పోషకాల... చిక్కీచక్కనమ్మ!

బయట దొరికే ప్యాకెట్‌ ఫుడ్‌కి ప్రత్యామ్నాయంగా పిల్లలకో చిరుతిండి కావాలి... ఆఫీసులో సాయంత్రం తినడానికి పోషకాలు నిండిన ఓ స్నాక్‌ కావాలి... శీతకాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఓ సూపర్‌ఫుడ్‌ కావాలి...

Updated : 07 Nov 2021 05:14 IST

బయట దొరికే ప్యాకెట్‌ ఫుడ్‌కి ప్రత్యామ్నాయంగా పిల్లలకో చిరుతిండి కావాలి... ఆఫీసులో సాయంత్రం తినడానికి పోషకాలు నిండిన ఓ స్నాక్‌ కావాలి... శీతకాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఓ సూపర్‌ఫుడ్‌ కావాలి... వీటన్నింటికీ ఒకటే సమాధానం.... చిక్కీ! చిరుధాన్యాలు, డ్రైనట్స్‌... వేసి చేసిన వీటిని మీరూ ప్రయత్నించండి!


చిరుధాన్యాలతో

కావాల్సినవి: బెల్లం తురుము- కప్పు, ఊదలు- పావు కప్పు, కొర్రలు- పావు కప్పు, అవిసెగింజలు- చెంచా, బాదం పప్పులు- చెంచా, తెల్లనువ్వులు- చెంచా, గుమ్మడి గింజలు- చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, యాలకుల పొడి- పావుచెంచా

తయారీ: ఒక పాన్‌లో ఊదలు, కొర్రలని విడివిడిగా డ్రైరోస్ట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవిసెగింజలు, బాదంపప్పులు, నువ్వులను కూడా వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్‌లో బెల్లం తురుము వేసి అందులో చెంచా నెయ్యి... రెండు మూడు చెంచాల నీళ్లు వేసి ఐదారునిమిషాలు బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చిక్కీ చేయడానికి వీలుగా మారిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న చిరుధాన్యాలు, పప్పులని కూడా వేసి బాగా కలపాలి. వెంటనే నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి. పోషకభరితమైన చిరుధాన్యాల చిక్కీ సిద్ధం.


స్ట్రాబెర్రీలతో

కావాల్సినవి: జీడిపప్పులు, బాదం పప్పులు కలిపి- అరకప్పు, బెల్లం- 200గ్రా, నెయ్యి- రెండు చెంచాలు, స్ట్రాబెర్రీ గుజ్జు- పావుకప్పు, ఎరుపురంగుఫుడ్‌ కలర్‌- నాలుగు చుక్కలు

తయారీ: జీడిపప్పులు, బాదంపప్పులని చిన్నపలుకులుగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో చెంచా నెయ్యి వేసి వేడిచేసుకుని అందులో బెల్లం వేసి అది పాన్‌కి అంటకుండా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఇందులోనే ఫుడ్‌ కలర్‌ కూడా వేసుకుని అది పూర్తిగా కలిసి బెల్లం మొత్తం కరిగిన తర్వాత గ్యాస్‌ కట్టేయాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీ గుజ్జు, తరిగిన డ్రైనట్స్‌ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పళ్లెం తీసుకుని దానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి సమంగా కావాలనుకున్న మందంలో చపాతీల కర్రతో ఒత్తుకోవాలి. వేడిగా ఉండగానే ముక్కలుగా కోసుకుని డబ్బాలో దాచుకోవచ్చు. పోషకాలు అందించే చక్కని స్నాక్‌ ఇది.


కొర్రల చిక్కీలు..

కావాల్సినవి: కొర్రలు- కప్పు, తాటిబెల్లం- కప్పు, యాలకులపొడి- చిటికెడు, నెయ్యి- చెంచా, వేయించిన పల్లీలు- చెంచాన్నర

తయారీ: ఒక పాత్రలో కొర్రలని దోరగా డ్రైరోస్ట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక మందపాటి పాత్రలో తాటిబెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. అది పూర్తిగా కరిగిన తర్వాత అందులో కొర్రలు, పల్లీలు వేసి పూర్తిగా కలిపిన తర్వాత గ్యాస్‌ కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిరాసిన వెడల్పాటి పాత్రలోకి తీసుకుని అందులో సమానంగా పరుచుకోవాలి. నెయ్యిరాసిన చాకుతో సమానంగా కోసుకుంటే కొర్రల చిక్కీ సిద్ధం.


మరమరాలు-నువ్వులతో

కావాల్సినవి: మరమరాలు- కప్పు, బెల్లం- కప్పులో మూడో వంతు, నువ్వులు- పావుకప్పు, యాలకులపొడి- చిటికెడు, నెయ్యి- తగినంత

తయారీ: వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. అడుగు మందంగా ఉండే కడాయిలో నువ్వులని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరమరాలు మెత్తబడితే మరోసారి వేయించి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ పాకాన్ని నీటిలో వేస్తే కరిగిపోకూడదు. ఉండలా అయితే అది చిక్కీకి వీలుగా ఉన్నట్టు లెక్క. ఇందులో మరమరాలు, నువ్వులు, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఒక్కసారి మరమరాలు వేసిన తర్వాత ఆ మిశ్రమం వేగంగా గట్టిపడుతుంది. అందుకే దీన్ని చకచకా నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకున్న పళ్లెంలోకి తీసుకుని ముక్కలుగా చేసి చల్లారిన తర్వాత దాచిపెట్టుకోవాలి.


డ్రైనట్‌ చిక్కీ..

కావాల్సినవి: బాదం- ముప్పావు కప్పు, జీడిపప్పు- ముప్పావు కప్పు, పిస్తా పప్పులు- రెండు చెంచాలు, గుమ్మడి గింజలు- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా, బెల్లం- కప్పు, నీళ్లు- పావుకప్పు, యాలకులపొడి- చిటికెడు

తయారీ: పాన్‌లో బాదం, పిస్తా, జీడిపప్పులు, గుమ్మడి గింజలు వీటన్నింటినీ పదినిమిషాలు దోరగా కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో చెంచా నెయ్యి వేసి వేడి చేసుకుని అందులో బెల్లం, పావుకప్పు నీళ్లు పోసి అది కరిగే వరకూ బాగా కలుపుకోవాలి. ఐదారునిమిషాలకల్లా బెల్లం మీకు కావాల్సిన విధంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని నీళ్ల గ్లాసులో వేస్తే కరిగిపోకుండా ఉండలా మారితే అది సరైన పాకం కింద లెక్క. ఇందులో వేయించిన డ్రైనట్స్‌, కొద్దిగా యాలకుల పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. వేడిగా ఉండగానే ఒక పళ్లానికి నెయ్యి రాసి... అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. పైన నెయ్యి రాసిన బటర్‌పేపర్‌ని ఉంచి చపాతీల కర్రతో ఒత్తితే చిక్కీలు సమానంగా వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని