విల్లా ఫ్లోర్‌లు.. వినూత్న ధోరణులు

నగర నిర్మాణంలో 2024లో నయా ధోరణులు కన్పిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన పలు కొత్త ప్రాజెక్టుల్లో వీటిని చూడొచ్చు. పోడియం ఫ్లోర్‌ల నుంచి విల్లా ఫ్లోర్‌ల వరకు కొత్త పేర్లు వినపడుతున్నాయి.

Updated : 03 Feb 2024 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగర నిర్మాణంలో 2024లో నయా ధోరణులు కన్పిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన పలు కొత్త ప్రాజెక్టుల్లో వీటిని చూడొచ్చు. పోడియం ఫ్లోర్‌ల నుంచి విల్లా ఫ్లోర్‌ల వరకు కొత్త పేర్లు వినపడుతున్నాయి.

పోడియం ఫ్లోర్‌లు..: ఆకాశహర్మ్యాల నిర్మాణంలో మూడు సెల్లార్ల వరకు వెళుతున్నారు. వీటిలో విద్యుత్తు ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుపై అనుమతి ఇవ్వడం లేదు. సహజ వెలుతురు ఉన్న చోటనే ఛార్జింగ్‌ పాయింట్లకు అనుమతి ఇస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సంస్థలు పోడియం ఫ్లోర్‌లు నిర్మిస్తున్నాయి. వీటిని స్టిల్ట్‌ వదిలి ఒకటి నుంచి నాలుగో అంతస్తు వరకు నిర్మిస్తున్నారు. సాధారణంగా 20 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదిలి ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు. పోడియం ఫ్లోర్‌లలో 3.5 మీటర్లు వదిలితే చాలని బిల్డర్లు అంటున్నారు. అగ్నిమాపక శటకం తిరగడానికి 7 నుంచి 8 మీటర్ల జాగా వదిలి మిగతా ప్రాంతాన్ని నాలుగువైపుల వీక్షించేలా ల్యాండ్‌స్కేప్‌తో అహ్లాదంగా ముస్తాబు చేస్తున్నారు.

విల్లా ఫ్లోర్‌లు..: ప్రస్తుతం మార్కెట్లో విల్లా ఫ్లోర్‌లు ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఒక ఫ్లోర్‌కు ఒకటే ఫ్లాట్‌ ఉంటుంది. వీటిని విల్లా ఫ్లోర్‌గా పిల్చుకుంటున్నారు. 3500 చ.అ. నుంచి వీటిని నిర్మిస్తున్నారు. అత్యంత విలాసవంతంగా విల్లాలో నివసించిన అనుభూతి వీటిలో సొంతం. ఐటీ కారిడారే కాదు.. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కొంపల్లి, శంషాబాద్‌ ప్రాంతాల్లోనూ ఈ తరహా ప్రాజెక్టులు చేపడుతున్నారు. విల్లా ఫ్లోర్‌ల కోసం ప్రత్యేకంగా లిఫ్ట్‌, కారిడార్‌ ఉంటున్నాయి.

టెర్రస్‌ డెక్‌లు..: విశాలమైన గేటెడ్‌ కమ్యూనిటీల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే జాగింగ్‌ ట్రాక్‌ ఉంటుంది. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మట్టి ట్రాక్‌పై నడక సాగిస్తుంటారు. కొన్ని కొత్త ప్రాజెక్టుల్లో చివరి అంతస్తుల్లో జాగింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే ఈతకొలనులు, డెక్‌లు, వ్యామాయ కేంద్రాలు ఉంటున్నాయి. నగర అందాలను  ఆస్వాదించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని