టీఎస్‌బీపాస్‌ చట్టం తెలుసా?

లేఅవుట్లు.. భవన నిర్మాణాల అనుమతుల కోసం చాలామంది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు.

Published : 27 May 2023 01:07 IST

అనుమతులకు కాళ్లరిగేలా తిరగనవసరం లేదు

ఈనాడు, హైదరాబాద్‌: లేఅవుట్లు.. భవన నిర్మాణాల అనుమతుల కోసం చాలామంది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటారు. అన్ని పత్రాలు సమర్పించినా అధికారులు సైతం వివిధ కారణాలతో అదిగో ఇదిగో అంటూ తిప్పుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సేవలన్నీ ఆన్‌లైన్‌ చేసింది. టీఎస్‌బీపాస్‌ చట్టం తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లోనే అన్నిరకాల ఎన్‌వోసీల నుంచి అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలి. నిర్ణీత ఫీజులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించుకునే వెసులుబాటుంది. త్వరలో పంచాయతీల పరిధిలో కూడా టీఎస్‌బీపాస్‌ తేనున్నారు. ఇంత పకడ్బందీగా చట్టం తెచ్చినప్పటికీ అనుమతుల కోసం ప్రజలు పడే కష్టాలు తీరడం లేదు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ ఫీజులు చెల్లించినా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చట్టం ప్రకారం 21 రోజులలోపు దరఖాస్తులను పరిష్కరించాలి. లేదంటే తిరస్కరించాలి. ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా పేర్కొనాలి. దరఖాస్తు స్క్రుటినీ అధికారి నుంచి కమిషనర్‌ వరకు చట్టంలో నిర్ణీత గడువు విధించారు. చాలామంది అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. దరఖాస్తు స్క్రుటినీ చేసే అధికారి 3 రోజుల లోపల దరఖాస్తును పూర్తి చేయాలి. లేదంటే కారణాలు చెప్పాలి. సిబ్బంది కొరత, ఇతర కారణాలతో చాలామంది వారం, పది రోజులపాటు తమ వద్దే ఉంచుకుంటున్నారు. దీని నివారణకు చట్టంలో ప్రత్యేక చర్యలున్నాయి. ఆలస్యమైతే అధికారుల నుంచి జీతాలు కోత పెట్టనున్నారు. రోజుకు రూ.1000 వంతున ఎన్నిరోజులు ఆలస్యమైతే అన్ని రూ.వేలు ఆయా అధికారుల జీతాల నుంచి రికవరీ చేయనున్నారు. ఇటీవలి వివిధ మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పరిశీలన జాప్యం చేసినందుకు 13 మంది అధికారులపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ షాక్‌ ఇచ్చారు. ఆలస్యమైన రోజులకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు, ఆపైనే వసూలు చేశారు. సేవల్లో మరింత పారదర్శకత పెంచడానికి చట్టంలో ఈ వెసులుబాటు కల్పించారు. దరఖాస్తు దారులు ఎవరైనా ఇలా చట్టాన్ని వినియోగించుకొని లబ్ధి పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని