పండగ మిఠాయిల్లో..పహల్వాన్‌

కద్దూ ఎలా చేసినా వద్ధు.హల్వాగా మారిస్తే ముద్దు!అదే హల్వా క్యారెట్‌దైతే.. క్యా టేస్ట్‌ హై అనేస్తాం.ఆనపకాయ గుజ్జును.. అనలతల్పమైన నేతితో కలిపి కొడితే! అద్భుతః అనాల్సిందే!!మనకు తెలిసిన రకాలు ఇన్నే. మధువొలకబోసే హల్వాలో రకాలు కోకొల్లలు. ఆలస్యమెందుకు ఆరగించండి. పచ్చిబొప్పాయి తురుము- మూడు కప్పులు, నెయ్యి- మూడు చెంచాలు, పంచదార- ఐదు చెంచాలు, యాలకులు- రెండు, బాదంపప్పుపొడి- రెండు చెంచాలు( బదులుగా కొబ్బరిపొడిని కానీ, కోవాను కానీ ప్రత్యామ్నాయంగా...

Published : 27 Oct 2019 01:25 IST

కద్దూ ఎలా చేసినా వద్ధు.

హల్వాగా మారిస్తే ముద్దు!

అదే హల్వా క్యారెట్‌దైతే.. క్యా టేస్ట్‌ హై అనేస్తాం.

ఆనపకాయ గుజ్జును.. అనలతల్పమైన నేతితో కలిపి కొడితే! అద్భుతః అనాల్సిందే!!

మనకు తెలిసిన రకాలు ఇన్నే. మధువొలకబోసే హల్వాలో రకాలు కోకొల్లలు. ఆలస్యమెందుకు ఆరగించండి.

పచ్చి బొప్పాయి హల్వా

కావాల్సినవి: పచ్చిబొప్పాయి తురుము- మూడు కప్పులు, నెయ్యి- మూడు చెంచాలు, పంచదార- ఐదు చెంచాలు, యాలకులు- రెండు, బాదంపప్పుపొడి- రెండు చెంచాలు( బదులుగా కొబ్బరిపొడిని కానీ, కోవాను కానీ ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు), జీడి పలుకులు- పది

తయారీ: మందపాటి పాత్రలో నెయ్యి వేసుకుని వేడెక్కాక అందులో బొప్పాయి తురుముని వేసి మంట తగ్గించి పావుగంటపాటు వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార వేసి మరో ఇరవై నిమిషాలపాటు ఉడికించుకోవాలి. అప్పటికి ఉడికిన బొప్పాయి నుంచి నెయ్యి వేరవుతుంది. అప్పుడు బాదంపొడి లేదా కొబ్బరిపొడి వేసుకోవాలి. చివరిగా జీడిపప్పులు వేసుకుంటే రుచికరమైన బొప్పాయి హల్వా రెడీ!

మూంగ్‌దాల్‌ హల్వా

కావాల్సినవి: పెసరపప్పు- కప్పు, నెయ్యి- పది చెంచాలు, పచ్చ యాలకులు- నాలుగు, పిస్తా పప్పులు-10, ఎండుద్రాక్షలు- చెంచా, హోల్‌మిల్క్‌- కప్పు, నీళ్లు- కప్పు, పంచదార- కప్పున్నర

తయారీ: పెసరపప్పుని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. తెల్లారి నీళ్లు వార్చేసి పావుకప్పు నీళ్లు వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో రుబ్బిన పెసరపప్పుని వేసుకుని పచ్చివాసన పోయేంతవరకూ సన్నసెగ మీద మధ్యమధ్యలో కలుపుతూ పావుగంటపాటు ఉడికించుకోవాలి. మొదట్లో పేస్ట్‌లా అనిపించినా తర్వాత పొడిపొడిగా రవ్వలా మారి.. తర్వాత నెయ్యి నుంచి వేరవుతుంది. పెసరపప్పు ఉడుకుతున్నప్పుడే మరొక పాత్రలో పాలు, నీళ్లు, పంచదార వేసుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలను పెసరపప్పు మిశ్రమంలో వేసుకోవాలి. మళ్లీ నెయ్యి వేరయ్యేంతవరకూ ఈ మిశ్రమాన్ని సన్నసెగమీద ఉడికించుకోవాలి. చివరిగా పిస్తా పలుకులు వేసి ఓ రెండు నిమిషాలపాటు ఉడికించుకుని దింపుకోవాలి. వేడివేడిగా తింటే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది.

పైనాపిల్‌ హల్వా

కావాల్సినవి: పండిన పైనాపిల్‌ ముక్కలు- పావుకప్పు, పైనాపిల్‌ గుజ్జు- అరకప్పు, నెయ్యి- పావుకప్పు, బొంబాయిరవ్వ- అరకప్పు, నీళ్లు- కప్పు, కుంకుమపువ్వు- మూడు పలుకులు, పంచదార- అరకప్పు, జీడిపప్పులు- ఐదు

తయారీ: ఒక పాత్రలో నీళ్లు తీసుకుని చిన్నమంట మీద వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పొయ్యిమీద కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత రవ్వ, కుంకుమపువ్వు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఏడెనిమిది నిమిషాలకు బొంబాయి రవ్వ చక్కని వాసనతో వేగిపోతుంది. ఇందులో పైనాపిల్‌ ముక్కలు, గుజ్జు వేసి బాగా కలియతిప్పుకోవాలి. ఇందులో వేడినీళ్లు వేసుకుంటూ తిప్పుకోవాలి. బుడగలు మీదపడతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా గరిటెతో తిప్పుకోవాలి. రెండు నిమిషాలపాటు తిప్పేసరికి బొంబాయి రవ్వ నీటిని మొత్తం పీల్చేసుకుంటుంది. చివరిగా పంచదార కూడా వేసుకుని తక్కువ మంట మీద ఉంచాలి. నెయ్యి నుంచి పైనాపిల్‌ మిశ్రమం వేరవుతున్నప్పుడు జీడిపప్పు పలుకులు వేసి మరో రెండు నిమిషాలపాటు ఉడికించుకుంటే హల్వా సిద్ధం.

గోధుమ హల్వా

కావాల్సినవి: గోధుమలు- పావుకప్పు, పంచదార- అరకప్పు, నెయ్యి- అరకప్పు, జీడిపప్పులు- ఐదు

తయారీ: గోధుమలని రాత్రంతా నానబెట్టుకుని తెల్లారి ఆ నీళ్లను వార్చేసి అరకప్పు నీళ్లతో మెత్తగా రుబ్బుకోవాలి. కొబ్బరికోరు నుంచి కొబ్బరి పాలను తీసినట్టుగా గోధుమల నుంచి గోధుమపాలను తీసుకోవాలి. పిప్పి నుంచి పూర్తిగా పాలను తీసుకున్న తర్వాత ఆ పాలను ఓ పావుగంటపాటు కదపకుండా ఉంచేయాలి. పైన తేరుకున్న నీళ్లను కొద్దిగా తీసేయాలి. ఒక కడాయిలో చెంచా నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో ఈ గోధుమపాలను వేసుకుని గరిటెతో కలుపుతూ ఉంటే కాసేపటికి ఆ మిశ్రమం దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులో పంచదార వేసి పూర్తిగా కరిగేంతవరకూ గరిటెతో కలియతిప్పుకోవాలి. చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పులు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయిలో చెంచాన్నర నెయ్యి వేసుకుని అందులో చెంచా పంచదార వేసుకోవాలి. నెమ్మదిగా పంచదార కరిగి...బంగారు వర్ణంలోకి వస్తుంది. దీన్నే కారామిల్‌ షుగర్‌ అంటారు. దీనిని గోధుమ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా కలుపుతూ ఉంటే కాసేపటికి హల్వా సిద్ధమవుతుంది. చివరిగా జీడిపప్పులు వేసుకుని వడ్డించుకోవాలి.

బాంబే కరాచీ హల్వా

కావాల్సినవి: మొక్కజొన్నపిండి- అరకప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, నిమ్మరసం- చెంచా, నెయ్యి- నాలుగు చెంచాలు, పంచదార- ఒకటింపావుకప్పు, నిమ్మరసం- చెంచా, నెయ్యి- నాలుగుచెంచాలు, జీడిపప్పులు- పది, యాలకులపొడి- పావుచెంచా, ఫుడ్‌ కలర్‌- కొద్దిగా, బాదం పప్పులు- ఐదు

తయారీ: వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో కప్పున్నర నీళ్లు పోసి ఉండల్లేకుండా కార్న్‌ఫ్లోర్‌ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్‌స్టిక్‌ పాత్రను తీసుకుని అందులో కప్పునీళ్లు పోసి పంచదార వేసి సన్నసెగ మీద కరిగించుకొని కొద్దిగా మరిగేంతవరకూ ఆగాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని వేసి సన్నసెగమీద గరిటెతో కలుపుతూ దగ్గరగా వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత చెంచా నెయ్యి వేసి అది మిశ్రమంలో ఇంకిపోయేవరకూ గరిటెతో కలుపుకోవాలి. అలాగే మరికొద్దినెయ్యి, నిమ్మరసం వేసి కలుపుతూ ఉంటే మిశ్రమం కాసేపటికి పారదర్శకంగా మారుతుంది. అప్పటికి కొద్దికొద్దిగా నెయ్యి బయటకు వస్తుంది. అప్పుడే ఫుడ్‌కలర్‌, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసుకుని మరొక్కసారి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఈమిశ్రమాన్ని ట్రేలాంటి వెడల్పాటి పాత్రలోకి తీసుకుని గంట తర్వాత బాదం పప్పులు చల్లుకుని ముక్కలుగా కోసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు