Updated : 18 Jun 2022 14:27 IST

నివాసం సరే.. నీటి మాటేంటి?

నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: తొలకరి వానకే నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. వర్షం పడితే వరద తాకిడి.. ఆ తర్వాత నీటి ఎద్దడి.. రెండింటికి ఒకటే పరిష్కారం అంటున్నారు నిపుణులు. వాననీటిని సాధ్యమైనంత వరకు భూమిలోకి ఇంకించి సంరక్షించడంతోపాటు నిల్వ చేసుకుని వాడుకోవడం. హైదరాబాద్‌ లాంటి నగరంలో చిన్న ఇళ్లలో, బహుళ అంతస్తుల్లో ఎలా సాధ్యమనేవారు ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని కొన్ని వ్యక్తిగత గృహాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నీటి సంరక్షణను ఆచరించి మిగతావారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వాననీటిని ఒడిసిపట్టడం ద్వారా వరదకు అడ్డుకట్టే కాదు నీటికోసం చేసే ఖర్చును గణనీయంగా తగ్గించుకుంటున్నారు.
ఐటీ కారిడార్‌లో నివాసానికి డిమాండ్‌ అధికంగా ఉంది. దీంతో ఇక్కడ తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ అంతస్తులు వేస్తున్నారు. జలమండలి సరఫరా చేసే నీరు సరిపోకపోవడంతో భూగర్భం నుంచి విపరీతంగా జలాలను తోడేస్తున్నారు. నీటి ట్యాంకులను కొంటున్నారు. ఆలస్యంగానైనా వాననీటి సంరక్షణ ప్రాధాన్యం గుర్తించి దిద్దుబాటు చర్యలకు దిగారు. కొంత ఖర్చు ఐనా సరే.. వాననీటిని జాగ్రత్త చేసుకుని వాడుకునే విధంగా కార్యాచరణలోకి దిగారు. కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు ముందే జాగ్రత్తపడుతున్నారు.

నార్సింగిలో..
38.5 ఎకరాల్లో విస్తరించిన గేటెడ్‌ కమ్యూనిటీ అది. వానాకాలంలో ఇళ్లపై కురిసే వాననే ఇక్కడ 11.1 కోట్ల లీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంత నీరు వృథాగా వదిలేయదల్చుకోలేదు ఆ కమ్యూనిటీ నిర్మాణదారులు. ఇళ్లపై విస్తీర్ణమే 85వేల చదరపు మీటర్లు ఉంటుంది. నీటి సంరక్షణ ద్వారా 1.35 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేయగల్గుతున్నారు. వార్షికంగా రూ.21.6 లక్షల లీటర్లు ఆదా చేయగలిగారు. 2700 నీటి ట్యాంకుల అవసరమైన నీటినే కొనే బాధ తప్పింది.
వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన సామర్థ్యం కల్గిన నీటి ట్యాంక్‌లు, సంప్‌లు లేవు. మరి ఎలా? ఇంట్లో వాహనాలు నిలిపే స్థలం ఉంటే చాలు. ఆ స్థలంలో గుంత తవ్వి మాడ్యులర్‌ హార్వెస్టింగ్‌ ట్యాంక్‌లను ఆధునిక సాంకేతికత వినియోగించి నిర్మిస్తున్నారు. వర్షపు నీరు శుద్ధి చేసిన అనంతరం ఇందులోకి చేరుతుంది.

90 వేల లీటర్ల ఆదా
* మణికొండలో వ్యక్తిగత నివాసం. ఇంటిపై విస్తీర్ణం 275 చ.మీటర్లు ఉంటుంది. వార్షికంగా ఇక్కడ కురిసే వర్షపునీరు 6.02 లక్షల లీటర్ల వరకు ఉంటుందని లెక్కకట్టారు. ఇందుకోసం నీటి ట్యాంకును భూగర్భంలో ఏర్పాటు చేసుకున్నారు. 90వేల లీటర్ల నీరు ఆదా అవ్వడమే కాదు 177 ట్యాంకర్లను కొనే ఇబ్బంది తప్పింది. రూ.1.42 లక్షల సొమ్ము ఆదా అయ్యింది.

గచ్చిబౌలిలో..
వ్యక్తిగత ఇల్లు.. ఇంటిపైకప్పు 200 చదరపు మీటర్లు ఉంటుంది. ఇక్కడ కురిసే ప్రతి చినుకు కలిపి వార్షికంగా 1.48 లక్షల లీటర్ల నీరు అవుతోంది. ఈ నీరు వర్షం పడే సమయంలో సంప్‌లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం అవుట్‌లెట్‌ పైపునకు ఇన్‌లైన్‌ ఫిల్టర్‌ ఏర్పాటు చేసుకుని మళ్లించారు. ఫలితంగా వార్షికంగా 80వేల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. రూ.14,400 ఆదా అయ్యింది.

కట్టే సమయంలోనే...
నిర్మాణ సమయంలోనే ముందుచూపుతో వ్యవహరిస్తే చాలా ఎక్కువ వాననీటిని సంరక్షించుకోవచ్చు. వట్టినాగులపల్లిలోని విల్లా నిర్మాణ సమయంలో ఇలాంటి ఏర్పాట్లు చేపట్టారు. ప్రాంగణ విస్తీర్ణం 1250 చదరపు మీటర్లు ఉంటే ఇంటిపైకప్పు విస్తీర్ణం 250 చదరపు మీటర్లు ఉంటుంది. దాదాపు 5 లక్షల లీటర్ల వర్షపు నీరు వీరి ఇంటి ప్రాంగణంలో కురుస్తుంది. పైనుంచి వచ్చే వాననీరు పైపులైన్లకు ఫిల్టర్ల ఏర్పాటు, ఇంజక్షన్‌ బోర్‌వెల్‌ ద్వారా ఏకంగా 4.27 లక్షల లీటర్ల నీరు ఆదా అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు. వర్షపు నీటి నిల్వకోసమే ప్రత్యేకంగా 10 క్యూబిక్‌ మీటర్ల సంప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.


వరదలను నివారించవచ్చు..

హైదరాబాద్‌ అవసరాలకు మొదట గండిపేట నీళ్లు సరిపోయేవి. తర్వాత హిమాయత్‌సాగర్‌ నుంచి సరఫరా చేశారు. జనాభా పెరగడంతో 100 కి.మీ. దూరంలోని సింగూరు నుంచి సరఫరా చేపట్టారు. జనాభా కోటి దాటడంతో నీటి అవసరాలు తీర్చేందుకు 200 కి.మీ. దూరంలోని గోదావరి-కృష్ణా బేసిన్ల నుంచి నీటిని తీసుకుంటున్నాం. తర్వాత ఎక్కడికి వెళతాం? వాననీటిని సంరక్షించుకోవడం ద్వారా మన నీటి అవసరాలను చాలావరకు తీర్చుకోవచ్చు. భూమిలోకి ఇంకించడం ద్వారా వరదలను నివారించడమే కాదు భూగర్భ జలాలు పెరిగేందుకు దోహదం చేస్తుంది.అన్ని ప్రభుత్వాలే చేయాలని కాకుండా ఎవరికి వారు నీటి సంరక్షణకు ముందుకు రావాలి. ఇంటి నిర్మాణ దశలోనే నీటి పొదుపుపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

- కల్పనారమేశ్‌, రెయిన్‌వాటర్‌ ప్రాజెక్ట్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని