రుచుల రేడు... నేరేడు!

తెల్లారేసరికి చెట్టుకింద రాలిపడిన నేరేడు పండ్లని ఇష్టంగా ఏరుకున్న జ్ఞాపకం ఉందా? అబ్బే.. అలా ఏరుకోవాల్సిన అవసరమేముంది. చెట్ల కొమ్మలపైకి ఎగబాకి, చిటారు కొమ్మలని పట్టుకుని వేలాడి... సావాసగాళ్లని బతిమాలి తెచ్చుకున్నాం అంటారా? ఏది ఏమైనా చినుకులు...

Updated : 29 Nov 2022 13:23 IST

తెల్లారేసరికి చెట్టుకింద రాలిపడిన నేరేడు పండ్లని ఇష్టంగా ఏరుకున్న జ్ఞాపకం ఉందా? అబ్బే.. అలా ఏరుకోవాల్సిన అవసరమేముంది. చెట్ల కొమ్మలపైకి ఎగబాకి,  చిటారు కొమ్మలని పట్టుకుని వేలాడి... సావాసగాళ్లని బతిమాలి తెచ్చుకున్నాం అంటారా? ఏది ఏమైనా చినుకులు పడి చితచితలాడే రోజుల్లో నీలాల నిగనిగలు పోగేసినట్టుంటే వగరు వగరు నేరేడుని ఒట్టొట్టినే తినడం కాకుండా ఇలా కూడా వండుకోవచ్చు..

ఏడాది పొడవునా రుచులే! 

కప్పుడయితే నేరేడు పండ్లు సీజనల్‌గా మాత్రమే దొరికేవి. దాంతో వాటిని తినాలన్నా, వాటి సుగుణాలు పొందాలన్నా ఏడాదంతా ఎదురు చూడాల్సి వచ్చేది. మనకి ఇప్పుడా అవసరం లేదు. నేరేడుతో తయారైన  ఉత్పత్తులు ఏడాదంతా దొరుకుతున్నాయి. మామిడి తాండ్ర, తాటి తాండ్రలానే నేరేడు తాండ్ర నోరూరిస్తోంది. జామూన్‌ వెనిగర్‌, జామూన్‌ పాపడ్‌, జామ్‌, తేనె, స్వ్కాష్‌, జెల్లీ, జ్యూస్‌, నేరేడు గింజల పొడి(మధుమేహులకు, చర్మ సంరక్షణ)కోసం ఏడాది పొడవునా మార్కెట్లో లభ్యమే. వీటితో రెడీమేడ్‌ రుచులని అందుకోవచ్చు. 

జామ్‌

కావాల్సినవి: పండిన నేరేడు పండ్లు- అరకిలో, యాపిల్‌- ఒకటి, గోధుమరంగు పంచదార(బ్రౌన్‌షుగర్‌)-కప్పు, నిమ్మరసం- చెంచా, నీళ్లు- తగినన్ని 
తయారీ: యాపిల్‌ చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి అందులో నేరేడు పండ్లు, యాపిల్‌ ముక్కలు వేసుకుని మంటని సిమ్‌లో ఉంచాలి. కాసేపటికి నేరేడు పండ్ల గుజ్జు నుంచి గింజలు వేరవుతాయి. చేత్తో కానీ గరిటెతోకానీ తీయొచ్చు. గుజ్జు దగ్గరగా వస్తున్నప్పుడు పంచదార వేసుకుని పూర్తిగా కరగనివ్వాలి. బాగా దగ్గరకు వచ్చాక నిమ్మరసం వేసుకుని చల్లార్చుకోవాలి. జామ్‌ సిద్ధం. 

రైత  

కావాల్సినవి: చిక్కని పెరుగు(మీగడ తీసేసినది)- కప్పు, దోరగా ఉన్న జంబో నేరేడు పండ్ల తురుము- అరకప్పు, ఉప్పు- తగినంత, వేయించి పొడికొట్టిన జీలకర్ర- అరచెంచా, కొత్తిమీర- రెండు చెంచాలు
తయారీ: ఒక పాత్రలో పెరుగు, నేరేడు పండ్ల ముక్కలు, జీలకర్రపొడి, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇది కిచిడీ, ,పరాటాల్లోకి బాగుంటుంది. వడలు, కరకరలు ముంచి తినే డిప్‌గా కూడా బాగుంటుంది. 

ఐస్‌క్రీం

కావాల్సినవి:  పండిన నేరేడు పండ్లు పెద్దవి- పావుకిలో, హెవీక్రీం- కప్పు, పంచదార - ఐదు చెంచాలు, టూటీఫ్రూటీలు- అలంకరణ కోసం, 
తయారీ: చాకుతో నేరేడు పండ్ల గుజ్జును గింజల నుంచి వేరుచేసుకోవాలి. దీనిలో పంచదార వేసుకుని మిక్సీలో మెత్తగా గుజ్జు చేసుకోవాలి. క్రీంని తీసుకుని విస్క్‌ లేదా ఫోర్క్‌తో బాగా గిలక్కొడితే క్రీం చక్కగా పొంగుతుంది. ఇందులో నేరేడు గుజ్జు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఐదుగంటల పాటు ఉంచాలి. చివరిగా టూటీఫ్రూటీలు, మార్కెట్లో దొరికే జామూన్‌ జెల్‌కానీ, మ్యాంగోజెల్‌తోకానీ కలిపి సర్వ్‌ చేసుకోవడమే. 

హల్వ

కావాల్సినవి:  పెద్ద నేరేడు పండ్ల గుజ్జు- అరకప్పు, గోధుమరవ్వ- అరకప్పు, నెయ్యి- చెంచా, జీడిపప్పు- ఎనిమిది, ఎండుద్రాక్ష- రెండు చెంచాలు, పంచదార- రెండున్నరకప్పులు, పాలు- కప్పులో మూడొంతులు, పచ్చ యాలకులు- రెండు, కుంకుమ పువ్వు- చిటికెడు 
తయారీ: ఒక దళసరిపాటి పాత్రలో నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పులని, ఎండుద్రాక్షలని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో గోధుమరవ్వని వేసి వేయించుకోవాలి. వేరే పాత్రలో కప్పు నీళ్లు తీసుకుని అందులో పంచదార వేసుకుని కరిగేంతవరకూ ఉండాలి. ఈ నీటిని రవ్వలో వేసి నీరు ఇగిరేంతవరకూ ఉండాలి. తర్వాత పాలు వేసి ఒక నిమిషం తర్వాత నేరేడు గుజ్జు వేసి కలుపుకోవాలి. చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు కలుపుకొంటే జామూన్‌ హల్వా రెడీ! 

జామూన్‌ సందేష్‌

కావాల్సినవి:  పనీర్‌- కప్పు, పంచదారపొడి- పావుకప్పు, పెద్దనేరేడు పండ్ల తరుగు- పావుకప్పు
తయారీ: ఒక పాత్రలో పనీర్‌ని తీసుకుని వేళ్లతో మెత్తగా మెదుపుకోవాలి. పనీర్‌ పొడిపొడిగా అయిన తర్వాత అందులో పంచదార వేసి పూర్తిగా కలిసిన తర్వాత చివరిగా నేరేడు పండ్ల గుజ్జును వేసి కలిపి నచ్చిన ఆకృతిలో సందేష్‌లు చేసుకోవచ్చు. 

పచ్చడి

కావాల్సినవి: : దోరగా ఉన్న నేరేడు పండ్లు- కప్పు, పంచదార- రెండు చెంచాలు, గల్లుప్పు-అరచెంచా, నువ్వులు- అరచెంచా, ఆవాలు- పావుచెంచా, మెంతులు- పావుచెంచా, ఆవనూనె- అరచెంచా, కారం- అరచెంచా, నిమ్మరసం- అరచెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు
తయారీ: నేరేడు పండ్లని శుభ్రం చేసుకుని తడి లేకుండా ఎండలో మూడు గంటలపాటు ఉంచాలి. నువ్వులు, మెంతులు, ఆవాలని  విడిగా వేయించుకుని పొడికొట్టుకోవాలి. ఒక పాత్రలో కడాయి పెట్టి ఆవనూనె వేసి అందులో కరివేపాకు, తయారుచేసి పెట్టుకున్న పొడి వేసి ఒక్క నిమిషం తర్వాత నేరేడు పండ్లను కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసి కదిపి ఆ తర్వాత పంచదార వేసి పూర్తిగా కరగనివ్వాలి. చివరిగా నిమ్మరసం వేసుకోవాలి. పులుపు, తీపి సరిపోతే దింపేసుకోవడమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని