సొరకాయ... చల్లగా కమ్మగా..!

అబ్బా సొరకాయా... యమాబోర్‌ అనేవాళ్లే మనలో ఎక్కువ. కానీ వండాలేగానీ సొరకాయ రుచులెన్నో... వాటికి మరేదీ సాటి రాదు అంటుంటారు వంటింటి మహారాణులు. మరి మనమూ వండేద్దామా..!

Published : 27 Jun 2021 16:39 IST

అబ్బా సొరకాయా... యమాబోర్‌ అనేవాళ్లే మనలో ఎక్కువ. కానీ వండాలేగానీ సొరకాయ రుచులెన్నో... వాటికి మరేదీ సాటి రాదు అంటుంటారు వంటింటి మహారాణులు. మరి మనమూ వండేద్దామా..!


సొరకాయ కొబ్బరిపాల కూర

కావలసినవి
సొరకాయ: అరకిలో, కొబ్బరిపాలు: కప్పు, పెరుగు: అరకప్పు, మంచినీళ్లు: రెండున్నర కప్పులు, కరివేపాకు: 4 రెబ్బలు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను
తయారుచేసే విధానం
* సొరకాయ తొక్కు తీసి ముక్కలు కోయాలి. తరవాత పాన్‌లో పెరుగు, మంచినీళ్లు పోసి బాగా కలపాలి. అందులోనే సొరకాయ ముక్కలు, ఉప్పు, రెండు రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. తరవాత కొబ్బరిపాలు పోసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు విడిగా చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకులతో పోపు చేసి కూరలో కలిపితే సరి.


సొరకాయ వడియాల కూర

కావలసినవి
సొరకాయ ముక్కలు: అరకిలో, జీలకర్ర: టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తురుము: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, కారం: టీస్పూను, గుమ్మడి లేదా మినప వడియాలు: కప్పు, మంచినీళ్లు: కప్పు, ఉప్పు: తగినంత, గరంమసాలా: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, నూనె: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
* సొరకాయ తొక్కు తీసి చిన్నముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక వడియాలు వేసి వేయించి తీయాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంతురుము, పచ్చిమిర్చి వేసి వేగాక టొమాటో ముక్కలు కూడా వేసి వేయించాలి.
* తరవాత పసుపు, ఇంగువ, కారం వేసి వేగాక సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వడియాలు కూడా వేసి ఓ నిమిషం కలిపిన తరవాత నీళ్లు పోసి మరీ మెత్తగా అవకుండా ఉడికించాలి.
* చివరగా గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి ఉడికించాలి.


సొరకాయ కుర్మా

కావలసినవి
సొరకాయ: అరకిలో, జీలకర్ర: అరటీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లిముద్ద: టీస్పూను, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టీస్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, మసాలా మిశ్రమం కోసం: తాజా కొబ్బరి తురుము: 3 టేబుల్‌స్పూన్లు, గసగసాలు: టీస్పూను, జీడిపప్పు: ఆరు
తయారుచేసే విధానం
* సొరకాయ తొక్కుతీసి ముక్కలు కోయాలి. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి జీలకర్ర వేసి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి ఓ నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసి అవి కాస్త మగ్గిన తరవాత సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా వేసి కలపాలి. తరవాత ఓ కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. తరవాత రుబ్బిన కొబ్బరి ముద్ద వేసి బాగా కలిపి సిమ్‌లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి దించాలి.

 


సొరకాయ బుజియా

కావలసినవి
సొరకాయ: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తురుము: పావుటీస్పూను, జీలకర్ర: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: 4 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* సొరకాయ తొక్కు తీసి గ్రేటర్‌తో సన్నగా తురమాలి. దీన్ని ప్రెషర్‌కుక్కర్‌లో వేసి అరకప్పు నీళ్లు పోసి ఓ విజిల్‌ రానివ్వాలి. తరవాత సిమ్‌లో రెండు నిమిషాలు ఉంచి, ఆఫ్‌ చేయాలి. ఆవిరి పోయి మూత తీశాక నీళ్లు వంపేసి సొరకాయ తురుముమీద చల్లని నీళ్లు పోసి వంచేయాలి. తరవాత తురుములో నీళ్లు లేకుండా పిండేసి పక్కన ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన అల్లం వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేగాక, సిమ్‌లో పెట్టి దనియాలపొడి, కారం, ఉప్పు వేసి కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు పిండేసి ఉంచిన సొరకాయ తురుము వేసి ఓ నిమిషం వేయించి చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని