బాంబేడక్‌ అంటే బాతు కాదు..!

ముంబయి వడాపావ్‌కి ఫేమస్‌ అయినట్టుగానే.. బాంబిల్‌ లేదా బాంబేడక్‌ వంటకానికి కూడా పేరొందింది. బాంబేడక్‌ అంటే కోడికూరలా బాతుకూరేమో అనుకోవద్దు. ఇదో రకం చేప వంటకం. ముంబయి చుట్టుపక్కల మాత్రమే దొరికే ఈ బాంబిల్‌ ఫ్రై ఇప్పుడు విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది...

Published : 17 Mar 2019 00:35 IST

పొరుగింటి పుల్లకూర!

ముంబయి వడాపావ్‌కి ఫేమస్‌ అయినట్టుగానే.. బాంబిల్‌ లేదా బాంబేడక్‌ వంటకానికి కూడా పేరొందింది. బాంబేడక్‌ అంటే కోడికూరలా బాతుకూరేమో అనుకోవద్దు. ఇదో రకం చేప వంటకం. ముంబయి చుట్టుపక్కల మాత్రమే దొరికే ఈ బాంబిల్‌ ఫ్రై ఇప్పుడు విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది...

ముంబయి వెళ్లిన మాంసాహారులు తప్పనిసరిగా రుచి చూసే వంటకం బాంబిల్‌ ఫ్రై. మూమూలు చేప వంటకంతో పోలిస్తే... ఈ బాంబేడక్‌ తయారీ కాస్త భిన్నం. రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. సాధారణంగా చేపలంటే ముందు గుర్తుచ్చేది ఇబ్బందిపెట్టే ముళ్లే కదా! కానీ ఇందులో ఎటువంటి ముళ్లూ ఉండవు.. మెత్తగా, నీటితో నిండిపోయే చేప ఇది. చేపలని శుభ్రంగా కడిగి రెక్కలు, తల, తోకా తీసేసి వస్త్రంతో తడి లేకుండా తుడిచేయాలి. పసుపు, ఉప్పు, నిమ్మరసం పట్టించి మారినేట్‌ చేసి దానిపై బరువుని ఉంచితే చేపలోని నీరంతా పోయి గట్టిపడి వండుకోవడానికి అనువుగా మారుతుంది. తర్వాత మసాలాపట్టించి, రవ్వలో కానీ బ్రెడ్‌పొడిలో కానీ దొర్లించి వేయిస్తారు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ వంటకానికి బోలెడుమంది అభిమానులున్నారు. చూడ్డానికి మన బొమ్మిడాయిల్లా ఉండే ఇవి ఎండుచేపలుగా కూడా దొరుకుతాయి. కాకపోతే ఆ ఎండు చేపల వాసన భరించడం కాస్త కష్టం. ఇంత రుచిగా ఉండే ఈ చేపలు అరేబియా సముద్రంలోని కచ్‌ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఇంతకీ ఈ చేపకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?


బాంబే డాక్‌ అనే పదం నుంచి పుట్టిన మాటే బాంబేడక్‌. మనదేశానికి రైలు మార్గాలు పరిచయం అయిన కొత్తల్లో ముంబయి నుంచి ఇతర ప్రాంతాలకు ఈ చేపలు ఎగుమతి అయ్యేవి. భరించరాని వాసనొచ్చే ఈ చేపల కోసం ప్రత్యేకించి ఓ రైలు కూడా వేశారు. దానిపేరే బాంబే డాక్‌. అది కాస్త కాలక్రమంలో బాంబేడక్‌గా మారింది.


- జ్యోతి వలబోజు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని