ప్రతిరోజూ పండగే.. ఈ ప్రసాదాలతో!

చలిగాలులు వీచే ధనుర్మాసం... ఉదయాన్నే మోగే గుడి గంటలు.. చక్కని సువాసనలు వెదజల్లే ప్రసాదాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ప్రసాదాలను మనమూ ప్రయత్నిద్దామా...అన్నం- కప్పు, పెరుగు- కప్పు, పాలు- కప్పు, ఉప్పు- సరిపడా, మిరియాల పొడి- కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, మిరియాలు- టీస్పూన్‌ చొప్పున, మిరియాలపొడి, ఇంగువ- చిటికెడు, ఎండుమిర్చి- నాలుగు, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా.

Published : 13 Dec 2020 00:35 IST

చలిగాలులు వీచే ధనుర్మాసం... ఉదయాన్నే మోగే గుడి గంటలు.. చక్కని సువాసనలు వెదజల్లే ప్రసాదాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ప్రసాదాలను మనమూ ప్రయత్నిద్దామా...


దధ్యోదనం

కావాల్సినవి: అన్నం- కప్పు, పెరుగు- కప్పు, పాలు- కప్పు, ఉప్పు- సరిపడా, మిరియాల పొడి- కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, మిరియాలు- టీస్పూన్‌ చొప్పున, మిరియాలపొడి, ఇంగువ- చిటికెడు, ఎండుమిర్చి- నాలుగు, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ: అన్నాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని దాంట్లో పెరుగు, పాలు వేయాలి. పాలు వేయడం వల్ల అన్నం పుల్లగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి ఆవాలు, జీలకర్ర మినప్పప్పు, సెనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు వేయాలి. ఇలాగే అటుకులతో కూడా దధ్యోదనం చేసుకోవచ్చు.


కట్టె పొంగలి

కావాల్సినవి: బియ్యం- అరకప్పు, పెసరపప్పు- అరకప్పు, పోపు దినుసులు(జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు)- టీస్పూన్‌, ఎండుమిర్చి- రెండు, తరిగిన పచ్చిమిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, మిరియాలు- అర టీస్పూన్‌, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు- పావుకప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పసుపు- పావు టీస్పూన్‌.
తయారీ: బియ్యం, పెసరపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, పోపుదినుసులు, మిరియాలు పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీంట్లో పసుపు, సరిపడా ఉప్పు వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతుండగా బియ్యం, పెసరపప్పు వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్‌ వచ్చేంతవరకు ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగు చల్లాలి.


చక్కెర పొంగలి

కావాల్సినవి: బియ్యం- కప్పు, పెసరపప్పు- కప్పు, బెల్లం తురుము- కప్పు, పంచదార- కప్పు, నెయ్యి- అరకప్పు, కొబ్బరి ముక్కలు- అరకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌- టేబుల్‌స్పూన్‌ చొప్పున, యాలకులపొడి- చిటికెడు.
తయారీ: బియ్యం, పెసరపప్పును గంట ముందే నానబెట్టుకోవాలి. గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించి దాంట్లో బియ్యాన్ని వేయాలి. అవి ఉడుకుతుండగా పెసరపప్పు వేయాలి. కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌, కొబ్బరిముక్కలను వేయించాలి. గిన్నెలో బెల్లం తురుము, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం పట్టాలి. దీన్ని ఉడికిన అన్నంలో పోస్తూ బాగా కలుపుతూ తక్కువ మంట మీద ఉడికించాలి. చివరగా నెయ్యి, యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌, కొబ్బరిముక్కలు వేయాలి.


పులిహోర పొడి

కావాల్సినవి: కొబ్బరి తురుము- పావుకప్పు, మినప్పప్పు- అరకప్పు, సెనగపప్పు- కప్పు, మెంతులు- టేబుల్‌స్పూన్‌, నువ్వులు- అరకప్పు, ఉప్పు- తగినంత, బెల్లం తురుము- టేబుల్‌స్పూన్‌, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, ఎండుమిర్చి- ఆరు, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు. తాలింపు కోసం: ఆవాలు- టీస్పూన్‌, వేరుసెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు- టీస్పూన్‌, కరివేపాకు- నాలుగు రెబ్బలు, ఇంగువ- టీస్పూన్‌.
తయారీ: కొబ్బరి తురుము, నువ్వులను నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మినప, సెనగపప్పు, మెంతులను వేయించాలి. కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని వేయించాలి. చింతపండును కడిగి ఎండుబెట్టుకోవాలి. దీన్ని కూడా కడాయిలో వేసి వేయించాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిలో బెల్లం పొడి, ఉప్పు కలిపి మిక్సీజార్‌లో వేసి కాస్త బరకగా పొడిచేయాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, వేరుసెనగప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ తాలింపులో అన్నం వేసి రెండు టేబుల్‌స్పూన్ల పొడి కలిపితే పులిహోర సిద్ధమవుతుంది. చింతపండు పులిహోర చేయాలంటే ముందుగా చాలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ఈ పొడి ఇంట్లో ఉంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా పులిహోర కలిపేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు