కిటికీ అద్దాల నుంచే కావాల్సిన కరెంట్‌

ఇంటికి కావాల్సిన కరెంట్‌ కోసం ఇకపై భవనం పైనే సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. కిటికీ అద్దాల నుంచి కూడా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఏ గదికి కావాల్సిన విద్యుత్తును ఆ గదిలోని కిటికీల నుంచే తీసుకోవచ్చు.

Updated : 15 Jul 2023 13:23 IST

బీఐపీవీతో బహుళ ప్రయోజనం
సౌర విద్యుత్తులో సరికొత్త సాంకేతికతలు
డిజైన్‌ దశలోనే ప్రణాళికతో వ్యయం తగ్గుతుందంటున్న ఐజీబీసీ

ఇంటికి కావాల్సిన కరెంట్‌ కోసం ఇకపై భవనం పైనే సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. కిటికీ అద్దాల నుంచి కూడా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఏ గదికి కావాల్సిన విద్యుత్తును ఆ గదిలోని కిటికీల నుంచే తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌ ఫొటో వొల్టాయిక్స్‌(బీఐపీవీ) సాంకేతికత దీన్ని సాధ్యం చేసింది.

ఈనాడు, హైదరాబాద్‌

సురేశ్‌ ఒక బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నారు. తన ఫ్లాట్‌ని సౌర విద్యుత్తుతో నెట్‌ జీరో ఎనర్జీగా మార్చుకోవాలనే ఆలోచన ఉన్నా.. అపార్ట్‌మెంట్‌ కాబట్టి అందరి ఆమోదంతో భవనంపైన సౌర ఫలకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఇబ్బంది ఇలా ఉంటే... ఆకాశహర్మ్యాలను కడుతున్న బిల్డర్‌లది ఇంకో సమస్య. 100 ఫ్లాట్లు దాటిన గృహ నిర్మాణంలో సౌర విద్యుత్తు ఏర్పాటు తప్పనిసరి అనే నిబంధన ఉంది. కానీ ఎత్తైన భవనాల్లో పైన అంత స్థలం ఉండటం లేదనేది వీరి ఆవేదన. వీటిన్నింటికీ పరిష్కారం చూపుతోంది కొత్తగా వచ్చిన సమీకృత భవన సౌర ఫలకాలు అంటున్నారు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నిపుణులు.

ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం ఇళ్లలో ఎక్కువగా అద్దాల కిటికీలను, అద్దాల స్లైడింగ్‌ డోర్‌లను ఉపయోగిస్తున్నారు. పారదర్శకమైన అద్దాల కారణంగా ఇంట్లోకి ఎక్కువ వెలుతురు ప్రసరిస్తోంది. కార్యాలయాల్లో అయితే బయటి వైపు గోడల స్థానంలో పూర్తిగా అద్దాలనే వాడుతున్నారు. ఈ అద్దాలపైన పల్చని ఫొటోవొల్టాయిక్స్‌(పీవీ)ను జోడిస్తున్నారు. సెమీ ట్రాన్స్‌పరెంట్‌ థిన్‌ ఫిల్మ్‌ పీవీని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఏర్పాటు చేసినప్పటికీ సహజమైన పగటి వెలుతురుకు ఢోకా ఉండదు. వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. సంప్రదాయ గాజు కిటికీలను పాక్షిక పారదర్శకంగా ఉండేలా సన్నని పొర, స్పటికాకార సౌర ఫలకాలతో తయారు చేస్తారు.

నిర్మాణ  సమయంలోనే

సమీకృత భవన సౌర ఫలకాలను నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేసుకుంటే వ్యయం పరంగా కలిసి వస్తుంది. భవనం ఎలివేషన్‌లో సాధారణ గాజు స్థానంలో బీఐపీవీ జోడించిన గాజును ఉపయోగిస్తే పెరిగే వ్యయాన్ని తగ్గించవచ్చు. సౌర ఫలకాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా స్థలం కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. డిజైన్‌ సమస్యలు ఉండవు అని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటిని నిర్మాణ రూపకల్పన దశలోనే ప్రణాళికలో చేర్చుకుంటే మేలని చెబుతున్నారు.

బాల్కనీల్లో...

  • పాత భవనాల్లో వీటి ఏర్పాటు కాస్త వ్యయంతో కూడుకున్నదే. స్థలాభావం సమస్య ఉన్నవాళ్లు మాత్రమే వీటిని ప్రయత్నించవచ్చు.
  • ప్రస్తుతం బాల్కనీలకు ఎక్కువగా గాజు అద్దాల డిజైన్లు ఉంటున్నాయి. ఇక్కడ బీఐపీవీని ఏర్పాటు చేసుకోవచ్చు.
  • ఇంటికి ఎలివేషన్‌ ఫెకెడ్‌ భాగంలో కావాల్సిన చోట్ల వదిలేసి మిగతా చోట్ల వీటిని బిగించుకోవచ్చు. గతంలో అయితే చూడగానే సౌర ఫలకాలుగా కనిపించేవి. ఇప్పుడు వస్తున్న ఆధునిక పీవీ ఫలకాలు సాధారణ గాజు మాదిరిగానే ఉంటుండంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని పరిశీలించవచ్చు.
  • ఇప్పటికే కొన్ని భవనాల్లో పార్కింగ్‌ ప్రదేశాల్లో ఈ తరహా ఫలకాలను పైకప్పులకు ఉపయోగిస్తున్నారు. ఉప్పల్‌లోని మెట్రో డిపోలో పార్కింగ్‌ పైకప్పులకు వీటిని ఉపయోగించారు.

దక్షిణం, ఉత్తరం వైపు ఉత్తమం

సౌర విద్యుత్తు సాంకేతికతల్లో చాలా మార్పులు వస్తున్నాయి. గచ్చిబౌలిలోని మా ఐజీబీసీ భవనంపైన దేశంలోనే మొదటిసారిగా బైఫెసియల్‌ సోలార్‌ పీవీ వాడాం. సౌర ఫలకాలు పైన, కింద రెండు వైపుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇంతకంటే కొత్తగా సాంకేతికతలు ఇప్పుడు వస్తున్నాయి. ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్‌ సర్టిఫైడ్‌ చేసిన ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఒక భవనం ముందు వైపు సమీకృత భవన సౌర ఫలకాల(బీఐపీవీ) సాంకేతికతతో అద్దాలను ఏర్పాటు చేశారు. 9.8 కిలోవాట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ తరహాలో కిటికీలకు బీఐపీవీని వాడుకోవచ్చు. కిటికీ మొత్తం కాకుండా కింది భాగంలో కొంత, పై భాగంలో కొంత.. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు.  ఎండనే ఉండక్కర్లేదు. సౌర విద్యుత్తు ఉత్పత్తికి వెలుతురు ఉంటే చాలు. దక్షిణం, పశ్చిమం వైపు ఎండ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువైపు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ విద్యుత్తు వస్తుంది. ఎండ నుంచి రక్షణ ఉంటుంది. పైగా వీటిలో మరో సానుకూలత ఉంది. ఎక్కడి కరెంట్‌ను అక్కడ వాడుకునే వెసులుబాటుతో సరఫరా నష్టాలు ఉండవు.

ఎం. ఆనంద్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐజీబీసీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని