దాహార్తిని తీర్చే సోల్‌ఖడీ!

వేసవిలో ఏమీ తినాలనిపించదు. ఏమైనా తాగాలనిపిస్తుందంతే. అలాగని మంచినీళ్లు మాత్రమే తాగుతూ ఉండలేం కదా. కాస్త పలుచగా ఉండి శక్తినిచ్చే పానీయం ఏమైనా ఉంటే మేలనుకుంటాం. అందుకే దాహం తీర్చుకోవడానికి పలుచటి మజ్జిగనూ తాగుతుంటాం...

Published : 17 May 2020 01:33 IST

మహారాష్ట్ర ప్రత్యేకం!

పొరుగింటి పుల్లకూర!

వేసవిలో ఏమీ తినాలనిపించదు. ఏమైనా తాగాలనిపిస్తుందంతే. అలాగని మంచినీళ్లు మాత్రమే తాగుతూ ఉండలేం కదా. కాస్త పలుచగా ఉండి శక్తినిచ్చే పానీయం ఏమైనా ఉంటే మేలనుకుంటాం. అందుకే దాహం తీర్చుకోవడానికి పలుచటి మజ్జిగనూ తాగుతుంటాం. ఇంచుమించు అలాంటిదే ఈ పానీయం కూడా. దీన్ని గోవా, మహారాష్ట్రలో ఎండాకాలంలో ఎక్కువగా తాగుతుంటారు. అక్కడ విరివిగా దొరికే కోకమ్‌ పండుతో దీన్ని తయారుచేస్తారు. కోకమ్‌... అంటే ఏంటో అని కంగారుపడకండి. మనం  చింతపండు వాడినట్టుగా అక్కడ కోకమ్‌ను  వాడతారు. కోకమ్‌ రసం, కొబ్బరి పాలతో తయారుచేసే ఈ పానీయం దాహార్తిని తీరుస్తుంది. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.  దీంట్లో క్యాల్షియం, పొటాషియం, ఇనుము, పీచు, విటమిన్‌-సి ఉంటాయి. పిండిపదార్థాలు తక్కువ. దీన్ని మజ్జిగ పులుసులా అన్నంలో కలిపి తినొచ్చు లేదా విడిగా తాగొచ్చు. దీనికి కోకమ్‌ కర్రీ, గోవన్‌ సోల్‌, కోల్‌ఖడీ, కోకమ్‌ ఖడీ అని చాలా పేర్లే ఉన్నాయి. గోవాకు విహారయాత్రకు వెళ్లిన వాళ్లంతా దీని రుచిని ఆస్వాదిస్తారు. జీరారైస్‌తో సోల్‌ఖడీని కలిపి తింటే అదిరిపోతుందంటారు ఆహారప్రియులు.

ప్రయోజనాలెన్నో: ఇది జీర్ణశక్తిని పెంచడమే కాకుండా ఉపశమనాన్ని కలిగిస్తుంది. కోకమ్‌ కడుపులోని అల్సర్లను తగ్గిస్తుందని చెబుతారు  ఆయుర్వేద నిపుణులు. ఈ రసం నీళ్ల విరేచనాలను నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్నిస్తుంది.  ఇన్ని ప్రయోజనాలున్న దీన్ని ఎలా తయారుచేయాలంటే...
కావాల్సినవి: ఎండిన కోకమ్‌లు- ఇరవై, కొబ్బరి తురుము- కప్పు, ఉప్పు- సరిపడా, అల్లం- చిన్నముక్క,  తరిగిన పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర తురుము- కొద్దిగా.
తయారీ: కప్పు వేడినీళ్లలో ఎండిన కోకమ్‌ పండ్లను అరగంటపాటు నానబెట్టాలి. వాటి నుంచి రసం తీసి పిప్పిని పారేయాలి. కొబ్బరి తురుమును కప్పు నీళ్లలో పదినిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చితోపాటు జ్యూసర్‌లో వేసి మెత్తని పేస్టు చేయాలి. దీన్ని వడగట్టి వచ్చిన చిక్కని కొబ్బరిపాలను పక్కన పెట్టాలి. ఇదే మిశ్రమంలో కొన్నినీళ్లు పోసి మళ్లీ మిక్సీ పట్టాలి. దీన్ని వడగడితే పలుచటి కొబ్బరిపాలు వస్తాయి. ఇప్పుడు గిన్నెలో చిక్కటి, పలుచటి కొబ్బరిపాలు, కోకమ్‌ రసం వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి అలంకరించాలి. ఇష్టమైతే ఆవాలు, జీలకర్రతో తాలింపు కూడా పెట్టుకోవచ్చు. దీన్ని అలాగే తాగేయొచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత తాగొచ్చు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని