మిగిలితే మరింత రుచిగా!

మధ్యాహ్నం మిగిలిన అన్నం.. రాత్రి చేసిన చపాతీలు...  ఎక్కువైన ఇడ్లీలు.. మిగిలిన పెసరట్టు.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇలా చేసి చూడండి. మిగిలిన వాటితో చేసే లెఫ్టోవర్‌ వంటకాలతో మనసు దోచేయండి...

Published : 11 Jun 2023 00:47 IST

మధ్యాహ్నం మిగిలిన అన్నం.. రాత్రి చేసిన చపాతీలు...  ఎక్కువైన ఇడ్లీలు.. మిగిలిన పెసరట్టు.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇలా చేసి చూడండి. మిగిలిన వాటితో చేసే లెఫ్టోవర్‌ వంటకాలతో మనసు దోచేయండి...


రైస్‌ కట్‌లెట్‌

కావాల్సినవి: అన్నం- కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంపముద్ద- అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, పచ్చిమిర్చి ముక్కలు- చెంచాన్నర, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, పసుపు- తగినంత, కారం- పావు చెంచా, జీలకర్రపొడి- అరచెంచా, గరంమసాలా- పావుచెంచా, సెనగపిండి- 3 చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, నూనె- మూడు చెంచాలు.

తయారీ: నూనె తప్పించి తక్కిన అన్ని పదార్థాలనీ ఒక పాత్రలో తీసుకోవాలి. వాటిని బాగా కలిపి ఉప్పు సరిచూసుకోవాలి. అలా కలిపినప్పుడే అన్నాన్ని కాస్త మెత్తగా మెదుపుకోవాలి. సెనగపిండికి బదులుగా బ్రెడ్‌పొడికానీ, బియ్యప్పిండికానీ వాడుకోవచ్చు. వాటిని గుండ్రని కట్‌లెట్‌ మాదిరిగా చేసుకోవాలి. వెడల్పాటి పాన్‌లో నూనె వేసుకుని కట్‌లెట్లని రెండు వైపులా కాల్చుకోవడమే. ఆరోగ్యానికీ మంచిదే.


చపాతీకోతు

కావాల్సినవి: చపాతీలు- ఆరు(సన్నగా నూడుల్స్‌లా తరిగిపెట్టుకోవాలి), ఉల్లిపాయ- ఒకటి, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- చెంచా, టొమాటో ముక్కలు- కప్పు, ఉప్పు- అరచెంచా, పసుపు- పావుచెంచా, కారం- అరచెంచా, కరివేపాకు- రెమ్మ, పుదీనా ఆకులు- ఆరు, నూనె- తగినంత  .

తయారీ: కడాయిలో నూనెవేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, గరంమసాలా, కారం వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పావుకప్పు నీళ్లు పోసి దాంట్లో కరివేపాకు, తరిగిన పుదీనా వేసి సన్నసెగమీద ఉంచి వేడెక్కాక చపాతీ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలని గ్రేవీలో వేసి కలిపితే వేడివేడి చపాతీకోతు రెడీ.


పైనాపిల్‌ ఫ్రైడ్‌రైస్‌

కావాల్సినవి: అన్నం- కప్పు, పచ్చిగా ఉన్న పైనాపిల్‌ ముక్కలు- ముప్పావు కప్పు, తరిగిన క్యాప్సికమ్‌, క్యారెట్‌, ఉల్లిగడ్డ ముక్కలు- రెండు చెంచాల చొప్పున, తరిగిన అల్లం, వెల్లుల్లి- చెంచా చొప్పున, పచ్చిమిర్చి- రెండు, ఉల్లికాడల తరుగు- చెంచాన్నర, నూనె- మూడు చెంచాలు, సోయా సాస్‌- చెంచా, చిల్లీ సాస్‌- చెంచా, ఉప్పు- తగినంత, జీడిపప్పులు- పది.

తయారీ: స్టౌపై కడాయి పెట్టి నూనెపోసి వేడయ్యాక ఉల్లిపాయముక్కల్ని బాగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి పలుకులు వేసి అవీ వేగాక క్యాప్సికమ్‌, క్యారెట్‌, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, జీడిపప్పు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక పైనాపిల్‌ ముక్కలు కూడా వేసి మరికాసేపు వేయించి సోయా, చిల్లీ సాస్‌, ఉప్పు, అన్నం వేయాలి. మూడు నిమిషాలపాటు సన్నటి మంటపై బాగా కలిపితే ఫ్రైడ్‌ రైస్‌ రెడీ.


ఇడ్లీజామూన్‌

కావాల్సినవి: ఇడ్లీలు- మూడు( క్యూబ్స్‌లా తరిగి పెట్టుకోవాలి), నీళ్లు- కప్పున్నర, పంచదార- 10 చెంచాలు, యాలకులు- మూడు, నూనె- వేయించడానికి సరిపడ.

తయారీ: లోతైన గిన్నెలో నీళ్లు పోసుకుని, పంచదార కూడా వేసుకుని స్టౌ మీద పెట్టుకోవాలి. మరుగుతున్నప్పుడు గరిటెతో తిప్పుతూ చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసుకోవాలి. స్టౌ కట్టేసి మూతపెట్టి ఓ పక్కన పెట్టేయాలి. కడాయిలో నూనె పోసి వేడెక్కాక ఇడ్లీ ముక్కలని దోరగా కరకరలాడేలా వేయించుకోవాలి. ఈ ముక్కలని పంచదార పాకంలో వేసుకుంటే కాసేపటికి పాకం పీల్చుకుని మృదువుగా మారతాయి. అంతే ఇడ్లీ జామూన్‌ రెడీ. పిల్లలు ఇష్టంగా తింటారు.


పెసరట్టు కూర

కావాల్సినవి: పెసరట్టు ముక్కలు- కప్పున్నర, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- చెంచా, కరివేపాకు- రెబ్బ, జీలకర్రపొడి- అరచెంచా, ధనియాలపొడి- అరచెంచా, ఉల్లిపాయముక్కలు- అరకప్పు, నూనె- చెంచాన్నర, ఉప్పు- రుచికి తగినంత, పసుపు- పావుచెంచా, కారం- చెంచాన్నర.

తయారీ: పెసరట్లపిండి మిగిలిపోతే కాస్త దళసరిగా పెసరట్టు వేసి ముక్కలు చేసుకోవచ్చు. లేదంటే మిగిలిన పెసరట్లనే ముక్కలు చేసుకోవచ్చు. వీటిని చల్లారనివ్వాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలని ఎర్రగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేలా వేపాలి. తర్వాత జీలకర్ర, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలిపి అప్పుడు పెసరట్టు ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మూతపెట్టేస్తే క్షణాల్లో పెసరట్టు ముక్కలు ఉడికిపోతాయి. అవసరం అనుకుంటే టొమాటోలు వేసుకోవచ్చు. కొంతమంది చింతపండు రసం వేసి పులుసు కూడా పెట్టుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని