మాల్స్‌కు మంచి రోజులు

రియల్‌ ఎస్టేట్‌లో కీలమైన రిటైల్‌ విభాగం పుంజుకుంది. కొవిడ్‌ సమయంలో బాగా ప్రభావితమైన ఈ రంగం.. ఇప్పుడు పూర్వ కళను సంతరించుకుంది.

Updated : 19 Aug 2023 06:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌లో కీలమైన రిటైల్‌ విభాగం పుంజుకుంది. కొవిడ్‌ సమయంలో బాగా ప్రభావితమైన ఈ రంగం.. ఇప్పుడు పూర్వ కళను సంతరించుకుంది. మాల్స్‌లో సందర్శకుల సంఖ్య పెరగడం, షాపింగ్‌ సందడి నెలకొనడంతో రిటైల్‌ లీజింగ్‌ ఊపందుకుంది. మాల్స్‌, హైస్ట్రీట్స్‌, స్టాండలోన్‌ నిర్మాణాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో హైదరాబాద్‌ రిటైల్‌ లీజింగ్‌ 137 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతంతో పోలిస్తే వృద్ధి కనిపించినా.. రిటైల్‌ మార్కెట్‌ ఇంకా పెరగాల్సి ఉందని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌ చాలా వెనుకబడి ఉంది. ‘ఇండియా రిటైల్‌ ఫిగర్స్‌ హెచ్‌1 2023’ నివేదికను సీబీఆర్‌ఈ విడుదల చేసింది.
నగరంలో పలు ప్రాంతాల్లో మాల్స్‌ నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో నిర్మాణం పూర్తికాకముందే లీజింగ్‌లు జరుగుతుంటాయి. గత ఏడాది డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండటంతో పూర్తయ్యే దశకు చేరినా లీజింగ్‌లు పెద్దగా జరగలేదు. ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ఉంది.

  • జనవరి నుంచి జూన్‌ 23 వరకు 0.25 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌లు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం 0.10 మిలియన్‌ చ.అ. మాత్రమే.
  •  రిటైల్‌ లీజింగ్‌లో స్టోర్‌ల వాటా 33 శాతంగా ఉండగా.. ఫ్యాషన్‌, అపరెల్‌ దుకాణాలు, షోరూంల కోసం 30 శాతం తీసుకున్నారు. ఫుడ్‌
  • కోర్టుల వాటా 11 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా చూస్తే...  

  • రిటైల్‌ పరంగా దేశవ్యాప్తంగా 24 శాతం వార్షిక వృద్ధి కనిపించింది. జులై - డిసెంబరు 22తో పోలిస్తే 15 శాతం లీజింగ్‌ పెరిగింది.
  • ఈ ఏడాది తొలి ఆరునెలల్లో  2.90 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్‌ లీజింగ్‌ జరిగింది. గత ఏడాది ఇదే సమయంలో 2.31 మిలియన్‌ చ.అ.గా ఉంది.
  •  బెంగళూరు, దిల్లీ రాజధాని ప్రాంతం, అహ్మదాబాద్‌ మూడు నగరాల్లో కలిపి ఏకంగా 65 శాతం లీజింగ్‌ జరిగింది.

సరఫరా ఇలా..

రిటైల్‌ సరఫరా ఎలా ఉందనేది కూడా ముఖ్యం. తొలి ఆరునెలల్లో 148 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది 0.43 మిలియన్‌ చ.అ. నుంచి ఈ ఏడాది 1.09 మిలియన్‌ చ.అ.లకు పెరిగింది.

  • అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో మాల్స్‌ పూర్తిచేయడంలో 8 శాతం వృద్ధిని నమోదుచేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని