సొర... నోరూర! 

ఎండల వేడి నుంచి రక్షించే సొరకాయతో రకరకాల వంటలు చేయొచ్చు.  దీంతో తియ్యని హల్వా చేయొచ్చు. పరాటాలూ, అప్పాలు ఒత్తేయొచ్చు. సొరకాయ ముక్కల్లో కాసిన్ని పచ్చిరొయ్యలు వేసి... మరికాస్త మసాలా జోడిస్తే కూర

Updated : 28 Mar 2021 05:06 IST

ఎండల వేడి నుంచి రక్షించే సొరకాయతో రకరకాల వంటలు చేయొచ్చు.  దీంతో తియ్యని హల్వా చేయొచ్చు. పరాటాలూ, అప్పాలు ఒత్తేయొచ్చు. సొరకాయ ముక్కల్లో కాసిన్ని పచ్చిరొయ్యలు వేసి... మరికాస్త మసాలా జోడిస్తే కూర అదిరిపోవాల్సిందే... ఇంకెందుకాలస్యం.

హల్వా

కావాల్సినవి: సొరకాయ తురుము- రెండు కప్పులు, జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదం తురుము- రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార- ముప్పావుకప్పు, పాలు- కప్పు, యాలకుల పొడి- చిటికెడు, నెయ్యి- టేబుల్‌స్పూన్‌.  
తయారీ: కడాయిలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్్సను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో సొరకాయ తురుము వేసి పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించాలి. దీంట్లో పంచదార వేసి కరిగేంతవరకు కలపాలి. తర్వాత పాలు పోసి తక్కువ మంట మీద దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, డ్రైఫ్రూట్‌ వేసి దించేయాలి.

పరాటా

కావాల్సినవి: సొరకాయ తురుము- కప్పు, గోధుమ పిండి- రెండు కప్పులు, నెయ్యి- అర టేబుల్‌స్పూన్‌, ఉప్పు- తగినంత.
తయారీ: సొరకాయను చెక్కు తీయకుండా తురమాలి. గిన్నెలో సొరకాయ తురుము, గోధుమపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. తురిమిన వెంటనే పిండిలో వేసి ముద్దలా కలపాలి. దీన్ని పావుగంటపాటు పక్కన పెట్టాలి. తర్వాత చపాతీల్లా ఒత్తుకోవాలి. పెనం వేడిచేసి చపాతీ వేసి ఒకవైపు కాల్చాలి. రెండోవైపు తిప్పినప్పుడు కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. వేడివేడిగా తింటే ఇవి చాలా బాగుంటాయి.

కోఫ్తా

కావాల్సినవి: సొరకాయ తురుము- కప్పు, టొమాటో ముక్కలు- అరకప్పు, జీడిపప్పు- ఏడెనిమిది, సెనగపిండి- అరకప్పు, ఎండుకొబ్బరి ముక్కలు- నాలుగైదు, వేయించిన వేరుసెనగపప్పు- రెండు టేబుల్‌స్పూన్లు, చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి- రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, గరంమసాలాపొడి- టీస్పూన్‌, జీలకర్ర, ఆవాలు- టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, పసుపు- అర టీస్పూన్‌, ఉప్పు- తగినంత.  
తయారీ: వెడల్పాటి గిన్నెలో సొరకాయ తురుము, సెనగపిండి, కొద్దిగా కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బజ్జీల పిండిలా కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఈ కోఫ్తాలను వేయించి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పు, జీడిపప్పు, ఎండుకొబ్బరిముక్కలు మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేయాలి. కడాయిలో నూనె వేడిచేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు ఒకదాని తర్వాత మరోటి వేసి దోరగా వేయించాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి టొమాటోలను మగ్గేవరకు ఉడికించాలి. దీంట్లో మిక్సీ పట్టిన వేరుసెనగపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి మూతపెట్టి పచ్చివాసన పోయేంతవరకు ఉడికించాలి. తర్వాత గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న కోఫ్తాలను వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.

పచ్చిరొయ్యలతో

కావాల్సినవి: పచ్చిరొయ్యలు- పావుకేజీ, సొరకాయ ముక్కలు- పావుకేజీ, చిన్న ముక్కలుగా కోసిన టొమాటోలు- రెండు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, గరంమసాలా పొడి- టీస్పూన్‌, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, లవంగాలు- మూడు, దాల్చిన చెక్క- చిన్నముక్క, యాలకులు- రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, కారం- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు- అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి ముక్కలు- నాలుగు.    
తయారీ: పచ్చిరొయ్యలను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఎండుకొబ్బరి, లవంగాలు, యాలకులను మిక్సీ పట్టి పొడి చేయాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఒకదాని తర్వాత మరోటి వేయాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిరొయ్యలు వేసి వేయించాలి. రొయ్యల్లోని నీరు ఇగిరేంత వరకు వేయించాలి. తర్వాత సొరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తక్కువ మంట మీద టొమాటో, సొరకాయలో ఉన్న నీటితో కూరను ఉడికించాలి. దీంట్లో పసుపు, కారం, ఉప్పు వేసి మూతపెట్టి మరికాసేపు మగ్గనివ్వాలి. తక్కువ మంట మీదే ఉడికించాలి. ఇప్పుడు మసాలా పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి కాసేపు ఉంచి కూర దగ్గరకు వచ్చిన తర్వాత దించేయాలి. అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కాల్లోకి ఇది చాలా బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని