భవనంలోనీటి లీకేజీలను అరికట్టొచ్చు

విస్తారంగా కురిసే వర్షాలతో ఆనందంగా ఉన్నా... తెరపినివ్వని వానలతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో భవనాల గోడలకు తేమ రావడం, శ్లాబులు కారడం ఆందోళనకు గురిచేస్తోంది.

Published : 29 Jul 2023 00:41 IST

శ్లాబులో సమస్య మూలం గుర్తించడం ముఖ్యం  
మున్ముందు అన్ని వైపులా రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి అవకాశం
ఈనాడు’తో తెలంగాణ క్రెడాయ్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ రాంచంద్రారెడ్డి

విస్తారంగా కురిసే వర్షాలతో ఆనందంగా ఉన్నా... తెరపినివ్వని వానలతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో భవనాల గోడలకు తేమ రావడం, శ్లాబులు కారడం ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మాణపర లోపాలు కొందర్ని వానాకాలంలో ప్రశాంతతకు దూరం చేస్తోంది. ఈ సమస్యలకు అసలు కారణమేంటి? నివారించేందుకు ఉన్న పరిష్కారాలు ఏంటి? భవిష్యత్తులో హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ ఎలా ఉంటుంది? ఇప్పుడు కొనాలా? వేచిచూడాలా? వంటి ప్రశ్నలకు ‘ఈనాడు’ ముఖాముఖిలో సమాధానమిచ్చారు క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ సీహెచ్‌ రాంచంద్రారెడ్డి.

* వర్షాలతో పలు భవనాల్లో లీకేజీలు ఎదురవుతున్నాయి. పగుళ్లు కూడా పెద్ద సమస్య.?

నిర్మాణాల్లో వందశాతం నిర్మూలించలేని అంశాలు రెండు ఉంటాయి. ఒకటి పగుళ్లు, రెండోది లీకేజీ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత మంచి కాంక్రీట్‌ మిక్సింగ్‌ వాడినా వేర్వేరు కారణాలతో ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. స్లాబు, కాలమ్స్‌, బీమ్స్‌లో మిక్స్‌ వాడేటప్పుడు ఇదివరకు ఎం-15 వాడేవారు. ఇటీవల వరకు ఎం-20, ఇప్పుడు ఎం-25 ఉపయోగిస్తున్నారు. ఎం-25 కాంక్రీట్‌ నిష్పత్తి 1:1:2లో ఉంటుంది. అంటే ఒక కిలో సిమెంట్‌, ఒక కిలో ఇసుక, రెండు కిలోల కంకర మిశ్రమంగా తయారవుతుంది. లీకేజీకి ఆస్కారం లేకుండా గట్టిదనం ఉంటుంది. 50 మీటర్ల ఎత్తైన నిర్మాణాలకైతే ఎం-35 రకం మిక్స్‌ వాడాలి. ఈ ప్రమాణాలన్నీ పాటిస్తున్నా... సరైన వైబ్రేటింగ్‌ జరగక, రీ ఇన్‌ఫోర్స్‌మెంట్‌ సరిగ్గా లేకపోవడం, కాలమ్స్‌ గోడల జంక్షన్స్‌ ప్యాకేజీ సరిగ్గా లేకపోవడం, బీమ్‌, గోడల మధ్య అంతరం సరిగ్గా పూడ్చకపోవడం, కాంక్రీట్‌ బెడ్‌ వేసినా కుంగిపోవడంతో అంతరం ఉండిపోతుంది. బీమ్‌, 9 అంగుళాల గోడ మధ్యలో ఉండే గ్యాప్‌ సరిగా పూడ్చకుండా రెండు వైపులా ప్లాస్టరింగ్‌ చేసినా లోపల ఉండే గాలి వల్ల వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు వ్యాకోచించి పగుళ్లకు దారితీస్తుంది. వీటి నుంచి నీరు చేరి లీకేజీ అవుతుంటాయి.  ఇవన్నీ పక్కాగా చేయాలని ఉన్నా.. ఆచరణలో అదే స్థాయి లేకపోవడంతో  సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

* పాత, కొత్త భవనాల్లోనూ టెర్రస్‌ లీకేజీ వేధిస్తోంది?

శ్లాబు లీకేజీ సమస్య లేకుండా టెర్రస్‌ను వాటర్‌ ఫ్రూఫింగ్‌ చేయాలి. ఇది చేసేటప్పుడు శ్లాబ్‌పై పడిన సిమెంట్‌ మాల్‌ను తొలగించి,  మదర్‌ శ్లాబ్‌ కన్పించే వరకు చిప్పింగ్‌ చేసి వేర్వేరు ఉత్పత్తులు రసాయనాలు మిళితం చేసి చేస్తుంటారు. ఇవన్నీ పక్కాగా . లేకపోతే లీకేజీకి దారితీస్తుంది. మొదట చిన్న పగుళ్లు  ఏర్పడి అందులోంచి నీరు చేరి.. ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడి నుంచి లీకవుతుంది. శ్లాబు చేస్తున్నప్పుడు నీళ్లు నింపి..ఎక్కడ నీరు లీకవుతుందో చూసి కింద నుంచి ఆ కాంక్రీట్‌ గ్యాప్‌లను నింపేందుకు యంత్రం సాయంతో ప్రెజర్‌ గ్రౌట్‌ చేస్తుంటాం. నిర్మాణ సమయంలో ఇవన్నీ సక్రమంగా జరగకపోతే లీకేజీలు ఎదురవుతుంటాయి.

* అరికట్టడానికి ఎలాంటి పద్ధతులున్నాయి?

మార్కెట్లో ప్రధానంగా మూడు కంపెనీలు లీకేజీని నిరోధించే ఉత్పత్తులు అందిస్తున్నాయి. ముందుగా లీకేజీలను నిపుణులకు చూపిస్తే వారు పరిస్థితిని అంచనా వేస్తారు. కొత్త భవనాల్లో ప్రధానంగా గోడలు, పైకప్పులు, అంతస్తుల ద్వారా తేమ చేరుతుంది. పైకప్పుల్లో తేమ కన్పిస్తే ప్రెజర్‌ గ్రౌట్‌ చేసి పైన ఎక్కడి నుంచి నీరు చేరుతుందో గుర్తించి దానిని సరిచేయాలి. ఎక్కువగా గోడ నుంచి గ్యాప్‌ల రూపంలో కిందకి కారే అవకాశం ఉంది. శ్లాబు అతుకుల వద్ద, మెట్ల వద్ద, వాష్‌ ఏరియా నుంచి నీరు కిందకు దిగే అవకాశం ఉంది. పాత భవనాలైతే శ్లాబులోనే పగుళ్లు రావడం కన్పిస్తుంది. ఇలాంటి వాటికి వాటర్‌ప్రూఫింగ్‌ తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. వీటికి డాంబర్‌ షీట్‌ వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పగుళ్లు ఉన్నచోట వేసి మిగతాది వాటర్‌ప్రూఫింగ్‌ చేయించుకుంటే కారడం ఆగిపోతుంది.    

* స్నానాల గదుల సమస్యలకు పరిష్కారమెలా?

అపార్ట్‌మెంట్లలో, వ్యక్తిగత ఇళ్లలో పై అంతస్తులోని స్నానాల గదుల్లోంచి నీరు లీకై కింది అంతస్తులో పడుతుంది. టైల్స్‌ వేసినప్పుడు గ్రౌటింగ్‌ సరిగ్గా చేయకపోవడం, నాన్‌ట్రాప్‌ సరిగ్గా బిగించక పోయినా ఈ సమస్యలుంటాయి. గోడల లోపల పీవీసీ పైపులు ఉంటాయి. ఇవి సరిగ్గా ఎక్కడ ఉన్నాయో తెలియకుండా సబ్బు స్టాండ్‌ పెట్టేందుకు గోడకు రంధ్రం చేస్తారు. దీంతో పైపుల్లో లీకేజీ ఏర్పడుతుంది. టైల్స్‌ వేసేటప్పుడు కూడా కొన్నిసార్లు గోడను, శ్లాబ్‌ను చిప్పింగ్‌ చేస్తుంటారు. వీటి కారణంగానూ లోపల ఉండే పైపులు దెబ్బతిని లీకేజీలు ఏర్పడతాయి. పైపుల జాయింట్ల వద్ద సైతం లీకేజీలు ఉంటాయి. వీటికి ఒకసారి మరమ్మతులు చేయించుకుంటే ఆ తర్వాత పెద్దగా సమస్యలు ఉండవు. ఎప్పటికప్పుడు గ్రౌటింగ్‌ చేయించుకోవడం, నాన్‌ట్రాప్‌ ప్యాకింగ్‌ వంటివి చేయించుకుంటే సరి.

* రియల్‌ ఎస్టేట్‌ ఎలా ఉండబోతుంది?

హైదరాబాద్‌ నగరానికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ప్రభుత్వ చొరవతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. వీటితో పాటూ ఇక్కడ ఉన్న వాతావరణం, మౌలిక వసతులతో అందరూ హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. ప్రభుత్వం సైతం పశ్చిమ హైదరాబాద్‌లోనే మౌలిక వసతులు కాకుండా నగరం అన్నివైపులా అభివృద్ధి ఉండేలా చర్యలు చేపడుతోంది. ఐటీ కార్యాలయాలు నలువైపులా వస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌ అనుసంధానం ఉంది కాబట్టి అన్నివైపులా వృద్ధి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని