Published : 12 Nov 2022 00:56 IST

తలుపుల తలపులు

ఇంటీరియర్స్‌కు తగ్గట్టుగా గుమ్మాలు
ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి నిర్మాణంలో ఇదివరకు తలుపులు భాగం.. ఇప్పుడు ఇంటీరియర్స్‌లో భాగంగా చూస్తున్నారు. ప్రధాన ద్వారం వరకే కాకుండా ఇంట్లోని ప్రతి గుమ్మం, ప్రతి గది తలుపులు ఇంట్లోవారి అభిరుచి, ఇంటీరియర్స్‌కు తగ్గట్టుగా ఉండేలా డిజైన్‌ చేయించుకుంటున్నారు. అంతగా వాటిని తీర్చిదిద్దుకుంటున్నారు.

ఇంట్లో ప్రతి గుమ్మం, తలుపులు కొన్నేళ్ల క్రితం వరకు చూస్తే ఎక్కువగా టేకు కలపతో చేయించేవారు. మన్నికతో పాటూ ఇంటికి అందం, హోదాని తీసుకొచ్చేవి. కలప క్రమంగా ఖరీదుగా మారడంతో ప్రధాన గుమ్మం, తలుపులకు మాత్రమే టేకు పరిమితమైంది. ఇప్పుడు ఎక్కువగా డిజైనర్‌ తలుపులు వస్తున్నాయి. ఎక్కువ డిజైన్‌కు అవకాశం ఉండటం, సాంకేతికతను జోడించేందుకు అనువుగా ఉండటంతో ఇప్పుడు ప్రధాన ద్వారం నుంచి స్నానాల గదుల వరకు ప్లైవుడ్‌, ఎండీఎఫ్‌, పార్టికల్‌ బోర్డుతో తయారు చేసిన వినీర్‌, లామినేటెడ్‌ తలుపులు, గుమ్మాలు ఉపయోగిస్తున్నారు.

* తలుపుల లోపల సాలిడ్‌ వుడ్‌, పార్టికల్‌ బోర్డు, జర్మన్‌ ట్యూబలర్‌ బోర్డు, హానికొంబ్‌ ఉపయోగించి, ఉపరితలంలో మాత్రం ప్లైవుడ్‌, హెచ్‌డీహెచ్‌ఎంఆర్‌, హెచ్‌డీఎఫ్‌, ఏబీఎస్‌ ఉపయోగిస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు.

* గుమ్మాలను నేచురల్‌ వుడ్‌, ప్రొఫైల్‌ వ్రాపింగ్‌, క్లాడింగ్‌తో తయారు చేస్తున్నారు. నేచురల్‌ వుడ్‌లో ఇండియన్‌ టేకు, స్టీమ్‌ బీచ్‌, అఫ్రికన్‌ టేకు, రెడ్‌ మిరంటి కలపను ఉపయోగించి రూపొందిస్తున్నారు. ఆఖరులో పాలిష్‌ చేయడం, పెయింట్‌ వేయడం ద్వారా కావాల్సిన రంగుల్లో దొరికేలా చూస్తున్నారు. ఇవన్నీ ఫ్యాక్టరీలో యంత్రాలపై తయారవుతాయి. మార్కెట్లో పలు బ్రాండ్ల తలుపులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఆర్డర్‌ ఇస్తే వారే వచ్చి బిగించి వెళతారు.

వినీర్‌ ..

ఇది కూడా కలపనే. గట్టి చెక్కతో కూడిన పలుచని పొరని వినియోగించి రూపొందిస్తారు. నచ్చిన డిజైన్‌ వచ్చేలా పైన వినీర్‌ పూత పూస్తారు. ఇల్లు, కార్యాలయాల డెకార్‌కు తగ్గట్టుగా  ఉండటంతో వినీర్‌ తలుపుల వినియోగం ఇటీవల కాలంలో పెరిగింది. పైన వేసే కోటింగ్‌తో మరకలు పడవని.. దీర్ఘకాలం మన్నికనిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. గుమ్మంతో సహా తలుపు ఉంటుంది కాబట్టి ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది. ఇందులో ఆరేడు రకాల డిజైన్లు, రంగులు అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చింది.. ఇంటీరియర్‌కు నప్పింది ఎంపిక చేసుకోవచ్చు.

లామినేటెడ్‌

వీటి వినియోగమూ బాగా పెరిగింది. ఫ్లాట్‌ పేపర్లు, రెసిన్‌లను కలిపి నొక్కడం ద్వారా లామినేటెడ్‌ ఫ్లష్‌ తలుపులు తయారవుతాయి. ఉపరితలంలో కావాల్సిన డిజైన్‌ వేసుకోవడానికి వీలుంటుంది. గీతలు పడవు. వీటి నిర్వహణ సైతం సులువే. నీటిని సైతం తట్టుకుంటుంది కాబట్టి ఎక్కువకాలం మన్నికనిస్తుంది.
* పడక గదులకు, తడి ఉండే స్నానాల గదులు, బాల్కనీలకు అనుకూలంగా ఉంటాయి.

సానుకూలతలు...

* సాధారణ కలపలో ఎక్కువ ఎత్తు, వెడల్పులో గుమ్మాలు, తలుపులు చేయించడం కష్టం. వీటితో కావాల్సిన పరిమాణంలో చేయించుకోవచ్చు. 10 అడుగుల ఎత్తులోనూ తలుపులు చేయించుకోవచ్చు.
* వినీర్‌, లామినేటెడ్‌ మాత్రమే కాకుండా కాస్త భిన్నమైన ఇంటీరియర్‌ కోరుకునేవారు స్కిన్‌ డోర్‌, పెయింట్‌ డోర్లు సైతం వినియోగిస్తున్నారు.
* గోడలు, గుమ్మాల మధ్య పగుళ్లతో అంద వికారంగా కనిపిస్తుంటాయి. ఈ లోపం కనిపించకుండా గోడపైకి తలుపులకు, గుమ్మాలకు ఉపయోగించే కలపతోనే ఆర్కిట్రెవ్స్‌ను జోడిస్తారు. దీంతో లుక్‌ ఒక్కసారిగా మారిపోతుంది.
* బడ్జెట్‌ ధరల్లో ఇవి అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. వీటి బిగింపు సైతం తయారీదారులే చూసుకుంటారు. ప్రత్యేకంగా వడ్రంగితో పనిలేదు. బయోమెట్రిక్‌ లాక్‌ వంటివి జోడించుకోవచ్చు. ఇవన్నీ కలిపి కూడా విక్రయిస్తున్నారు. వీటిని ప్రి హగ్‌ డోర్స్‌గా చెబుతున్నారు. తలుపులు, గుమ్మాలు, అర్కిట్రెవ్‌, హార్డ్‌వేర్‌, బిగింపు ఒక ప్యాకేజీగా తయారీ సంస్థలు అందిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని