మార్కెట్‌ను దీర్ఘకాలికంగా చూడాలి

ఎన్నికల ప్రభావం స్థిరాస్తి రంగంపై ఏ మేరకు ఉంది? గత ఏడాది ఇదే సమయంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?

Updated : 18 Nov 2023 07:19 IST

ఎన్నికలప్రభావం తాత్కాలికమే అంటున్న పరిశ్రమ వర్గాలు
ఈనాడు, హైదరాబాద్‌

న్నికల ప్రభావం స్థిరాస్తి రంగంపై ఏ మేరకు ఉంది? గత ఏడాది ఇదే సమయంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి? ఈ ఏడాది ఎన్ని లావాదేవీలు జరిగాయి? మార్కెట్‌పై ప్రభావాన్ని నెలవారీగా చూడాలా? వార్షికంగా బేరీజు వేయాలా?
మార్కెట్‌లో స్థిరాస్తుల క్రయక్రయాల్లో హెచ్చుతగ్గులు సహజం. ఒక్కో నెల పెరగడం, ఒక్కో నెల తగ్గడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బట్టి ఉంటుంది. మొత్తంగా స్థిరాస్తి మార్కెట్‌ను అంచనా వేయాలంటే దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. ఏ నెలకు ఆ నెల చూడొద్దు అంటున్నాయి. ఆ రకంగా దీర్ఘకాలానికి చూస్తే ఎన్నికల ప్రభావం తాత్కాలికమే అంటున్నాయి. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఇటీవల విడుదల చేసిన గణాంకాలు వీరి వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

మూడేళ్లుగా చూస్తే

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రిజిస్ట్రేషన్ల లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే... 2021లో జనవరి నుంచి అక్టోబరు వరకు 67,684 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొవిడ్‌ తర్వాత సంవత్సరం కావడంతో బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావంతో ఒక్కసారిగా విక్రయాలు పెరిగాయి. అంతకుముందు వాయిదా పడిన రిజిస్ట్రేషన్లు సైతం 2021లో చేసుకున్నారు. దీంతో లావాదేవీలు పెరిగాయి. 2022లో 56,046 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాదాపు 17 శాతం తక్కువ. ఈ ఏడాది చూస్తే అక్టోబరు వరకు 58,378 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది కంటే 4 శాతం పెరుగుదల. కాబట్టి ఎన్నికలు అనేవి తాత్కాలిక ప్రభావమే అని బిల్డర్లు అంటున్నారు.

అక్టోబరులో గమనిస్తే

ఎన్నికల నోటిఫికేషన్‌ అక్టోబరులో వెలువడింది. అప్పటి నుంచి చూసినా ఎన్నికల ప్రభావం రియాల్టీపై పెద్దగా లేదు అనడానికి పెరిగిన విక్రయాలే నిదర్శనం అని చెబుతున్నారు. గత ఏడాది అక్టోబరులో 4,634 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే.. ఈ ఏడాది అక్టోబరులో 5,787 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే ఏకంగా 25 శాతం పెరిగాయి. అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లలో పెద్ద కంపెనీలన్నీ దాదాపుగా వైట్‌ మనీనే స్వీకరిస్తున్నాయి. ఇటీవల ఒక సంస్థ తమ ప్రాజెక్ట్‌ ప్రారంభం సందర్భంగా లాంచింగ్‌ ఆఫర్‌ను పెట్టగా భారీగా బుకింగ్‌లు వచ్చాయి. ఏటొచ్చి చిన్న బిల్డర్లే రిజిస్ట్రేషన్‌ ధరలు వసూలు చేస్తుండటంతో ఇక్కడ తెలుపు, నలుపు ప్రస్తావన వస్తోంది. ఇలాంటి లావాదేవీలపై ఎన్నికల కోడ్‌ ప్రభావం పడింది.

ధరలు పెరుగుతూనే ఉన్నాయ్‌

ఇల్లు కొనుగోలు ఆలస్యం అయ్యేకొద్దీ ఆ మేరకు ధరలు భారం అవుతూనే ఉన్నాయి. ఏడాది కాలంగా సిటీలో 6.8 శాతం వరకు చదరపు అడుగు ధర పెరిగింది. ప్రాంతాన్ని బట్టి పెరుగుదలలో తేడాలు ఉన్నాయి. పెరగడం అనేది ఖాయంగా కొన్నేళ్లుగా కనబడుతోంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంటివారు కావడం మేలు అని నిర్మాణదారులు సూచిస్తున్నారు.

స్థలాలు, భూముల లావాదేవీలపై

ఎక్కువగా నగదుతో ముడిపడిన స్థలాలు, భూముల లావాదేవీలపై ఎన్నికల కోడ్‌ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. వీటి విక్రయాలు రెండు నెలలుగా కొంతవరకు స్తబ్ధుగా ఉన్నాయి. డిసెంబరు 3తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం, వారి విధానాలను బట్టి మార్కెట్‌ గమనం ఉండనుంది.

ఎంపికకు సరైన సమయమేనా?  

సొంతింటి కోసం అన్వేషిస్తున్నవారు తమకు నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకునేందుకు ఇది అనువైన సమయం అని బిల్డర్లు అంటున్నారు. కావాల్సిన బడ్జెట్‌లో, మెచ్చిన ప్రదేశంలో ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నిర్మాణ సంస్థలతో ధర విషయంలో బేరమాడవచ్చు. చాలా సంస్థలు ధరలను తగ్గిస్తున్నాయి కూడా. హైదరాబాద్‌ జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ.4,521గా ఉంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో రూ.3,125, రంగారెడ్డి జిల్లాలో రూ.4,185గా ఉంది. అయితే వాస్తవంగా వీటి కంటే ఎక్కువ ధరలు వెచ్చిస్తే తప్ప అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు దొరకని పరిస్థితి. కాబట్టి బడ్జెట్‌లో దొరికే ఇంటి కోసం విస్తీర్ణంలో రాజీ పడాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని