అద్దాల గోడలు.. అందమైన ఆవాసాలు

ఇంటి నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొంగొత్త మార్పులు కన్పిస్తుంటాయి. సమకాలీన అంశాలు నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి.

Updated : 18 Nov 2023 09:30 IST

ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొంగొత్త మార్పులు కన్పిస్తుంటాయి. సమకాలీన అంశాలు నిర్మాణంలో ప్రతిబింబిస్తుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. వీటిలో గృహ, వాణిజ్య భవనాలు ఉన్నాయి. కార్యాలయాల నిర్మాణాలన్నీ కూడా అద్దాల మేడల మాదిరి నిర్మిస్తున్నారు. ఒకటో అంతస్తు నుంచి 60వ అంతస్తుల వరకు అద్దాల డిజైన్లే దర్శనమిస్తున్నాయి. పాత పది అంతస్తుల కార్యాలయాల భవనాలను సైతం అద్దాలతో తీర్చిదిద్దుతున్నారు. దశాబ్దకాలంగా ఈ పోకడ సిటీలో చూస్తున్నదే. ఇదే ఇప్పుడు గృహ నిర్మాణంలోకి ప్రవేశించింది.

అపార్ట్‌మెంట్లలో ఎక్కువగా గోడలు దర్శనమిస్తుంటాయి. మొదట్లో మట్టి, సిమెంట్‌ ఇటుకలు ఉపయోగించినా.. నిర్మాణంలో వేగం పెరగడంతో మేవాన్‌ టెక్నాలజీతో కాంక్రీట్‌ గోడలు నిర్మిస్తున్నారు. పది అంతస్తులపైన ఉండే భవనాల్లో పూర్తిగా కాంక్రీట్‌తోనే గోడలు కడుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో అద్దాలను ఉపయోగించబోతున్నారు. కొత్త ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా దీన్ని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కొనుగోలుదారులకు వివరిస్తున్నాయి.

విదేశాల్లో మాదిరి

అభివృద్ధి చెందిన విదేశీ నగరాల్లో ఫ్లాట్లు.. అద్దాల మేడలతో దర్శనమిస్తుంటాయి. ఇంట్లో లివింగ్‌ రూం, పడక గది ఇలా ఎక్కడి నుంచైనా సిటీ మొత్తం కన్పిస్తుంటుంది. చాలా సినిమాల్లో మనవాళ్లు వీటిని చూసి మనసు పారేసుకున్నారు కూడా. ఇప్పుడు మన నగరంలోనూ ఈ తరహాలోనే ఇళ్లు కట్టబోతున్నారు.

నగరంలో ఆకాశహర్మ్యాల్లో స్కైవిల్లాలు, విల్లామెంట్‌లు డ్యూప్లెక్స్‌లు పెద్ద ఎత్తున కడుతున్నారు. ఆఖరు అంతస్తులో కట్టే విలాసవంతైన ఇళ్లను అద్దాల మేడలుగా తీర్చిదిద్దబోతున్నారు. గోడలకు ప్రత్యామ్నాయంగా స్లాబ్‌ దగ్గర్నుంచి గచ్చు వరకు అద్దాలనే వాడనున్నారు. ః అధిక వేడి లోపలికి రాకుండా డబుల్‌ గ్లేజ్‌డ్‌ అద్దాలను వినియోగించనున్నారు. భద్రతకు ఢోకా లేకుండా చర్యలు ఉంటాయి.

అద్దాల గదులతో కావాల్సినంత వెలుతురు ఇంట్లోకి ప్రసరిస్తుంది. నగరం మొత్తం చూడొచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా ఆస్వాదించవచ్చు.

వ్యక్తిగత ఆవాసాల్లోనూ..

ప్రీకాస్టింగ్‌ విధానంలో నిర్మించుకుంటున్న వ్యక్తిగత ఆవాసాల్లోనూ అద్దాల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందువైపు ఎలివేషన్‌ పూర్తిగా అద్దాలనే ఉపయోగించి మరింత అందంగా నిర్మించుకుంటున్నారు. ః ఇంటి యజమానుల అభిరుచులకు తగ్గట్టుగా ఆర్కిటెక్చర్లు వైవిధ్యమైన డిజైన్లను ఇస్తున్నారు. విదేశాల మాదిరి కావాలని యజమానులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని