నిర్మాణాలు ఎదురుచూస్తున్నాయి

ఇల్లు కట్టుకునే వారికంటే కొనుక్కోవాలనుకునే వారికి మార్కెట్లో ఎక్కువ లభ్యత ఉంది. బడ్జెట్‌ మొదలు విలాసవంతమైన నివాసాల వరకు నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తైన ఇళ్లతో పాటు నిర్మాణాలు పురోగతిలో ఉన్నవి, ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల వరకు సిటీలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాయి.

Published : 06 Jan 2024 00:48 IST

ఈనాడు, హైదరాబాద్‌

ల్లు కట్టుకునే వారికంటే కొనుక్కోవాలనుకునే వారికి మార్కెట్లో ఎక్కువ లభ్యత ఉంది. బడ్జెట్‌ మొదలు విలాసవంతమైన నివాసాల వరకు నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తైన ఇళ్లతో పాటు నిర్మాణాలు పురోగతిలో ఉన్నవి, ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల వరకు సిటీలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తున్నాయి.

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో స్థిరాస్తి రంగం ఎక్కువగా విస్తరించి ఉంది. వీటి పరిధిలో 2023లో 76,819 కొత్త ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు ప్రాప్‌టైగర్‌ సంస్థ వెల్లడించింది. అంతకుముందు ఏడాదిలో 82,801 ఇళ్లను ప్రారంభించినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. 2022తో పోలిస్తే గత ఏడాది 7 శాతం తగ్గాయి. దేశవ్యాప్తంగా 2022లో 4.31 లక్షల ఇళ్ల పనులు మొదలెడితే.. 2023లో ఈ సంఖ్య 5.17 లక్షలకు చేరింది.. అంటే 20 శాతం పెరిగాయి.  

ఏ బడ్జెట్‌లో కొంటున్నారంటే..

గత ఏడాది కొనుగోలు ధోరణిని పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2023లో రూ.50 లక్షల లోపు ఇళ్ల విక్రయాలు.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు గృహాలు కూడా 5 శాతం తగ్గాయి. మొత్తం విక్రయాల్లో ఈ విభాగంలో ఇళ్ల వాటా 2018లో 52 శాతం ఉంటే.. ఇప్పుడు ఏకంగా 40 శాతానికి పడిపోయింది. కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల కొనుగోళ్లు ఏకంగా 38 శాతం పెరిగాయి.

అమ్మకానికి  ఉన్నాయ్‌..

ఏటా భారీగా ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్‌ల్లోని యూనిట్లు అన్నీ అమ్ముడుపోతున్నాయా? అంటే పరిశ్రమ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 2023లో 45,505 ఇన్వెంటరీ ఉంది. 2022తో పోలిస్తే అమ్ముడుపోని గృహాల సంఖ్య పెరిగింది. ఒక్కో యూనిట్‌ అమ్మకానికి సగటున 17 నెలలు పడుతోంది.

  • రూ.50 లక్షల లోపు ఉన్న ఇళ్ల విక్రయాలను 2022లో 12 నెలల్లో అమ్మితే.. 2023లో ఇది కాస్తా 17నెలలకు పెరిగింది.
  • రూ.50 లక్షల నుంచి కోటి ఇళ్ల విభాగంలో అమ్మకాల సమయం 13 నెలలు నుంచి 20 నెలలకు పెరిగింది. ః విలాసవంతమైన ఇళ్లు గతంలో గతంలో 15 నెలల్లో అమ్ముడుపోతే.. గత ఏడాది 14 నెలలకే అమ్మేశారు.


కొన్ని ప్రాంతాల్లో ధరల పెరుగుదల ఇలా..

హైదరాబాద్‌ మార్కెట్లో గత 6 నెలల వ్యవధిలో స్థిరాస్తి ధరల్లో అత్యధిక ప్రాంతాల్లో 1 నుంచి 2 శాతం వృద్ధి నమోదైంది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో ఇచ్చిన డాటా ప్రకారం...   రాజేంద్రనగర్‌లో గత 6 నెలల్లో 13 శాతం పెరిగింది. అక్కడ పలు బడా ప్రాజెక్టులు రావడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. కోకాపేట, మణికొండలో 4 శాతం వృద్ధి చెందాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో చదరపు అడుగు రూ.13,400 నుంచి రూ.16వేలు పలుకుతోంది. ఇక్కడ సంవత్సర కాలంలో 12 శాతం ధరలు పెరిగాయి. కోకాపేటలో 39 శాతం, మణికొండలో 28 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. అద్దెలు పెరగడంతో ఈ మేరకు రెండు అంకెల వృద్ధి నమోదైనట్లు నిపుణులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని