్తి సంఘాలు సూచనలు చేశాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేపట్టాలని పలు సూచనలు చేశాయి. అయితే సర్కారు మాత్రం సిటీలోని మిగతా ప్రాంతం ఎలాగో ఇది అంతే అని చెప్పింది. ప్రత్యేకంగా ఆంక్షలేమీ ఉండవని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సానుకూల, ప్రతికూల ప్రభావాలున్నాయి. స్థిరాస్తి రంగంపై ప్రభావం ఏమేరకు ఉంటుందంటే..

భూముల ధరలు తగ్గొచ్చు
ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ

జీవో 111 పరిధిలో పెద్దఎత్తున భూములున్నాయి. తాజా నిర్ణయాలతో సిటీ దగ్గరలో భూములు అందుబాటులోకి వస్తాయి. అభివృద్ధికి అవాంతరాలుండవు. ఇప్పుడు ఆంక్షల కారణంగా కోకాపేట తర్వాత మోకిల్లా వరకు మధ్యలో ఖాళీగా ఉంటుంది.

* భూముల లభ్యత లేక ప్రస్తుతం ఆకాశహర్మ్యాలతో నిటారుగా వెళుతున్నారు. మున్ముందు అంత ఎత్తువరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. భారీగా భూముల లభ్యత కారణంగా భూముల ధరలు తగ్గే అవకాశం ఉంది. మరో 50 ఏళ్ల అవసరాలకు సరిపడా భూములు ఇక్కడ ఉన్నాయి.

* ప్రభుత్వానికి సైతం మౌలిక వసతుల అభివృద్ధి సులువవుతుంది. భవిష్యత్తు ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా చేస్తే బాగుంటుంది. అభివృద్ధి చెందిన తర్వాత మౌలిక వసతులు కల్పించడం కష్టం. ఇప్పుడైతేనే పక్కా ప్రణాళికతో చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇదొక చారిత్రాకత్మక అవకాశంగా తీసుకుని పచ్చదనం తగ్గకుండా చర్యలు చేపడుతూనే అభివృద్ధి చేయాలి.

* రియల్‌ ఎస్టేట్‌ రంగ భాగస్వాముల ఆలోచనలు తీసుకుంటే మరింత బాగా అభివృద్ధి చేసేందుకు తగు సూచనలు అందించేందుకు అవకాశం ఉంటుంది.  

* హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారమే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అనుమతి కోసం వెళితే ఇస్తారా అనేది స్పష్టత లేదు. హెచ్‌ఎండీఏ ప్రకారమే అనుమతులు ఇచ్చినా పచ్చదనం తగ్గకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీనికో మంచిపేరు పెట్టాలి. అక్కడ ఉంటున్నవారు గర్వంగా భావించేలా ఉండాలి.

ఈనాడు, హైదరాబాద్‌:

పర్యావరణ అనుకూల నగరాన్ని సృష్టించే అవకాశం కోల్పోయాం
జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

అందమైన పర్యావరణ అనుకూల నగరాన్ని సృష్టించే అవకాశం కోల్పోతున్నాం. గ్రీన్‌ సిటీని అభివృద్ధి చేసి దేశంలోని ఇతర నగరాలు, ప్రపంచానికి చూపించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు అవుతుంది.

శివార్లలోని సబ్‌అర్బన్‌ ఫ్లాట్‌ డెవలప్‌మెంట్‌లో ఇప్పటికే ఉన్న భూములపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. సిటీలోని ఇతర ప్రాంత రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు ఒకింత కలవరపాటుకు గురవుతున్నాయి.

* శామీర్‌పేట, ఘట్‌కేసర్‌, షాద్‌నగర్‌ వరకు ప్లాటింగ్‌ జరుగుతోంది. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ బాగానే జరుగుతోంది. తాజా నిర్ణయంతో జీవో 111 ప్రాంతం ఐటీ కారిడార్‌కు చేరువగా ఉంది కాబట్టి సహజంగానే ఇక్కడ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఇది మిగతా ప్రాంతాలకు కొంతకాలం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

* పెద్దఎత్తున ల్యాండ్‌ బ్యాంక్‌ అందుబాటులోకి వస్తుంది. ప్లాటింగ్‌ సప్లయ్‌ పెరుగుతుంది. జీవో 50తో అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ కారణంగా అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల సరఫరా పెరిగి మిగిలిపోతున్నట్లు మున్ముందు ప్లాటింగ్‌లోనూ జరుగుతుంది. మొత్తంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మందగించే అవకాశం ఉంది. దీంతో ఫ్లాట్ల ధరలు తగ్గొచ్చు అంటారా.. అంటే ఏమాత్రం తగ్గే అవకాశం లేదు.

* సిటీ నుంచి దూరంగా వెళ్లి ఇల్లు కట్టుకుంటున్నవారు ఇప్పుడు ఐటీ కారిడార్‌కు చేరువలో జీవో 111 పరిధిలో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగని అందుబాటు ఇళ్లకు ఈ ప్రాంతం కేంద్రంగా మారుతుందని ఊహించడం లేదు. ఇక్కడ రైతుల చేతుల్లో 25 శాతం మాత్రమే భూములున్నాయి. 75 శాతం ఇన్వెస్టర్ల చేతిలోకి వెళ్లాయి. వాళ్లు తక్కువ ధరకు అమ్ముతారని భావించడం లేదు.

* 84 గ్రామాల్లోని రైతుల అభివృద్ధి కోసం, వారి భూములకు మంచి ధరల కోసమే ఈ నిర్ణయమైతే మరో పద్ధతిలో చేయవచ్చు. ఆకాశహర్మ్యాలు కడుతున్న మాదాపూర్‌కంటే బంజారాహిల్స్‌లోనే స్థలాల ధరలు ఎక్కువ. ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేక తీసుకొచ్చేలా ప్రభుత్వం చేస్తే అభివృద్ధి చెందుతాయి. చూడ ముచ్చటగా ఉండేలా చేయాలి. అక్కడ ఉండేవారే కాదు.. అందరి ఆమోదం ఉంటుంది. లేదంటే కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని