కెవ్వు కేకులు

క్రిస్మస్‌ సంబరాల హేళ..  కొత్త ఏడాది వస్తున్న వేళ.. కేరింతలు కొండంతలు అయిపోతాయి.ఆ కోలాహలంలో కేకలేసినా ఎవరూ పట్టించుకోకపోవచ్చు. అదే ఓ కేకు తీసుకొని వెళ్లండి.. అందరి దృష్టీ మీవైపు మళ్లుతుంది. అందరి మనసూ మీరు తీసుకొచ్చిన కేకుపైనే నిలుస్తుంది. ఇందరిని అలరించాలంటే ఆ కేకు.. కెవ్వు మనిపించేలా ఉండాలి కదా! అదలా ఉండాలంటే ఇదిగో ఈ వెరైటీలు ట్రై చేయండి.

Published : 22 Dec 2019 01:01 IST

క్రిస్మస్‌ సంబరాల హేళ..  కొత్త ఏడాది వస్తున్న వేళ.. కేరింతలు కొండంతలు అయిపోతాయి.
ఆ కోలాహలంలో కేకలేసినా ఎవరూ పట్టించుకోకపోవచ్చు. అదే ఓ కేకు తీసుకొని వెళ్లండి.. అందరి దృష్టీ మీవైపు మళ్లుతుంది. అందరి మనసూ మీరు తీసుకొచ్చిన కేకుపైనే నిలుస్తుంది. ఇందరిని అలరించాలంటే ఆ కేకు.. కెవ్వు మనిపించేలా ఉండాలి కదా! అదలా ఉండాలంటే ఇదిగో ఈ వెరైటీలు ట్రై చేయండి.


క్రిస్‌మస్‌ కేక్‌

కావాల్సినవి: మైదా-200 గ్రా, బటర్‌-150 గ్రా, పంచదార పొడి-150 గ్రా, స్వీట్‌చెర్రీలు-50 గ్రా, జీడిపప్పు- 50 గ్రా, గుడ్లు-4, కిస్‌మిస్‌-100 గ్రా, బ్లాక్‌ కిస్‌మిస్‌-100గ్రా, వెనీలా ఎసెన్స్‌- టీస్పూన్‌, దాల్చినచెక్క పొడి- టీస్పూన్‌, ఉప్పు-కొద్దిగా.

తయారీ: జీడిపప్పు, కిస్‌మిస్‌, బ్లాక్‌ కిస్‌మిస్‌, చెర్రీలను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. బటర్‌,  పంచదార పొడి వేసుకుని క్రీమ్‌లా అయ్యేంతవరకూ బాగా గిలకొట్టాలి. దీని కోసం ఎలక్ట్రిక్‌ బ్లెండర్‌ వాడవచ్చు. ఈ క్రీమ్‌లో గుడ్ల సొన వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కట్‌చేసి పెట్టుకున్న చెర్రీలు, జీడిపప్పు, కిస్‌మిస్‌, బ్లాక్‌ కిస్‌మిస్‌తోపాటు వెనీలా ఎసెన్స్‌, దాల్చినచెక్క పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ టిన్‌లో వేసి 45 నుంచి 50 నిమిషాల వరకూ బేక్‌ చేసుకోవాలి. లేదా ప్రెషర్‌కుక్కర్‌లోనూ బేక్‌ చేసుకోవచ్చు.


ప్లమ్‌ కేక్‌

కావాల్సినవి: మైదా-కప్పు, జీడిపప్పు-అరకప్పు(ఒక్కో జీడిపప్పును నాలుగు ముక్కలు చేసుకోవాలి), డ్రైఫ్రూట్స్‌-(ఖర్జూరం, చెర్రీలు)-అరకప్పు, పంచదార పొడి-అరకప్పు, బటర్‌-అరకప్పు, గుడ్లు-మూడు, దాల్చినచెక్క పొడి-అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌-టీస్పూన్‌, వెనీలా ఎసెన్స్‌-టీస్పూన్‌, ఉప్పు-చిటికెడు.

తయారీ: డ్రైఫ్రూట్స్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల మైదా కలుపుకోవాలి. మిగిలిన మైదాలో బేకింగ్‌ పౌడర్‌, దాల్చినచెక్క పొడి, ఉప్పు వేసి జల్లెడపట్టాలి. దీంట్లో పంచదార పొడి వేసి ఎలక్ట్రిక్‌ బీటర్‌ లేదా హ్యాండ్‌ బీటర్‌తో బాగా కలుపుకోవాలి. తర్వాత గుడ్లు, నట్స్‌, ముందుగా ముక్కలు చేసుకున్న జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బేకింగ్‌ టిన్‌ లేదా గిన్నెలో వేసుకుని అవెన్‌లో 50 - 55 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. కుక్కర్‌లో అయితే మూడు అంగుళాల మందాన ఇసుక లేదా ఉప్పు వేసి వేడిచేసుకోవాలి. గ్యాస్కెట్‌, విజిల్‌ తీసి బేక్‌ చేసుకోవాలి. 


లో కొలెస్ట్రాల్‌ కేక్‌

కావాల్సినవి: జల్లించిన మైదా-120 గ్రా, పంచదార పొడి-120 గ్రా, నూనె-100 మిల్లీ గ్రాములు, గుడ్లు-2, కోకోపౌడర్‌-30 గ్రా, తర్బూజా గింజలు- టేబుల్‌స్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌-టీస్పూన్‌, పాలు-20 మిల్లీ గ్రాములు.
తయారీ: పంచదార పొడి, నూనె వేసుకుని ఎలక్ట్రిక్‌ బీటర్‌తో క్రీమ్‌లా అయ్యేంతవరకూ కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో గుడ్ల పచ్చసొన, మైదా, కోకోపౌడర్‌, పాలు వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తర్బూజా గింజలు వేసుకోవాలి. ఇప్పుడు గుడ్ల తెల్లసొనను బాగా కలుపుకుని దాన్ని ఈ మిశ్రమంలో వేసి కలపాలి. కొద్దిగా నూనె రాసిన పాత్రలో ఈ మిశ్రమాన్ని వేసుకుని, అవెన్‌లో పెట్టి 45 నుంచి 50 నిమిషాలపాటు బేక్‌ చేసుకోవాలి. అవెన్‌ లేకపోతే కుక్కర్‌లోనూ కేక్‌ను తయారుచేసుకోవచ్చు.


ఫ్రూట్‌ కేక్‌

కావాల్సినవి: మైదా: 250 గ్రా, బటర్‌-200 గ్రా, కిస్‌మిస్‌-200 గ్రా, పంచదార పొడి-120 గ్రా, స్వీట్‌ చెర్రీస్‌- 50 గ్రా, గుడ్లు-5, పాలు- 50 మిల్లీ గ్రాములు, వెనీలా ఎసెన్స్‌-అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌-అరటీస్పూన్‌, ఉప్పు-కొద్దిగా.

తయారీ: కిస్‌మిస్‌, చెర్రీలను చిన్నగా కట్‌ చేసుకోవాలి. మైదా, బేకింగ్‌ పౌడర్‌లను జల్లెడ పట్టుకోవాలి. బటర్‌, పంచదార పొడులను హ్యాండ్‌ లేదా ఎలక్ట్రిక్‌ బ్లెండర్‌తో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో గుడ్లు, టేబుల్‌స్పూన్‌ మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన మైదా, కట్‌ చేసుకున్న చెర్రీలు, కిస్‌మిస్‌, పాలు, వెనీలా ఎసెన్స్‌, ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ టిన్‌లో వేసి ముందుగా వేడిచేసుకున్న అవెన్‌లో పెట్టి 45 నుంచి 50 నిమిషాలపాటు బేక్‌ చేసుకోవాలి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని