చుట్టేసి...ఓ పట్టు పట్టేసి...

రోటీ పొరల్లో కూర చేరితే... పరోటి రోటీని లాఠీలా తిప్పేసి అందులో కూర ఉంచితే... వెరైటీ కూర కుదిరిందా! టేస్ట్‌  అదురుతుందంతే!! ఒకరకంగా చపాతీ రోల్సే అయినా... వీటిని తయారుచేసే రూల్స్‌ కాస్త భిన్నంగా ఉంటాయి. ఫ్రాంకీలని విచిత్రంగా పిలుచుకుంటారు.ఈ వినూత్న ఉపాహారాన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. ఎలాగంటే... ఇదిగో ఇలాగ...

Published : 16 Feb 2020 01:07 IST

రోటీ పొరల్లో కూర చేరితే... పరోటి రోటీని లాఠీలా తిప్పేసి అందులో కూర ఉంచితే... వెరైటీ కూర కుదిరిందా! టేస్ట్‌  అదురుతుందంతే!! ఒకరకంగా చపాతీ రోల్సే అయినా... వీటిని తయారుచేసే రూల్స్‌ కాస్త భిన్నంగా ఉంటాయి. ఫ్రాంకీలని విచిత్రంగా పిలుచుకుంటారు.ఈ వినూత్న ఉపాహారాన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. ఎలాగంటే... ఇదిగో ఇలాగ...


వెజ్‌ ఫ్రాంకీ

కావాల్సినవి: గోధుమపిండి- అరకప్పు, మైదా- అరకప్పు, నూనె-రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- కొద్దిగా, అల్లంవెల్లుల్లి ముద్ద-  టీ స్పూన్‌, ఉడికించిన బంగాళా దుంపల మిశ్రమం- రెండు కప్పులు, కారం- టీస్పూన్‌, చాట్‌ మసాలా- అర టీస్పూన్‌, సన్నగా తరిగిన కొత్తిమీర- టేబుల్‌స్పూన్‌, ఆమ్‌చూర్‌ పౌడర్‌- ఒకటిన్నర టీస్పూన్లు, గరంమసాలా- పావు టీస్పూన్‌, వెన్న-నాలుగు టీస్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- కప్పు, చాట్‌మసాలా- రెండు టీస్పూన్లు, టమాటా సాస్‌- టీస్పూన్‌.
తయారీ: గోధుమ, మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసుకుని కలిపి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని నాలుగు సమాన భాగాలు చేసుకుని చపాతీల్లా వత్తుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. దీంట్లో చిదిమిన బంగాళాదుంప మిశ్రమం, కారం, గరంమసాలా, చాట్‌ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద రెండు నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌ మీద కొద్దిగా వెన్నవేసి వేడిచేసి చపాతీని రెండు వైపులా సన్నని మంట మీద కాల్చుకోవాలి. మరో కడాయిలో కొద్దిగా వెన్న వేసుకుని దాంట్లో తయారైన మిశ్రమాన్ని వేసుకుని సన్నని మంటమీద నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత చపాతీలో ఒక చివర మిశ్రమాన్ని పెట్టి, పైన ఉల్లిపాయ ముక్కలు,  చాట్‌ మసాలా చల్లాలి. ఇపుడు చపాతీని గట్టిగా చుట్టాలి. మిగతా అన్ని చపాతీలను ఇలాగే చుట్టుకోవాలి.

 


పనీర్‌

కావాల్సినవి: పనీర్‌-150 గ్రా, గోధుమపిండి- కప్పు, ఉప్పు- తగినంత, నూనె- టేబుల్‌స్పూన్‌, పెద్ద ఉల్లిపాయ- ఒకటి, టమాటా- ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు టీస్పూన్లు, కారం- పావు టీస్పూన్‌, పసుపు- పావు టీస్పూన్‌, ధనియాల పొడి- టీస్పూన్‌, నిమ్మరసం- టేబుల్‌స్పూన్‌.
తయారీ: గోధుమపిండిలో కొంచెం ఉప్పు, నీళ్లు పోసి ముద్దలా కలపాలి. దీన్ని పావుగంటపాటు పక్కన ఉంచాలి. ఉల్లిపాయ, టమాటాను చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పూ, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి బాగా వేయించాలి. ఇప్పుడు పనీర్‌, నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి దించేయాలి. దీన్ని నాలుగు సమాన భాగాలు చేసి పక్కన పెట్టుకోవాలి. కలిపిపెట్టుకున్న గోధుమపిండితో నాలుగు పలుచని చపాతీలు చేసుకోవాలి. స్టవ్‌ మీద నాన్‌స్టిక్‌పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి చపాతీని రెండు వైపులా కాల్చి తీయాలి. టీస్పూన్‌ గ్రీన్‌చట్నీ తీసుకుని చపాతీ మొత్తం రాయాలి. పనీర్‌ మిశ్రమాన్ని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చాట్‌మసాలాను చపాతీ మీద పెట్టుకుని చుట్టుకోవాలి. మిగతా మూడు చపాతీలను ఇలాగే చేసుకోవాలి.
అలంకరణకు: గ్రీన్‌చట్నీ-నాలుగు టీస్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ-ఒకటి, చాట్‌మసాలా-టీస్పూన్‌.

 


చికెన్‌ ఫ్రాంకీ

అలంకరణకు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు-రెండు, చిల్లీ వెనిగర్‌-నాలుగు టీస్పూన్లు, గ్రీన్‌చట్నీ-ఎనిమిది టీస్పూన్లు.
కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌- అరకేజి (అర అంగుళం ముక్కల్లా కట్‌ చేసుకోవాలి), గోధుమపిండి- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, నూనె-రెండు టేబుల్‌స్పూన్లు, మధ్యస్థంగా ఉండే ఉల్లిపాయలు- రెండు, అల్లంవెల్లులి ముద్ద- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, పసుపు- అర టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, మధ్యస్థంగా ఉండే టమాటాలు- రెండు, సన్నగా తరిగిన కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్లు- నాలుగు, తయారీ: గోధుమపిండిలో తగినన్ని నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసుకుని ముద్ద కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటాలను చిన్న ముక్కలుగా కోయాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మరో నిమిషంపాటు వేయించాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసుకుని మూడు నిమిషాల పాటు వేయించాలి. తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి చికెన్‌ కాస్త ఉడికేవరకూ ఉంచాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీద ముక్కలు వేసుకుని పొడిగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఈ మిశ్రమం మీద నిమ్మరసం పిండి, బాగా కలిపి పక్కనపెట్టాలి. ఇప్పుడు గోధుమపిండి ముద్దను ఎనిమిది భాగాలు చేసి, ఎనిమిది చపాతీలు చేయాలి. పాన్‌ మీద ఒక్కో చపాతీనీ కాల్చాలి. గుడ్ల సొనను ఒక గిన్నెలో వేసుకుని బాగా కలిపి ఒక్కో చపాతీ మీద కొద్దిగా సొన వేసి కాల్చాలి. సొన చపాతీ మీదే వేయాలిగానీ దాన్ని దాటి పక్కలకు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చపాతీని తిరగేసి కింది భాగం కూడా బాగా కాల్చాలి. సొన భాగం పైకి వచ్చేలా చపాతీని పెట్టి చికెన్‌ మిశ్రమం వేయాలి. దీని మీద ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ వెనిగర్‌, గ్రీన్‌ చట్నీలనూ చల్లాలి. ఇప్పుడు చపాతీని గట్టిగా చుట్టాలి.

 


షెజువాన్‌

అలంకరణకు: షెజువాన్‌ చట్నీ-రెండు టీస్పూన్లు, టమాటాసాస్‌-టీస్పూన్‌, సన్నగా, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ-ఒకటి, ఫ్రాంకీ మసాలా-కొద్దిగా.
కావాల్సినవి: మైదా-రెండు కప్పులు, గోధుమపిండి- అరకప్పు, ఉప్పు- తగినంత, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, తురిమిన అల్లం, వెల్లుల్లి- రెండు టేబుల్‌స్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, బియ్యం- రెండు టేబుల్‌ స్పూన్లు, అటుకులు-రెండు టేబుల్‌ స్పూన్లు, షెజువాన్‌ సాస్‌- కొద్దిగా, ఉడికించి, తొక్క తీసిన బంగాళాదుంప- ఒకటి. కారం- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి-టీస్పూన్‌, గరంమసాలా- టీస్పూన్‌, వేయించిన మెంతి పొడి- టీస్పూన్‌, పసుపు- పావు స్పూన్‌, నల్లఉప్పు- టీస్పూన్‌, చాట్‌మసాలా- టీస్పూన్‌.
తయారీ: మైదా, గోధుమ పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. బియ్యం, అటుకులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె పోసుకుని వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. దాంట్లో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్న తర్వాత ఫ్రాంకీ మసాలా, షెజ్‌వాన్‌ సాస్‌ వేసి బాగా కలపాలి. చిదిమిన బంగాళాదుంప, బియ్యం, అటుకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. బియ్యం, అటుకుల పొడి మిశ్రమం బాగా అతుక్కునేలా చేస్తుంది. స్టవ్‌ ఆఫ్‌చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను పైన చల్లాలి. ఇవి తప్పనిసరి కాదు. ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమపిండి ముద్దతో నాలుగు చపాతీలు చేసుకుని వీటిని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చపాతీ మీద షెజువాన్‌ చట్నీ, టమాటా సాస్‌ రాసి, తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టుకోవాలి. సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, ఫ్రాంకీ మసాలా, కొత్తిమీర వేసి చపాతీని గట్టిగా చుట్టుకోవాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని