కొనేదెంత? వచ్చేదెంత?

ఇల్లు కొనడానికి వెళితే కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా అనే పదాలు మార్కెటింగ్‌ సిబ్బంది నుంచి ఎక్కువగా వినపడుతుంటాయి.

Updated : 10 Sep 2022 10:50 IST

ఇంటి విస్తీర్ణం లెక్కలిలా...

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లు కొనడానికి వెళితే కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా అనే పదాలు మార్కెటింగ్‌ సిబ్బంది నుంచి ఎక్కువగా వినపడుతుంటాయి. మొదటిసారి కొంటున్నవారికి కొంత తికమకపెడుతుంటాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారికి వీటిపై కొంత అవగాహన ఉంటే ఇంటి విస్తీర్ణం తమ కుటుంబానికి సరిపోతుందా?.. రెండు పడకల  ఇల్లు చాలా లేక మూడు పడకల నివాసానికి వెళ్లాలా అనే నిర్ణయానికి రావడానికి ఉపయోగపడుతుంది.

కార్పెట్‌ ఏరియా
బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం కార్పెట్‌ ఏరియా కిందకు వస్తుంది.  ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్‌, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు పరిగణిస్తారు.

బిల్టప్‌ ..
కార్పెట్‌ ఏరియాతో పాటూ ఫ్లాట్‌ బయటి గోడలు, బాల్కనీలు దీని పరిధిలోకి వస్తాయి.

సూపర్‌ బిల్టప్‌ ఏరియా
బిల్టప్‌ ఏరియాతో పాటూ ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్‌, మెట్లు, లిఫ్ట్‌ మార్గాలు, క్లబ్‌హౌస్‌ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్‌ వాటాని కలిపి లెక్కిస్తారు. కొనుగోలుదారుడికి  ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్‌ ఏరియాగా చెబుతుంటారు.

70 శాతమే వస్తుంది..
స్టాండ్‌లోన్‌ అపార్ట్‌మెంట్లలో సౌకర్యాలు పెద్దగా ఉండవు కాబట్టి వీటిలో కొనుగోలు చేస్తే బిల్టప్‌ ఏరియా ఎక్కువ వస్తుంది.

* గేటెడ్‌ కమ్యూనిటీల్లో సౌకర్యాలకే పెద్దపీట. సహజంగానే 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. 1200 చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా ఫ్లాట్‌ తీసుకుంటే  ఇంటి లోపల వచ్చే బిల్టప్‌ ఏరియా 860 నుంచి 900 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది. 

ఇవీ తెలిస్తేనే...
* చదరపు అడుగుకు నగరంలో రూ.3500 నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు.  వీటికి అదనంగా రకరకాల ఛార్జీలు  ఉంటాయనే విషయాన్ని గుర్తించాలి.

* ఐదో అంతస్తు దాటితే,  మూలకు ప్లాట్‌ వస్తే,  తూర్పు వైపు, పార్కు వైపు ప్లాట్‌ ఉంటే కొంతమంది బిల్డర్లు చదరపు అడుగుకి రూ.100 నుంచి రూ.500 వరకు అదనంగా తీసుకుంటున్నారు.

* పార్కింగ్‌కు, సదుపాయాలకు మరికొంత చెల్లించాల్సి ఉంటుంది.  రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్కింగ్‌ లాట్లను బట్టి వసూలు చేస్తున్నారు.

* భవిష్యత్తు అవసరాల కోసం కార్పస్‌ ఫండ్‌ వసూలు చేస్తుంటారు. బిల్డర్‌ వసూలు చేసినా కమ్యూనిటీ సొసైటీకి అప్పగిస్తారు. ఇది చదరపు అడుగు రూ.40 నుంచి రూ.60 వరకు ఉంటోంది.

* మొదటి రెండేళ్లు నిర్మాణదారులే ఆయా కమ్యూనిటీల నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ఇందుకోసం చదరపు అడుగుకి ప్రతినెలా రూ.4 కొందరు వసూలు చేస్తుంటే.. రెండేళ్లకు కలిపి రూ.50 నుంచి రూ.70 వరకు మరికొందరు వసూలు చేస్తున్నారు.

* ఇంటి కోసం చెల్లించే సొమ్ముకు అదనంగా 5 శాతం జీఎస్‌టీ  ఉంటుంది. జీఎస్‌టీ తగ్గించకముందు మొదలెట్టిన ప్రాజెక్టుల్లో అయితే ఇది 12 శాతం ఉంది.

* ఇంటి రిజిస్ట్రేషన్‌ కోసం స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలన్నీ కలిపి ఇంటి విలువలో 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని