పులిహోర... నోరూర!

గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం... అమృతంలా ఉంటుంది  కదా. ఇంకాస్త పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి పులిహోరను మనమూ ప్రయత్నించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అంతేకాదు ఇంకా దబ్బ, మామిడి, ఆవకాయలతోనూ దీన్ని ప్రయత్నించవచ్చు...ప్రసాదం పులిహోరకావాల్సినవి: అన్నం- పావుకేజీ, చింతపండు- 50 గ్రా., పసుపు- టీస్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడా, కరివేపాకు రెబ్బలు- రెండు, చీల్చిన పచ్చిమిర్చి- మూడు, ఆవాలు- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం- చిన్నముక్క, ఎండుమిర్చి- రెండు,...

Updated : 18 Oct 2020 04:08 IST

గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం... అమృతంలా ఉంటుంది  కదా. ఇంకాస్త పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి పులిహోరను మనమూ ప్రయత్నించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అంతేకాదు ఇంకా దబ్బ, మామిడి, ఆవకాయలతోనూ దీన్ని ప్రయత్నించవచ్చు...


ప్రసాదం పులిహోర

కావాల్సినవి: అన్నం- పావుకేజీ, చింతపండు- 50 గ్రా., పసుపు- టీస్పూన్‌, ఉప్పు- రుచికి సరిపడా, కరివేపాకు రెబ్బలు- రెండు, చీల్చిన పచ్చిమిర్చి- మూడు, ఆవాలు- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం- చిన్నముక్క, ఎండుమిర్చి- రెండు, బెల్లంపొడి- టీస్పూన్‌. రెండోతాలింపు కోసం: వేరుసెనగపప్పు- పావు కప్పు, మినప్పప్పు, సెనగపప్పు- టేబుల్‌స్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- ఐదు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఇంగువ, బెల్లంపొడి- చిటికెడు .
తయారీ: అన్నాన్ని కాస్త పలుగ్గా వండుకుని, చింతపండును వేడినీళ్లలో నానబెట్టుకోవాలి. అన్నం వేడిగా ఉన్నపుడే దాని మీద పసుపు, ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. కొంచెం  వేరుసెనగ నూనె లేదా నువ్వుల నూనె పోసి అన్నానికి పట్టేలా పైపైన కలపాలి. ఇప్పుడు ఆవాలు, అల్లం, ఎండుమిర్చిని మిక్సీజార్‌లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేయాలి. దీంట్లో ఉప్పు వేయడం వల్ల వగరు రాకుండా ఉంటుంది. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేసి ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో చింతపండు పులుసుపోసి అది గుజ్జుగా అయ్యేంతవరకు మరిగించాలి. దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడివేస్తే పులిహోర మరీ పుల్లగా ఉండదు. పులుసు దగ్గరగా అయిన తర్వాత దీంట్లో ఆవాలపేస్టు వేసి ఉడికించాలి. తర్వాత చల్లారిన అన్నాన్ని దీంట్లో వేసి మళ్లీ రెండో తాలింపు వేయాలి. దీనివల్లే పులిహోరకు అదనపు రుచి వస్తుంది. కడాయిలో నూనె పోసి వేడిచేసి ఆవాలు వేసి అవి చిటపటలాడాక వేరుసెనగపప్పు, మినప్పప్పు, సెనగపప్పు వేయాలి. దీంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి.


దబ్బకాయతో..

కావాల్సినవి: బియ్యం- పావుకేజీ, దబ్బకాయ- సగం ముక్క, పోపు దినుసులు- టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి- రెండు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- రెండు రెబ్బలు, పసుపు- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, ఇంగువ- చిటికెడు, వేయించిన వేరుసెనగపప్పు- టేబుల్‌స్పూన్‌.
తయారీ: అన్నాన్ని కాస్త పలుగ్గా వండాలి. వేరుసెనపప్పును నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.  దబ్బకాయ రసం తీసుకోవాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి దోరగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేసి ఆ తర్వాత అన్నం, వేయించిన వేరుసెనగపప్పు వేయాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసి దబ్బకాయ రసం జోడించి బాగా కలపాలి.


మామిడికాయతో

కావాల్సినవి: అన్నం- పావుకేజీ, పచ్చి మామిడికాయ- ఒకటి, జీడిపప్పు- 50 గ్రా., ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు- టీస్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- ఐదు, వేరుసెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు.
తయారీ: పచ్చి మామిడికాయను సన్నగా తురుముకోవాలి. అన్నాన్ని కాస్త బిరుసుగా వండి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పును నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. దీంట్లో అన్నం వేసి కలపాలి. తర్వాత మామిడి తురుము, ఉప్పు వేయాలి. ఇవన్నీ అన్నానికి బాగా పట్టేలా కలపాలి.


అయ్యంగార్‌ పులిహోర

కావాల్సినవి: అన్నం- పావుకేజీ, వేరుసెనగపప్పు- రెండు టీస్పూన్లు, నువ్వుల నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, కరివేపాకు- రెండు రెబ్బలు, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, సెనగపప్పు- టీస్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- ఆరు, పసుపు- టీస్పూన్‌, ఇంగువ- కొద్దిగా, ఉప్పు- సరిపడినంత
తయారీ: చింతపండును వేడినీళ్లలో నానబెట్టి, రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం నూనె పోసి వేడిచేసి ఎండుమిర్చి, నువ్వులు, సెనగపప్పు, ధనియాలు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడిచేసి ఆవాలు, నువ్వులు, సెనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చివర్లో చింతపండు రసం పోయాలి. దీంట్లో కొంచెం ఇంగువ, ఉప్పు వేయాలి. పులుసు కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టాలి. కడాయిలో చిటికెడు నూనె పోసి వేడిచేసి వేరుసెనగపప్పు, కరివేపాకు వేయాలి. దీంట్లో అన్నం వేసి తర్వాత చింతపండు పేస్టు, మిక్సీపట్టిన పొడి వేసి కలపాలి. చివరగా సరిపడినంత ఉప్పు కలిపితే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని