జబార్‌దస్త్‌ తిండి శక్తిమాన్‌

కాలేజీలో చదివి చదివి అలసిపోయిన విద్యార్థులకే కాదు.. ఆఫీస్‌లో బండెడు చాకిరి చేసి అలసిపోయిన ఉద్యోగికీ ఓ బార్‌ ఉంది. దాన్ని రుచి చూస్తే మరి వదలరు. తిన్నంత సమయం చాలు.. శక్తి పుంజుకోవడానికి ప్రొటీన్లున్న అవిసెగింజలు... పీచు నిండిన ఓట్స్‌ వేటితోనయినా ఈ ఎనర్జీ బార్లని తేలిగ్గా చేసుకోవచ్చు.

Updated : 20 Oct 2019 01:00 IST

కాలేజీలో చదివి చదివి అలసిపోయిన విద్యార్థులకే కాదు.. ఆఫీస్‌లో బండెడు చాకిరి చేసి అలసిపోయిన ఉద్యోగికీ ఓ బార్‌ ఉంది. దాన్ని రుచి చూస్తే మరి వదలరు. తిన్నంత సమయం చాలు.. శక్తి పుంజుకోవడానికి ప్రొటీన్లున్న అవిసెగింజలు... పీచు నిండిన ఓట్స్‌ వేటితోనయినా ఈ ఎనర్జీ బార్లని తేలిగ్గా చేసుకోవచ్చు. అలసిన సమయంలో ఇవి మీ చేతిలో ఉంటే ఇక మీరు శక్తిమాన్‌ అయిపోయినట్లే!

 రాజ్‌గిరా బార్‌ 

కావాల్సినవి: బెల్లం- కప్పు, నీళ్లు- రెండు చెంచాలు, నెయ్యి- అరచెంచా, రాజ్‌గిరా పేలాలు- కప్పు, కొబ్బరిపొడి- పావుకప్పు, వేయించిన పల్లీలు- ముప్పావుకప్పు, యాలకులపొడి- అరచెంచా
తయారీ: ఒక పాత్రలో నీళ్లు, బెల్లం తీసుకుని పొయ్యిమీద పెట్టి కరిగించుకోవాలి. అందులో నెయ్యి కూడా వేసుకుని పాకం వచ్చేంతవరకూ ఉండి స్టౌకట్టేయాలి. దీనిలో కొబ్బరిపొడి, వేయించిన పల్లీలు, రాజ్‌గిరా పేలాలు, యాలకులపొడి వేసుకుని అన్నీఒకదానితో ఒకటి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వెడల్పాటి పాత్రకు నెయ్యి రాసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్దుకోవాలి. ఈ పాత్రను ఫ్రిజ్‌లో ఉంచి గంట తర్వాత నిలువుగా ముక్కలు కింద కోసుకోవాలి. ఇవి నెలరోజుల వరకూ నిల్వ ఉంటాయి.

 అవిసె గింజలతో 

కావాల్సినవి: తెల్ల నువ్వులు- పావుకప్పు, నల్ల నువ్వులు- అరకప్పు, అవిసెగింజలు- అరకప్పు, తేనె- అరకప్పు
తయారీ: దళసరిపాటి కడాయిలో నువ్వులు, అవిసె గింజలని మాడిపోకుండా మంచి వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. వీటిని ఒక పాత్రలోకి తీసుకుని తేనె పోస్తూ గరిటెతో చక్కగా కలుపుకోవాలి. అవెన్‌ని ముందుగా ప్రీహీట్‌ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. బేకింగ్‌ చేసే పాత్రకు లోపల బటర్‌కానీ నెయ్యికానీ రాసి నువ్వులు- అవిసె గింజల మిశ్రమాన్ని సమానంగా సర్దుకొని అవెన్‌లో ఇరవై నిమిషాలపాటు వేడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుని నిల్వ చేసుకోవచ్చు.

 మరమరాలతో 

కావాల్సినవి: ఓట్స్‌- కప్పు, తేనె- పావుకప్పు, మరమరాలు- అరకప్పు, పీనట్‌బటర్‌- పావుకప్పు, వెనిల్లా పరిమళం- చెంచా
తయారీ: ముందుగా వెడల్పాటి పాత్రలో బేకింగ్‌ పేపర్‌ని అమర్చుకోవాలి. ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిచేసుకోవాలి. మరమరాలు, ఓట్స్‌పొడిని బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద కడాయి తీసుకుని సన్నసెగ మీద వేడిచేసుకోవాలి. అందులో తేనె, పీనట్‌బటర్‌, వెనిల్లా వేసి అన్నీ కరిగేంతవరకూ ఆగి స్టౌ కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్‌- మరమరాలపై వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న వెడల్పాటి పాత్రలో వేసి గుల్లగా కాకుండా ఏదైనా గరిటెతో బాగా నొక్కి పెట్టుకోవాలి. ఈ పాత్రను ఫ్రిజ్‌లో రెండుగంటలపాటు ఉంచాలి. తర్వాత నిలువుగా కోసి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే ఇవి రెండునెలల వరకూ నిల్వ ఉంటాయి.

 ప్రొటీన్‌ బార్‌ 

కావాల్సినవి: ఖర్జూరాలు - అరకప్పు, వేడినీళ్లు- కప్పు, జీడిపప్పు- పావుకప్పు, బాదం- అరకప్పు, వాల్‌నట్స్‌- పావుకప్పు, పిస్తా- పావుకప్పు, నువ్వులు- పావుకప్పు, గుమ్మడి గింజలు- రెండు చెంచాలు, ఎండుకొబ్బరి- పావుకప్పు, తేనె- పావుకప్పు, యాలకులపొడి- పావుచెంచా, ఉప్పు- చిటికెడు, ఓట్స్‌- పావుకప్పు
తయారీ: ఖర్జూరాలని వేడినీటిలో రెండుగంటలపాటు నానబెట్టుకోవాలి. వీటిని నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక కడాయిలో జీడిపప్పులు, బాదంపప్పులు, వాల్‌నట్స్‌, పిస్తాపప్పులు, నువ్వులు, గుమ్మడి గింజలు వేసి ఐదునిమిషాలపాటు దోరగా వేయించుకోవాలి. చివరిగా కొబ్బరికోరు కూడా వేసి మరోసారి వేయించుకోవాలి. వేయించిన పప్పులన్నింటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి ఖర్జూరాల పేస్ట్‌ తీసుకుని దగ్గరకు వచ్చేంతవరకూ సన్నసెగమీద వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో వేయించిన పప్పులు, తేనె, యాలకులపొడి, ఉప్పు వేసి ఒకదానితో ఒకటి బాగా కలిపి స్టౌ కట్టేయాలి. ఇప్పుడు మరొక పాన్‌లో ఓట్స్‌ని వేయించుకుని మిక్సీలో వేసి బరకగా పొడిచేసుకోవాలి. ఈ పొడిని ఖర్జూరం- పప్పుల మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యి రాసిన పళ్లెంలో సమానంగా పరుచుకుని రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. తక్షణ శక్తికి ఉపయోగపడే ఈ బార్లు నెలరోజులపాటు నిల్వ ఉంటాయి. ఉద్యోగులు హ్యాండ్‌బ్యాగులో వీటిని ఉంచుకుంటే సాయంత్రం అలసట నుంచి ఉపశమనం పొందొచ్చు.

 ఓట్స్‌ బార్‌ 

కావాల్సినవి: ఓట్స్‌- నాలుగు చెంచాలు, బటర్‌ లేదా పీనట్‌బటర్‌- చెంచా, తేనె- అరచెంచా
తయారీ: ముందుగా అవెన్‌లో కానీ మందపాటి పాత్రలో కానీ బటర్‌ని కరిగించుకోవాలి. అందులో తేనె, ఓట్స్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎనర్జీ బార్స్‌ చేసుకునే మూసలు మార్కెట్లో దొరుకుతాయి. అందులో వేసి సమంగా సర్దుకోవాలి. వీటిని ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచి తెల్లారి తీస్తే చక్కగా వస్తాయి.

* మార్కెట్లో ఎనర్జీబార్లు చేసుకునే మూసలు లభిస్తున్నాయి. వీటితో అందమైన ఆకృతిలో ఈ బార్లని తయారు చేసుకోవచ్చు.

* వీటిల్లో బాదం, అవిసెలు, గుమ్మడి గింజలు, వాల్‌నట్స్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి విటమిన్‌ ఇ సమృద్ధిగా అందుతుంది. అందుకే ఎనర్జీబార్లతో శక్తితోపాటు అందమైన చర్మం, జుట్టు, గోళ్లు కూడా సొంతమవుతాయి.

* బయట దొరికే ప్యాకెట్‌ ఆహారం బదులు వీటిని మితంగా తినడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. రక్తహీనత కారణంగా వచ్చే తలనొప్పి, నీరసం, ఆందోళన వంటివి దూరం అవుతాయి.

* ఇంట్లో తయారు చేసుకున్న ఎనర్జీబార్లలో పంచదార ఉండదు. ఓట్స్‌ వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి పీచు పుష్కలంగా అంది, కడుపునిండిన భావన కలుగుతుంది. మితంగా తింటే బరువు తగ్గడమూ తేలికే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని