కార్తీక మాసాన...మన భోజనం

‘‘వేడి వేడి అన్నంలోకి కమ్మని పప్పు.. కాచిన్నెయ్యి.. పప్పు, దప్పళం కలిపి కొట్టడం..’’ కార్తీక వన భోజనం ఎలా ఉండాలో అందంగా వర్ణించారో సినీకవి. ఈ సంబరంలో మనకే సొంతమైన వంటకాలు సమష్టిగా వండి వడ్డించుకుంటే.. వన భోజనం కాస్తా మన భోజనం అయిపోతుంది. ఆ పాకాలే ఇవి! ఇంకేం.. కావాల్సిన పదార్థాలు సర్దుకొని.. కావలసిన వారితో వన విహారానికి వెళ్లిపోండి...

Published : 03 Nov 2019 00:31 IST

‘‘వేడి వేడి అన్నంలోకి కమ్మని పప్పు..
కాచిన్నెయ్యి.. పప్పు, దప్పళం కలిపి కొట్టడం..’’

కార్తీక వన భోజనం ఎలా ఉండాలో అందంగా వర్ణించారో సినీకవి. ఈ సంబరంలో మనకే సొంతమైన వంటకాలు సమష్టిగా వండి వడ్డించుకుంటే.. వన భోజనం కాస్తా మన భోజనం అయిపోతుంది. ఆ పాకాలే ఇవి! ఇంకేం.. కావాల్సిన పదార్థాలు సర్దుకొని.. కావలసిన వారితో వన విహారానికి వెళ్లిపోండి.

నేతి బీరకాయ పచ్చడి

కావాల్సినవి: నేతి బీరకాయలు- పావుకేజీ, నూనె- రెండు చెంచాలు, మినప్పప్పు- ఒకటిన్నర చెంచా, సెనగపప్పు- ఒకటిన్నర చెంచా, ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండుమిర్చి- ఏడు, చింతపండు- నిమ్మకాయంత, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా పాన్‌ పెట్టుకుని నూనె పోసుకుని వేడిచేసుకోవాలి. అందులో మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో తరిగిన నేతిబీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు కూడా వేసి మూతపెట్టేయాలి. సన్నమంట మీద వీటిని మగ్గించుకోవాలి. స్టౌ కట్టేసి మగ్గిన నేతిబీరకాయముక్కలు, చింతపండు కూడా మిక్సీలో వేసి అన్నింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరిగా తాలింపు వేసుకుంటే నేతిబీరకాయ పచ్చడి రుచిగా ఉంటుంది.

కందాబచ్చలి

కావాల్సినవి: కంద- పావుకిలో, బచ్చలికూర- కట్ట లేదా 150గ్రా, ఉప్పు- రుచికి తగినంత ఆవ పెట్టడానికి: ఆవాలు- రెండు చెంచాలు, బియ్యం- అరచెంచా, ఎండుమిర్చి- రెండు తాలింపు కోసం: ఆవాలు- పావుచెంచా, మినప్పప్పు- చెంచాన్నర, సెనగపప్పు- చెంచాన్నర, పసుపు- పావుచెంచా, ఎండుమిర్చి- రెండు, నువ్వుల నూనె- చెంచాన్నర
తయారీ: ఆవకోసం: ఆవాలు, బియ్యం, ఎండుమిరపకాయల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అరగంటపాటు నానబెట్టి ఉంచాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కందని బాగా శుభ్రం చేసి చెక్కు తీసేసి చిన్నముక్కలు చేసుకోవాలి. బచ్చలి ఆకులని కూడా శుభ్రం చేసి తరిగిపెట్టుకోవాలి. ఈ రెండింటిని కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లుపోసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పుగుత్తితో వీటిని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడిచేసుకుని మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి వేసి గోధుమరంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత మెదిపిన కంద, బచ్చలి, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. స్టౌ కట్టేసి మిక్సీపట్టిన ఆవవేసి మూతపెట్టి పది నిమిషాలపాటు అలా ఉంచేయాలి. అలా చేస్తే ఆవరుచి కూరకు బాగా పడుతుంది.

చింతకాయ పులుసు..

కావాల్సినవి: పచ్చి చింతకాయలు- పావుకిలో, ఆనపకాయముక్కలు- కప్పున్నర, పచ్చిమిర్చి- రెండు, ఎండుమిర్చి- ఎనిమిది, ఆవాలు- రెండు చెంచాలు, బియ్యం- మూడు చెంచాలు, ఇంగువ- చిటికెడు, గుమ్మడికాయముక్కలు- కప్పు, జీలకర్ర- పావుచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు,
తయారీ: పులుసు పెట్టడానికి గంట ముందే బియ్యం, ఆవాలు, ఎండుమిర్చి వీటన్నింటిని తగినన్ని నీళ్లలో నానబెట్టుకుని..తర్వాత పల్చగా, మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చి చింతకాయల్ని నీళ్లలో ఉడికించి రసం తీసుకోవాలి. మరో పాత్రలో పసుపు, ఉప్పు వేసుకుని ఆనపకాయ, గుమ్మడికాయ ముక్కలని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత... చింతకాయ రసం కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఆవపేస్ట్‌ని ఉడుకుతున్న ముక్కల్లో వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని దాన్ని పులుసులో వేసి ఒక్కసారి మరగనిస్తే చాలు. ఈ పులుసుని వడియాలతో కలిపి తింటే అదరహో అనిపిస్తుంది.

పనసపొట్టు కూర

కావాల్సినవి: తాజా పనసపొట్టు- కప్పు, చింతపండుగుజ్జు- చెంచా, పచ్చిమిర్చి- మూడు, నూనె- పెద్దచెంచా, నీళ్లు- పావుకప్పు, ఆవాలు- అరచెంచా, మినప్పప్పు- చెంచా, సెనగపప్పు- చెంచా, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- పావుచెంచా, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత, పసుపు- పావుచెంచా ఆవ పెట్టడం కోసం: ఆవాలు- చెంచా, ఎండుమిర్చి- 2, నూనె- చెంచా
తయారీ: ఆవకోసం: ఒక గిన్నెలో ఆవాలు, ఎండుమిర్చి కొద్దిగా వేడినీళ్లు వేసుకుని పావుగంటపాటు నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసిన తర్వాత చెంచాన్నర నూనె వేసుకోవాలి.
పనసపొట్టులో తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసుకుని కుక్కర్‌లో ఉడికించుకోవాలి. తర్వాత నీళ్లను పూర్తిగా వార్చేసుకుని పక్కనపెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక అందులో ఆవాలు, ఇంగువ, సెనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అవన్నీ వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో ఉడికిన పనసపొట్టు, చింతపండు గుజ్జు వేసి సన్నసెగమీద ఉడికించుకోవాలి. పొయ్యి కట్టేసి.. కొద్దిగా చల్లారిన తర్వాత ఆవపేస్ట్‌ వేసుకోవాలి. రుచికరమైన పనసపొట్టు కూర సిద్ధమవుతుంది.

ఉసిరి అన్నం

కావాల్సినవి: ఉసిరికాయముక్కలు- కప్పు, కొత్తిమీర- చిన్నకట్ట, పచ్చిమిర్చి- ఐదు, ఉప్పు- రుచికి తగినంత, ఆవాలు- చెంచా, జీలకర్ర- చెంచా, ఎండుమిరపకాయలు- రెండు, మినప్పప్పు- చెంచా, సెనగపప్పు- చెంచా, పల్లీలు- చెంచా, పసుపు- అరచెంచా, నూనె- మూడుచెంచాలు, అన్నం- రెండుకప్పులు, కరివేపాకు- రెండు రెబ్బలు
తయారీ: ఉసిరికాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు.. వీటన్నింటిని మెత్తగా మిక్సీపట్టుకోవాలి. వెడల్పాటి పాన్‌ తీసుకుని కొద్దిగా నూనెపోసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, మిక్సీపట్టిన ఉసిరి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇందులో ఉడికిన అన్నాన్ని వేసి కలియతిప్పితే ఉసిరి అన్నం సిద్ధం అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని