మామిడితో దోస్తీ.. మటన్‌ మస్తీ!

పచ్చిమామిడిని పచ్చడి పెట్టడానికి... ఏడాది పొడవునా ఎదురుచూసే ఆవకాయ ప్రియులు ఉంటారు! వీళ్లు అంతటితో ఆగిపోతే విశేషమేముంటుంది.. మామిడిని మటన్‌తో మిక్స్‌చేసి మజారుచులను వారుస్తారు... రొయ్యలతో కలిపి వండి అదిరిందిరయ్యో అనిపిస్తారు.. ఇలా ఒక్కటి కాదు... జిహ్వకు పనిచెప్పే రుచులు మేళానే జరుపుకొంటారు.. అందులో ఇవీ కొన్ని...

Published : 03 May 2020 00:58 IST

పచ్చిమామిడిని పచ్చడి పెట్టడానికి... ఏడాది పొడవునా ఎదురుచూసే ఆవకాయ ప్రియులు ఉంటారు! వీళ్లు అంతటితో ఆగిపోతే విశేషమేముంటుంది.. మామిడిని మటన్‌తో మిక్స్‌చేసి మజారుచులను వారుస్తారు... రొయ్యలతో కలిపి వండి అదిరిందిరయ్యో అనిపిస్తారు.. ఇలా ఒక్కటి కాదు... జిహ్వకు పనిచెప్పే రుచులు మేళానే జరుపుకొంటారు.. అందులో ఇవీ కొన్ని...

మామిడి, మటన్‌ కర్రీ

కావాల్సినవి: మామిడికాయ- ఒకటి (చిన్నముక్కలు కోయాలి), ఎముకల్లేని మటన్‌- అరకేజీ, ఆమ్‌చూర్‌ పొడి- టీస్పూన్‌, పెరుగు- ముప్పావుకప్పు, పసుపు- టీస్పూన్‌, నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు- టీస్పూన్‌, జీలకర్ర- టీస్పూన్‌, కరివేపాకు రెబ్బలు- పది, లవంగాలు- అయిదు, దాల్చిన చెక్క- చిన్నముక్క, పెద్ద ఉల్లిపాయలు- రెండు (చిన్న ముక్కలుగా కోయాలి), అల్లం పేస్టు- టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి- టేబుల్‌స్పూన్‌, కారం- టేబుల్‌స్పూన్‌, గరంమసాలా- టీస్పూన్‌, ఉప్పు- తగినంత.
తయారీ: మటన్‌ ముక్కలకు పెరుగు, ఆమ్‌చూర్‌ పొడి, పసుపు పట్టించి ఫ్రిజ్‌లో పెట్టాలి. మందపాటి గిన్నెలో నూనె పోసి వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, లవంగాలు, దాల్చినచెక్క వేయాలి. ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయలు వేసి గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు మటన్‌ ముక్కలు, అల్లం పేస్టు వేయాలి. స్టవ్‌ మంట బాగా పెంచి బాగా వేయించాలి. తర్వాత ధనియాల పొడి, కారం, గరంమసాలా పొడి, మామిడికాయ ముక్కలు వేయాలి. వీటిని బాగా కలుపుతూ కొన్ని నిమిషాలు వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు మంట తగ్గించి, మూత పెట్టి అరగంటపాటు లేదా మటన్‌ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. ఉప్పు వేసి సన్నటి మంట మీద కూర దగ్గరకు అయ్యేంతవరకు ఉంచాలి. ఈ కూర అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.


మామిడికాయ, రొయ్యల వేపుడు

కావాల్సినవి: రొయ్యలు- అరకేజీ, తురిమిన మామిడికాయ- ఒకటి, ఉల్లిపాయలు- రెండు (సన్నగా ముక్కలు కోయాలి), పచ్చిమిర్చి- నాలుగు (సన్నగా చీల్చినవి), కారం- రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా పొడి- టీస్పూన్‌, ధనియాల పొడి- టీస్పూన్‌, పసుపు- టీస్పూన్‌, నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- సరిపడా.
తయారీ: రొయ్యలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి ఎర్రగా వేయించాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి కాసేపు వేయించాలి. ఇందులో మామిడికాయ తురుము వేసి బాగా కలిపి పావుగంట సేపు ఉడికించాలి లేదా నూనె పైకి తేలేంతవరకు ఉంచాలి.


పెసర పచ్చడి

కావాల్సినవి: మామిడికాయ ముక్కలు- ముప్పావు కప్పు, పెసరపప్పు- అరకప్పు, ఎండుమిర్చి- ఎనిమిది, జీలకర్ర- టీస్పూన్‌, బెల్లం- అర టీస్పూన్‌ (మామిడికాయ మరీ పుల్లగా ఉంటేనే వాడాలి), ఉప్పు- తగినంత.
తాలింపు కోసం: ఆవాలు- అర టీస్పూన్‌, మినప్పప్పు- అర టీస్పూన్‌, ఎండుమిర్చి- రెండు, ఇంగువ- చిటికెడు, కరివేపాకు రెబ్బ- ఒకటి, నూనె- టేబుల్‌ స్పూన్‌.
తయారీ: పెసరపప్పును తక్కువ మంట మీద ఎర్రగా వేయించి చల్లార్చుకోవాలి. అలాగే జీలకర్ర, ఎండుమిర్చిలను కూడా వేయించి, చల్లార్చాలి. ఇప్పుడు పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిర్చిలను మిక్సీలో వేసి పొడి చేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ఉప్పు, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిశ్రమంలా తయారుచేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, మినప్పప్పు వేసి కాస్త వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొన్ని సెకన్లపాటు వేయించి స్టవ్‌ కట్టేయాలి. ఈ తాలింపును పచ్చడిలో వేయాలి. ఈ మామిడికాయ, పెసర పచ్చడి అన్నం, రోటీల్లోకే కాకుండా దోసెల్లోకీ బాగుంటుంది.


ఆమ్‌పన్నా

కావాల్సినవి: పచ్చి మామిడికాయలు- మూడు (మధ్యస్థంగా ఉండాలి), పంచదార పొడి- మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- టీస్పూన్‌, నల్లఉప్పు- అర టీస్పూన్‌, నల్ల మిరియాల పొడి- అర టీస్పూన్‌, పుదీనా పేస్టు- కొద్దిగా, వేయించిన జీలకర్ర పొడి- పావు టీస్పూన్‌, ఐస్‌క్యూబ్స్‌- కొన్ని, చల్లని నీళ్లు- రెండు గ్లాసులు.
తయారీ: మామిడికాయలను కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి అయిదారు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. గిన్నెలో మామిడికాయల గుజ్జు, పంచదార పొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు, నల్ల ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడి, పుదీనా పేస్టు, చల్లటి నీళ్లు కలపాలి. దీన్ని గ్లాసుల్లో పోసి కావాలనుకుంటే ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగేసేయొచ్చు.


చికెన్‌ కూర

కావాల్సినవి: స్కిన్‌లెస్‌ చికెన్‌- కేజీ, ఉడికించిన మామిడికాయ గుజ్జు- కప్పు, పసుపు- టీస్పూన్‌, కారం- రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి- టీస్పూన్‌, జీలకర్ర పొడి- టీస్పూన్‌, నూనె- నాలుగు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి- ఆరు, చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్‌, గరంమసాలా పొడి- టీస్పూన్‌, ఆమ్‌చూర్‌ పొడి- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- టేబుల్‌స్పూన్‌.
తయారీ: గిన్నెలో మామిడికాయ గుజ్జు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరంమసాలా పొడి, టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి రెండు గంటలపాటు పక్కన పెట్టాలి. మందపాటి గిన్నెలో మిగిలిన నూనె పోసి వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంతవరకు వేయించాలి. తర్వాత అల్లంవెల్లులి పేస్టు, మసాలా పట్టించిన చికెన్‌ వేసి మూతపెట్టి మధ్యస్థంగా ఉండే మంట మీద పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి ఇరవై నిమిషాల పాటు ఉడికించి, నూనె పైకి తేలిన తర్వాత స్టవ్‌ కట్టేయాలి. చివరగా కొత్తిమీర తురుము వేయాలి. అన్నం, చపాతీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.


పచ్చిమామిడి ఉపయోగాలు
* జీవక్రియను వేగవంతం చేసి ఎక్కువ కెలొరీలు ఖర్చయ్యేలా చేస్తాయి.
* అజీర్తి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. వీటిని తినడం వల్ల వాంతులు, వికారం లాంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
* మామిడికాయలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్‌-ఎ, క్యాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.
* దంత క్షయాన్ని నియంత్రిస్తాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నివారిస్తాయి.
* మామిడికాయలో సోడియం, క్లోరైడ్‌, ఇనుము ఉంటాయి. వేసవిలో శరీరం చెమట రూపంలో వీటిని కోల్పోతుంది. పచ్చిమామిడిని తినడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు.


- పవన్‌ సిరిగిరి, చెఫ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని