నిబంధనలు పాటిస్తే.. అగ్నిప్రమాదాలు దూరం

ఆకాశాన్ని తాకే ఎత్తైన నివాస భవనాలను చూస్తుంటే వాటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతుంటాయి. కంగారుపడాల్సిన అవసరం లేదని అగ్నిమాపకశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పక్కాగా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు అవకాశం తక్కువని, అరుదుగా మాత్రమే జరిగే వీలుందని చెబుతున్నారు.

Published : 17 Feb 2024 01:23 IST

ఎత్తైన భవనాల్లో అరుదుగా ఘటనలు
ఎన్‌బీసీ అమలు చేయాలని సూచిస్తున్న అగ్నిమాపకశాఖ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆకాశాన్ని తాకే ఎత్తైన నివాస భవనాలను చూస్తుంటే వాటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతుంటాయి. కంగారుపడాల్సిన అవసరం లేదని అగ్నిమాపకశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పక్కాగా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు అవకాశం తక్కువని, అరుదుగా మాత్రమే జరిగే వీలుందని చెబుతున్నారు. 50 అంతస్తులైనా, 60 అంతస్తులైనా ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన, నిబంధనల ప్రకారం నిర్వహణ, పీరియాడికల్‌ డ్రిల్స్‌, ఫైర్‌సేఫ్టీ ఆడిట్‌ చేయించుకొంటే దుర్ఘటనలు జరగవని సూచిస్తున్నారు. నేషనల్‌ బిల్డిండ్‌ కోడ్‌(ఎన్‌బీసీ) సైతం ఎత్తైన నివాసాలకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించలేదంటున్నారు. సంబంధిత పరికరాలను ఏర్పాటు చేసి  నిర్వహణ, పర్యవేక్షకులను నియమిస్తే చాలంటున్నారు. ఇలాంటి నిర్మాణాల్లో జీవో 168 ప్రకారం నిబంధనలు పాటిస్తూ, ఫైర్‌సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

  • అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే ఆర్పే స్ప్రింక్లర్‌ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
  • ప్రమాదాన్ని పసిగట్టే డిటెక్షన్‌ వ్యవస్థ అవసరం.
  • అగ్నిమాపకశాఖ నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారు లేదా సంబంధిత అంశంలో డిప్లొమా పూర్తి చేసిన వారిని ప్రతి భవనంలో ఫైర్‌సేఫ్టీ అధికారిగా నియమించుకోవాలి.
  • ప్రయివేటు వ్యక్తులైతే వారికి కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
  • ప్రతి భవనంలో అగ్ని ప్రమాదాల నియంత్రణలో శిక్షణ పొందిన ముగ్గురిని నియమించుకోవాలి. లేదా అక్కడి పనివారికి శిక్షణ ఇప్పించాలి. వట్టినాగులపల్లిలోని శిక్షణ పాఠశాలలో సంబంధిత పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపకశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.1500 చలానా కట్టి శిక్షణలో చేరాలి.
  • ఎన్‌బీసీ నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి ఎలక్ట్రిక్‌ సేఫ్టీపై థర్డ్‌పార్టీ ఆడిట్‌ చేయించుకోవాలి.
  • క్రమం తప్పకుండా ఆరునెలలకోసారి ‘పీరియాడికల్‌ డ్రిల్స్‌’ చేయించాలి.
  • ప్రమాదం జరిగితే బయటపడే ఎవాక్యుయేషన్‌ ప్రణాళిక ఉండాలి. కారిడార్‌లు, స్టెయిర్‌కేస్‌లు, ఇతర మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు ఉంచకూడదు.
  • వార్షిక నిర్వహణ (యాన్యువల్‌ మెయింటెనెన్స్‌)కు సంబంధించిన వివరాలను అగ్నిమాపక శాఖకు ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంది.

వట్టినాగులపల్లి శిక్షణ కేంద్రంలో కోర్సులివే...

  • ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ట్రైనింగ్‌ కోర్సు - ఒక రోజు కోర్సులో భాగంగా ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాల వినియోగం, మంటలకు కారణాలు, ఫోమ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, ఫైర్‌ పంపులు, ఫైర్‌ అలారం గుర్తించడం, మాక్‌డ్రిల్‌ ద్వారా వివరిస్తారు.
  • బేసిక్‌ ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ - 3 రోజుల శిక్షణలో భాగంగా పైకోర్సులతో పాటు పంపింగ్‌ నిర్వహణ, వినియోగం, అగ్ని ప్రమాదంలో భవనం పరిస్థితి, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు.. మంటల తీవ్రతను గుర్తించడం, ఫైర్‌ పరికరాలు లేకుండా రెస్క్యూ పద్ధతులు వివరిస్తారు.
  • ఎలిమెంటరీ ఫైర్‌ ఫైటింగ్‌ ట్రైనింగ్‌ కోర్సు - 6 రోజుల శిక్షణలో పైకోర్సులతో పాటు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌-2016, ఫిక్స్‌డ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ఇన్‌స్టాలేషన్‌, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌, ఫోమ్‌ ఎక్విప్‌మెంట్‌పై తర్ఫీదు ఇస్తారు.
  • ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ఓరియెంటేషన్‌ - 12 రోజుల శిక్షణలో పై కోర్సులకు అదనంగా రోప్స్‌, లైన్స్‌, హోస్‌డ్రిల్‌, ల్యాడర్‌ డ్రిల్‌, పికప్‌ డ్రిల్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు.
  • బేసిక్‌ ఫైర్‌ ఫైటర్‌ - నెల రోజుల కోర్సులో ఫైర్‌ ఆడిట్‌ బిల్డింగ్‌, ఫైర్‌లైఫ్‌ సేఫ్టీ వ్యవస్థలపై అవగాహన, భవన నిర్మాణాల్లో ఫైర్‌ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స, పేలుడు పదార్థాలు, విపత్తు నిర్వహణ, పరిశ్రమల్లో రసాయన, గ్యాస్‌, ఆయిల్‌ మంటల నివారణపై శిక్షణ అందిస్తారు.

నిరంతర పర్యవేక్షణ ఉండాలి..

ఫైర్‌సేఫ్టీ ఆడిట్‌ క్రమం తప్పకుండా నిర్వహించాలి. అగ్నిమాపక వ్యవస్థలో నీటి కొరత ఉండకూడదు. ఎప్పుడూ పంపిణీ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్ప్రింక్లర్‌ పనితీరును గమనించే అధునాతన పరికరాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాటితో నిత్యం పరిశీలిస్తూ పంపింగ్‌లో లోపాలుంటే సరిచేస్తూ ఉండాలి. ఫైర్‌ ఆడిట్‌ బిల్డింగ్‌, ఫైర్‌లైఫ్‌ సేఫ్టీ వ్యవస్థలపై అవగాహన, ప్రాక్టికల్‌ ఫైర్‌మెన్‌షిప్‌, ప్రాథమిక చికిత్సలపై వట్టినాగులపల్లి శిక్షణ కేంద్రంలో అవగాహన కల్పిస్తున్నారు. భవనాల్లో పని చేసే సిబ్బందితో పాటు నివాసం ఉండేవారూ ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా ప్రమాదం జరిగితే తక్షణమే స్పందించి ఇతరులను కాపాడే అవకాశం ఉందని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అధునాతన పరికరాలు

ప్రస్తుతం ఎత్తైన భవనాల్లో మంటలు ఆర్పే బాహుబలి నిచ్చెన ‘బ్రాంటో స్కై లిఫ్ట్‌’ 18 అంతస్తులు (54మీటర్ల వరకు ఉంది). భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 100 మీటర్ల ఎత్తు వరకు రెస్క్యూ చేసేలా కొత్తవి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని