కలల నివాసం.. కలపతో కలకాలం

కలప ఇళ్లకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు శివార్లలోని తమ విల్లాలను పూర్తిగా కలపతో నిర్మించుకుని నివసిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కలపతో చూడచక్కని ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకంగా చెబితే తప్ప కలప ఇల్లని గుర్తించలేని రీతిలో ఈ డిజైన్లు ఉంటున్నాయి.

Updated : 01 Oct 2022 10:27 IST

ఇంటి నిర్మాణంలో మారుతున్న ధోరణులు
ఈనాడు, హైదరాబాద్‌

కలప ఇళ్లకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు శివార్లలోని తమ విల్లాలను పూర్తిగా కలపతో నిర్మించుకుని నివసిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కలపతో చూడచక్కని ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకంగా చెబితే తప్ప కలప ఇల్లని గుర్తించలేని రీతిలో ఈ డిజైన్లు ఉంటున్నాయి. కాంక్రీట్‌ నిర్మాణాలతో పోలిస్తే నిర్మాణ వ్యయం కాస్త ఎక్కువే అయినా.. మున్ముందు తగ్గే అవకాశం ఉందంటున్నారు. పర్యావరణ పరంగా మేలని చెబుతున్నారు.

నగరంలో ఎక్కడ కలప ఇల్లు కట్టినా దూరాభారం లెక్కచేయక చూసి వచ్చే వారున్నారు. ఈ తరహా ఇళ్లు మనకు కొత్త కావడంతో సామాన్యులే కాదు ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తమకున్న ఇంటి స్థలంలో అలాంటి విల్లాను కట్టుకోవాలని కలలు కంటున్నారు. శివార్లలో ఇటీవల వుడ్‌ విల్లా ఒకటి పూర్తయితే చూడటానికి సామాన్యులు, బిల్డర్లు పలువురు తరలివెళ్లారు. ఎలా కట్టారు? ఎంత ఖర్చవుతుంది? పదిలంగా ఉంటుందా? అని ఆరా తీశారు. కెనడియన్‌ వుడ్‌ సాంకేతిక సలహాదారు పీటర్‌ బ్రాడ్‌ఫీల్డ్‌ వారికి సమాధానాలిచ్చారు.

నచ్చిన డిజైన్‌లో..
కాంక్రీట్‌ నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ వైవిధ్యం చూపించేందుకు అవకాశం ఉండదు. కలపతో కట్టే ఇళ్లలో కావాల్సిన రీతిలో ఇంటిని డిజైన్‌ చేయించుకోవచ్చు. ఒక అంతస్తులో ఉండే రిసార్టు నిర్మాణాలను టంగ్‌ అండ్‌ గ్రూ విధానంలో డిజైన్‌ చేస్తారు. జి+1 నుంచి 4 వరకు వుడ్‌ ఫ్రేమ్‌ డిజైన్‌ అనుకూలం. లోడ్‌ ఆధారిత డిజైన్‌ ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకుంటాయి.

మన్నిక ఉంటుందా?
కాంక్రీట్‌ పునాదిపై వుడ్‌ ఫ్రేమ్‌ కన్‌స్ట్రక్షన్‌(డబ్ల్యూఎఫ్‌సీ) విధానంలో కలప ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఫ్యాక్టరీలో తయారు చేసిన స్ట్రక్చరల్‌ వుడ్‌ ప్యానెళ్లతో గోడలు, గచ్చు, పైకప్పు నిర్మిస్తారు. స్లాబ్‌లు సైతం చెక్కలతో రెండు దశల్లో వేస్తారు. ఒకదానిపై ఒక కలపను పేర్చే గ్లూ పద్ధతి ఒకటికాగా.. మరొకటి క్రాస్‌ పద్ధతిలో వేర్వేరుగా బిగిస్తారు. కాంక్రీట్‌ మాదిరి దృఢంగా ఉంటుంది. పై అంతస్తు స్లాబు మాత్రం ఏటవాలుగా ఉంటుంది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఈ ఏర్పాటు. తారుతో చేసిన ప్రత్యేక టైల్స్‌ పైకప్పుపైన వాడతారు. నిర్మాణ సమయంలో జాగ్రత్తగా ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేపడతారు. క్రమం తప్పక నిర్వహణ ఉంటే వందేళ్లు మన్నికనిస్తుంది.

మన వద్ద ఎక్కడైనా ఉన్నాయా?
భారత్‌లో ప్రస్తుతం పలుచోట్ల డబ్ల్యూఎఫ్‌సీ సాంకేతికతను వినియోగించి నిర్మాణాలు చేపడుతున్నారు. చెన్నై, మైసూర్‌, బెంగళూరులో రిసార్ట్‌ హోమ్స్‌, డిస్‌ప్లే హోమ్స్‌ కట్టారు. హైదరాబాద్‌లో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వుడ్‌విల్లా నిర్మించారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కలపతో ఇళ్ల నిర్మాణాలు సహజం. ఉత్తర అమెరికాలో ఏటా మిలియన్‌ కొత్త ఇళ్ల నిర్మాణం వీటితో చేపడుతుంటారు. కలప నిర్మాణ ఇళ్ల సాంకేతికతలో కెనడా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.

మంటలను తట్టుకుంటాయా?
అగ్నిప్రమాదాల గురించి భయపడక్కర్లేదు. ఫైర్‌ రేటింగ్‌ కలప కాబట్టి త్వరగా మంటలు అంటుకోవు. డబ్ల్యూఎఫ్‌సీలోనే మంటలను తట్టుకునేలా డిజైన్‌ వ్యవస్థ ఉంటుంది. ఫైర్‌ రేటింగ్‌ జిప్‌రాక్‌ వంటివి కలపతో పాటు వినియోగిస్తారు. కొన్ని గంటలపాటు మంటలను అదుపు చేయగలవు. అగ్ని నిరోధక గోడలు, సీలింగ్‌ ఇన్సులేషన్‌ ఏర్పాటు ఉంటుంది. శాస్త్రీయంగా నిరూపితమైంది.

చలి కాలంలో ఎలా?
సాధారణంగా చెక్క తలుపులు, కిటికీలు చలికాలంలో వ్యాకోచిస్తుంటాయి. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే కెనడియన్‌ వుడ్‌లో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఏ మేరకు ప్రభావితమవుతాయో ముందే అంచనా వేసి ఆ మేరకు అంతర్గతంగా సర్దుబాటు వ్యవస్థ ఉంటుంది. కాంక్రీట్‌, ఉక్కుల కంటే మంచి ఇన్సులేటర్‌గా పనిచేస్తుంది. వేడి, చలిని తట్టుకుంటుంది. ఇంట్లో నివసించే వారికి సౌకర్యంగా ఉంటుంది.

చెదలు పడతాయా?
నగర వాతావరణంలో కలపకు చెదలు పడుతుంటాయి. ఇదో పెద్ద సవాల్‌. చెదలు పట్టకుండా ఇంటి చుట్టూ భూమిలోనే ప్రత్యేక రసాయనాలు కలిపితే నివారించవచ్చు. ఆరునెలలకు ఒకసారి ఈ ప్రక్రియ చేస్తుండాలి.

3 నుంచి 6 నెలల్లోనే..
సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఏడాది పడుతుంది. కలపతో కట్టే ఇళ్లను 3-6 ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేయొచ్చు. 6500 చదరపు అడుగుల ఇంటిని సైతం ఆరు నెలల్లో కట్టేయొచ్చు. ఫ్లోర్‌ను మొదట కాంక్రీట్‌తో నిర్మించుకున్న తర్వాత మిగతా కలప పనులన్నీ చకచకా జరిగిపోతుంటాయి. 70 శాతం పని వర్క్‌షాపులోనే పూర్తవుతుంది. వేర్వేరు పరిమాణాల్లో ఉన్న కలప దుంగలను తీసుకొచ్చి బిగించడమే సైట్‌లో పని. తలుపులు, కిటికీలు ఎలా కావాలో నిర్ణయించుకోవచ్చు. మోడల్‌ హౌస్‌ కాబట్టి దాదాపు ఏడాది పట్టింది. మామూలుగా ఆరు నెలలలోపే పూర్తి చేయొచ్చు.

వ్యయం ఎక్కువే..
కాంక్రీట్‌తో పోలిస్తే కలపతో కట్టే ఇంటికి ప్రస్తుతం వ్యయం ఎక్కువే అవుతోంది. విదేశాల నుంచి కలపను దిగుమతి చేసుకోవాలి. దిగుమతి సుంకం 11 శాతంగా ఉంది. జీఎస్‌టీ 18 శాతం వేస్తున్నారు. కాంక్రీట్‌తో పోలిస్తే 50 శాతం వరకు వ్యయం పెరుగుతుంది. ఇంటి నిర్మాణ విస్తీర్ణం, డిజైన్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. భవిష్యత్తులో పన్నులు తగ్గి, రాయితీలు ఇస్తే కాంక్రీట్‌తో సమానంగా వీటి ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని