అవిభాజ్యపు స్థలం కొంటే అమ్ముకోలేరు!

స్థిరాస్తి విషయంలో ఇప్పటివరకు చాలా రకాలుగా కొనుగోలుదారులు మోసాల బారిన పడ్డారు. అనుమతుల్లేని ప్రాజెక్టుల్లో కొని చిక్కుల్లో పడినవారున్నారు.

Updated : 01 Aug 2020 03:12 IST

‘ఈనాడు’తో క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి విషయంలో ఇప్పటివరకు చాలా రకాలుగా కొనుగోలుదారులు మోసాల బారిన పడ్డారు. అనుమతుల్లేని ప్రాజెక్టుల్లో కొని చిక్కుల్లో పడినవారున్నారు. వీటి గురించి అవగాహన లేకనే ఎక్కువమంది ఆర్థికంగా నష్టపోతున్నారు. నిర్మాణ రంగంలోనూ ఇటీవల కొందరు బిల్డర్లు అత్యంత తక్కువ ధర అంటూ స్థలాన్ని అనైతికంగా విక్రయిస్తున్నారని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని క్రెడాయ్‌ హైదరాబాద్‌ సూచిస్తోంది. అవిభాజ్యపు స్థలం కొనడం అత్యంత ప్రమాదకరమని కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించేందుకు తొలిసారి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌), హైదరాబాద్‌ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు ‘ఈనాడు’తో మాట్లాడారు. వివరాలు.. ఆయన మాటల్లోనే..
జీహెచ్‌ఎంసీ పరిధిలో కానీ హెచ్‌ఎండీఏలో కానీ మున్సిపాలిటీలో కానీ.. ఫ్లాట్‌ అయినా, లేఅవుట్‌లో స్థలమైనా విక్రయించాలంటే ఆ సంస్థల నుంచి నిర్మాణ, లేఅవుట్‌ అనుమతి పొందాలి. ఈ వివరాలతో రెరాలో నమోదు చేయించాలి. ఆ తర్వాతే విక్రయించాలి. గత ఏడాది నుంచి కొందరు నిర్మాణదారులు అనైతిక విధానాలకు తెరతీశారు. ఒకచోట మూడు నాలుగు ఎకరాల స్థలం చూస్తున్నారు. కొంత మొత్తం భూయజమానికి చెల్లిస్తున్నారు. మిగతా మొత్తం చెల్లించడానికి వీరి వద్ద సొమ్ములు ఉండవు. ఈ స్థలాన్ని చూపించి ఇక్కడ అపార్ట్‌మెంట్‌, వాణిజ్య సముదాయం వస్తుందని.. అందులో మీకు ఫ్లాట్‌, వాణిజ్య స్థలం మార్కెట్‌ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని చెప్పి విక్రయిస్తున్నారు. అవిభాజ్యపు వాటా స్థలాన్ని కొనుగోలుదారుల పేరిట రిజిస్టర్‌ చేస్తున్నారు. ఆ రకంగా ఎకరా స్థలాన్ని 50 మంది వరకు విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలుదారులు కట్టిన సొమ్మును తీసుకెళ్లి భూయజమానికి చెల్లిస్తున్నారు.
మరి  కట్టడానికి..
ఇలా కొన్నవారందరి నుంచి బిల్డర్‌ జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కమ్‌ అగ్రిమెంట్‌ కమ్‌ జనరల్‌ పవరాఫ్‌ అటార్నీని రాయించుకుంటారు. ఆవిభాజ్యపు స్థలాన్ని నిర్మాణం చేపట్టడానికి బిల్డర్‌కు అప్పగిస్తారు. వీటి ఆధారంగా అనుమతులు పొంది నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. తక్కువ ధరకే విక్రయించడంతో నిర్మాణం చేపట్టడానికి ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిర్మాణం పూర్తి చేసేందుకు మూడు నాలుగేళ్లయినా పడుతుంది. రియల్‌ ఎస్టేట్‌లో ఒడిదొడుకులు సహజం. అనుకోని పరిస్థితులు.. కొవిడ్‌ లాంటి సమస్యలు ఎదురైతే ఏంటి పరిస్థితి? ఇలాంటి లావాదేవీలతో పెట్టుబడిదారుల సొమ్ముకు అసలు రక్షణ ఉండదు. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే సామర్థ్యం మీదే కొనుగోలుదారుల చేతికి ఫ్లాటు వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అనైతిక విధానాలతో కలిగే దుష్పరిణామాలపై కొనుగోలుదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
కొన్నవారూ ప్రమోటర్లే..
కొత్తగా వచ్చిన రెరా చట్టం ప్రకారం బిల్డర్లే కాదు స్థలాన్ని నిర్మాణ అభివృద్ధికి ఇచ్చిన అందర్నీ ప్రమోటర్లుగానే పరిగణిస్తారు. ఏ కారణంగానైనా నిర్మాణాలు సగంలోనే ఆగిపోతే వందలాది ఇతర కొనుగోలుదారులకు జవాబుదారీగా మారుతారు. అవిభాజ్యపు స్థలాన్ని కొన్నవారూ బాధితులే అయినా ఎవర్ని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే రెరాలో వీరు సైతం బాధ్యులే. పైగా ఆ స్థలాన్ని అమ్ముకుందామన్నా కుదరదు. అన్నిరకాలుగా ఇబ్బందులపాలయ్యే ప్రమాదం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు