భళారే... చేపల కూర..!

బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి సోంపు వేసి వేయించి తీయాలి. రెండు ఉల్లిపాయల్నీ, ఒక టొమాటోనీ ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఉల్లిముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి

Published : 27 Jun 2021 14:30 IST

చెట్టినాడ్‌ ఫిష్‌ కర్రీ

కావలసినవి
చేప ముక్కలు: కిలో,నూనె: 3 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, ఉల్లిపాయలు: మూడు, టొమాటో: రెండు, కరివేపాకు: 2 రెబ్బలు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, చింతపండు గుజ్జు: 3 టేబుల్‌స్పూన్లు,
మసాలా కోసం: సోంపు: టేబుల్‌స్పూను, వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కారం: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: టీస్పూను, కొబ్బరి తురుము: అరకప్పు

తయారుచేసే విధానం
* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి సోంపు వేసి వేయించి తీయాలి. రెండు ఉల్లిపాయల్నీ, ఒక టొమాటోనీ ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఉల్లిముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు కూడా వేసి వేగాక దించాలి. వీటికి కొబ్బరి తురుము, ఉప్పు, కారం కూడా కలిపి మెత్తగా రుబ్బాలి.
* మిగిలిన ఉల్లిపాయ, టొమాటో కూడా ముక్కలుగా కోయాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక మిగిలిన ఉల్లి ముక్కలు వేసి వేగాక, టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. తరవాత కొబ్బరి ముద్ద వేసి నూనె తేలేవరకూ వేయించాలి. చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి మరిగిన తరవాత చేప ముక్కలు కూడా వేసి సిమ్‌లో ఉడికించి దించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి.

అమృత్‌సర్‌ ఫిష్‌ కర్రీ

కావలసినవి
చేపముక్కలు: అరకిలో, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, వాము: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కారం: 4 టీస్పూన్లు, కసూరి మెంతి: అరటీస్పూను, గరంమసాలా: టీస్పూను, బిర్యానీ మసాలా: అరటీస్పూను, ఆమ్‌చూర్‌: చిటికెడు, సెనగపిండి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, పసుపు: చిటికెడు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* చేపముక్కలని ఉప్పు, పసుపుతో కడిగి పక్కన ఉంచాలి. తరవాత సెనగపిండిని వేయించాలి. ఇప్పుడు అందులో వాము, ఉప్పు, కారం, కసూరిమెంతి, గరంమసాలా, బిర్యానీ మసాలా, ఆమ్‌చూర్‌, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టించి కాసేపు ఉంచాలి. ఇప్పుడు నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి ముక్కల్ని రెండువైపులా వేయించి తీయాలి.

కేరళ చేపల కూర

కావలసినవి
చేపముక్కలు: అరకిలో,  ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, పచ్చిమిర్చి: నాలుగు, తాజా కొబ్బరి ముద్ద: అరకప్పు, ఎండుమిర్చి ముద్ద: అరటీస్పూను, దనియాలపొడి: టీస్పూను, కారం: 4 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, ఉప్పు: టీస్పూను, ఎండుమిర్చి: రెండు, ఆవాలు: అరటీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, చింతపండు గుజ్జు: అరకప్పు, మంచినీళ్లు: కప్పు, నూనె: 6 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దలా నూరాలి.
* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక కొబ్బరి ముద్ద వేసి వేయించాలి. తరవాత ఎండుమిర్చి ముద్ద, దనియాలపొడి, కారం, పసుపు వేసి కలిపి స్టవ్‌మీద నుంచి దించి పక్కన ఉంచాలి.
* విడిగా మరో బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన కొబ్బరి మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి కలపాలి. తరవాత మంచినీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు చేపముక్కలు, ఉప్పు వేసి సిమ్‌లో పది నిమిషాలు ఉడికించి దించాలి.

బెంగాలీ చేప కూర

కావలసినవి
చేపలు: కిలో, పసుపు: ముప్పావు టీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలు: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: రెండు, లవంగాలు: రెండు, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళం ముక్క, ఉల్లిపాయలు: రెండు, అల్లంతురుము: టీస్పూను, ఆవపిండి: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి: రెండు రెబ్బలు, పలావు ఆకు: ఒకటి, మంచినీళ్లు: పావుకప్పు, ఉప్పు: తగినంత, పంచదార: అరటీస్పూను, పెరుగు: కప్పు

తయారుచేసే విధానం
* దనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
* చేపముక్కలకు పసుపు, అరటీస్పూను ఉప్పు పట్టించి ఉంచాలి.
* టొమాటో ముక్కలు, వెల్లుల్లి, అల్లంతురుము, పచ్చిమిర్చి, ఆవపిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలిపి రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో మిశ్రమాన్ని వేసి వేయించాలి. తరవాత చేప ముక్కలు వేసి, కాసిని నీళ్లు పోసి సిమ్‌లో పది నిమిషాలు ఉడికించాలి.
* తరవాత కొత్తిమీర తురుము వేసి దించాలి.

Featured Image altimage 100X100No file chosen for 100X100 No file chosen for 365X255 No file chosen for 680X310 No file chosen for 175X250 Tags / Keywords Powered by MARGADARSI COMPUTERS-->


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని