17, 18 తేదీల్లో సివిల్‌ ఇంజినీర్ల జాతీయ సదస్సు

సివిల్‌ ఇంజినీర్ల జాతీయ సదస్సు (నాట్కాన్‌-2023)కు హైదరాబాద్‌ వేదిక కానుందని అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ -ఇండియా (ఏసీసీఈఐ) సౌత్‌ ఇండియా ఉపాధ్యక్షులు, రాజ్‌కుమార్‌ కాచర్ల తెలిపారు.

Published : 01 Jul 2023 02:56 IST

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సివిల్‌ ఇంజినీర్ల జాతీయ సదస్సు (నాట్కాన్‌-2023)కు హైదరాబాద్‌ వేదిక కానుందని అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ -ఇండియా (ఏసీసీఈఐ) సౌత్‌ ఇండియా ఉపాధ్యక్షులు, రాజ్‌కుమార్‌ కాచర్ల తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో హెచ్‌ఐసీసీలో ఈ సమ్మేళనం జరుగనుందని పేర్కొన్నారు. శుక్రవారం గ్రీన్‌ల్యాండ్స్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏటా ఒక్కో రాష్ట్రంలో జరిగే ఈ సమ్మేళనం ప్రతిసారి ఒక ప్రత్యేక అంశంపై జరుగుతుందని, ఈ ఏడాది ‘టాల్‌ బిల్డింగ్‌’ అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అతి ఎత్తైన భవనాలు గల రాజధానిగా ముంబయి తొలిస్థానంలో, హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నాయని, త్వరలో హైదరాబాద్‌ నగరం ముంబయిని అధిగమించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకప్పుడు నగరం అంటే చార్మినార్‌ గుర్తొచ్చేంది, ఇప్పుడు సైబర్‌ టవర్స్‌, మరిన్ని ఐకానిక్‌ నిర్మాణాలు ఉన్నాయని, ఇందుకు సివిల్‌ ఇంజినీర్ల కృషే కారణమన్నారు. దేశ వ్యాప్తంగా 600 మంది సివిల్‌ ఇంజినీర్లు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. అనంతరం ఏఐసీసీఈఐ హైదరాబాద్‌ శాఖ ఛైర్మన్‌ ఎ.కాశీరామ్‌, కార్యదర్శి జె.భీమ్‌రావు, కోశాధికారి సి.రమేష్‌, కార్యవర్గ సభ్యులు సీహెచ్‌ నర్మద, రంగారావు తదితరులతో కలిసి నాట్కాన్‌ బ్రోచర్‌ను రాజ్‌కుమార్‌ ఆవిష్కరించారు.

సివిల్‌ ఇంజినీర్ల కొరత.

మన దేశంలో సివిల్‌ ఇంజినీర్ల కొరత ఎక్కువగా ఉందని ఏసీసీఈఐ అంటోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఐటీ కోర్సులు చేస్తున్నారని సివిల్‌ వైపు రావడం లేదన్నారు. భవిష్యత్తులో సివిల్‌ ఇంజినీర్లకు అఖిల భారత సర్వీసులకు ఉన్నంత క్రేజ్‌ రాబోతుందన్నారు. భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేయబోతుందన్నారు. వంతెనలు, రహదారులు, విమానాశ్రయాలు, మెట్రోలు, గృహాలు, ఆసుపత్రులు, ఉద్యానాలు, సొరంగాలు, స్టేడియాల వరకు ఎన్నో నిర్మాణాలు రాబోతున్నాయని సివిల్‌ ఇంజినీర్ల అవసరం అధికంగా ఉందని అసోసియేషన్‌ అభిప్రాయపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని