కమిటీపై కాలయాపన

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్లో జాప్యం జరుగుతోంది.

Published : 02 Mar 2024 03:23 IST

ఆగిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులు
పెండింగులో సుమారు 50 దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. శంషాబాద్‌, శంకర్‌పల్లి, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ జోన్లకు సంబంధించి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ నాలుగు జోన్లకు సంబంధించి దాదాపు 50 దరఖాస్తుల వరకు పెండింగులో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. శంషాబాద్‌, శంకర్‌పల్లి జోన్ల పరిధిలోనే ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

భవన నిర్మాణాలకు సంబంధించి 5 అంతస్తుల వరకు స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిశీలించి అనుమతులు ఇస్తుంటాయి. 6 అంతస్తుల నుంచి ఆపైన మాత్రం హెచ్‌ఎండీఏలోని ప్రత్యేక కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ కమిటీ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇందులో హెచ్‌ఎండీఏకు సంబంధించి ఇద్దరు ప్లానింగ్‌ డైరెక్టర్లు, ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ కంట్రి అండ్‌ టౌన్‌ప్లానింగ్‌(డీటీసీపీ) డైరెక్టరు సభ్యులుగా ఉంటారు. నెలలో రెండు, మూడుసార్లు ఈ కమిటీ సమావేశమై బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులపై నిర్ణయం తీసుకుంటుంది. దస్త్రాలన్నీ సక్రమంగా ఉంటే... అనుమతులు ఇవ్వడం... సరైన వివరాలు లేకపోతే వాటిని తిరస్కరిస్తుంటారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంతవరకు ఈ కమిటీ సమావేశమే జరగలేదు. పాత కమిటీ స్థానంలో కొత్త కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా సరే... వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. దీంతో దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పట్లేదు. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోనూ ఎన్నికల సమయం నుంచి కమిటీ సమావేశం కాలేదు. దీంతో ఆకాశహర్మ్యాల అనుమతుల ప్రక్రియ ఆలస్యం అవుతోంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిటీ మాత్రమే కాకుండా పర్యావరణ అనుమతుల కోసం కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. అక్కడ నిపుణుల కమిటీ లేక ఎన్‌వోసీ జారీలో జాప్యం జరుగుతోంది.

ఇప్పటికే 59 అంతస్తులకు అనుమతులు...

నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివార్లలో భారీగా గేటెడ్‌ కమ్యూనిటీలు, వ్యాపార సముదాయాలు, మాల్స్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. భారీ అంతస్తులతో వీటిని నిర్మిస్తున్నారు. 2023 ఏప్రిల్‌లో పుప్పాలగూడలో 59 అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతులు మంజూరు చేసింది. కోకాపేట్‌లో గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టులో 2021లో 58 అంతస్తుల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేసింది. అదే కోకాపేటలో 2022లో 57, 50 అంతస్తులకు, పుప్పాలగూడలో 2021లో 55 అంతస్తులకు కమిటీ పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకు 48 నుంచి 59 అంతస్తుల వరకు మొత్తం 10 పెద్ద ప్రాజెక్టుల పనులు మహానగర పరిధిలో కొనసాగుతున్నాయి. మున్ముందు 60 అంతస్తుల దాటి నిర్మాణాలు చేపట్టేందుకు కొన్ని సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. కోకాపేట్‌ లేఅవుట్‌ను రూ.500 కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన సంగతి తెలిసిందే. మొదటి ఫేజ్‌లో ఇప్పటికే భారీ నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. గతేడాది మిగతా భూమి వేలం వేయగా... ఇక్కడ ఎకరా రూ.100 కోట్లు పలికింది. ఇందులో 59 అంతస్తుల వరకు భవనాల నిర్మాణం చేపడుతున్నారు. నగరం చుట్టూ స్థిరాస్తి వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో మున్ముందు పెద్దఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాల జోరు అందుకునే అవకాశం ఉంది. వీటి అనుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఎత్తున ఫీజుల రూపంలో ఆదాయం సమకూరనుంది. లేఅవుట్లు అనుమతుల్లో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు జరుగుతున్నాయి. కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ... బహుళ అంతస్తుల దరఖాస్తులను పరిష్కారంలో తాత్సారం చేయడం వల్ల ఇటు స్థిరాస్తి మార్కెట్‌పై ప్రభావం చూపడమే కాకుండా... ప్రభుత్వ పరంగా భారీ ఎత్తున ఆదాయం కోల్పోనుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. సానుకూల నిర్ణయం తీసుకోవాలని మార్కెట్‌ వర్గాలు కోరుతున్నాయి.

‘అనుమతుల ఆలస్యంతో నిర్మాణదారులకు ఉండే ఇబ్బందులు తమకు తెలుసునని.. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమకు పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం కావాలని.. ఆ తర్వాత అన్నీ పరిష్కరిస్తామని సర్కారు అంటోంది. అభివృద్ధి ఒకవైపే కాకుండా అన్నివైపుల సమానంగా విస్తరించాలనేది తమ విధానమని.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెబుతోంది. తమ సమస్యలు చెప్పుకొనేందుకు అధికారులతో రెండు నెలలకోసారి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని క్రెడాయ్‌ కోరుతోంది.’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని