పొత్తు కుదుర్చుకుందామా!

చిరుజల్లుల పలకరింపుతో, చల్లటి గాలుల కౌగిలింతలతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. ఇలాంటప్పుడు హాయిగా ఆస్వాదించడానికి మొక్కజొన్నను మించిన రుచేముంటుంది.

Published : 02 Jul 2023 00:24 IST

చిరుజల్లుల పలకరింపుతో, చల్లటి గాలుల కౌగిలింతలతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. ఇలాంటప్పుడు హాయిగా ఆస్వాదించడానికి మొక్కజొన్నను మించిన రుచేముంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే దీంతో ఎన్నెన్నో వంటకాలను ప్రయత్నించొచ్చు. అవేంటంటారా!


కార్న్‌ కట్లెట్‌

కావాల్సినవి: తీపి మొక్కజొన్న గింజలు- రెండు కప్పులు, బంగాళాదుంపలు- రెండు, బియ్యప్పిండి- రెండు చెంచాలు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, కరివేపాకు, కొత్తిమీర- రెండు రెబ్బలు చొప్పున, జీలకర్ర- అర టీస్పూను, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: ముందుగా మొక్కజొన్న గింజల్ని కాస్త ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. వీటి నుంచి ఓ పావు కప్పు తీసి పక్కన పెట్టాలి. మిగిలిన వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత బంగాళాదుంపల్ని కూడా ఉడికించి మెదిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి మొక్కజొన్న ముద్దతో పాటు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలాగి స్టౌ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక కార్న్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని కట్లెట్లుగా ఒత్తుకొని దోరగా వేయించుకుంటే సరి. వేడివేడి కార్న్‌ కట్లెట్‌ సిద్ధం.


కార్న్‌ పాయసం

కావాల్సినవి:  నెయ్యి - రెండు పెద్ద చెంచాలు,  జీడిపప్పు, కిస్‌మిస్‌ - పదేసి పలుకులు, పచ్చి కొబ్బరి తురుము- టేబుల్‌ స్పూను, తీపి మొక్కజొన్న గింజలు- రెండు కప్పులు, పాలు- లీటరు, పంచదార- ముప్పావు కప్పు, యాలకుల పొడి- కొద్దిగా, బాదం పలుకులు- పెద్ద చెంచా, కుంకుమ పువ్వు రేకలు- రెండు.

తయారీ: పావు వంతు మొక్కజొన్న గింజల్ని పక్కనపెట్టి మిగిలిన వాటినీ, బాదం పలుకుల్నీ మిక్సీలో వేసి బరకగా రుబ్బిపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలీ వేడి చేసి నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పులు, కిస్‌మిస్‌, పచ్చికొబ్బరి తురుము, మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి. ఆపై పాలు, మొక్కజొన్న పేస్ట్‌ కూడా జత చేసి మరిగించాలి. మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు పంచదార చేర్చి ఇంకొంత సేపు పొయ్యి మీదే ఉంచాలి. చివరగా యాలకుల పొడి వేసి దింపేయాలి. పైన కుంకుమ పువ్వు రేకలు చల్లితే పాయసం రుచి అదిరిపోతుంది.


కార్న్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావాల్సినవి: బాస్మతి రైస్‌- రెండు కప్పులు (ఉడికించినది), స్వీట్‌ కార్న్‌- కప్పు, సోయా, చిల్లీ సాస్‌, వెనిగర్‌- టేబుల్‌ స్పూను చొప్పున, వెల్లుల్లి తరుగు- పెద్ద చెంచా, ఉల్లిపాయ ముక్కలు- కప్పు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి- రెండు, ఉల్లికాడల తరుగు, ఆకుపచ్చ క్యాప్సికం, క్యారెట్‌ ముక్కలు- పావుకప్పు చొప్పున, మిరియాల పొడి- చెంచా, ఉప్పు- రుచికి సరిపడా.

తయారీ: నీళ్లలో కాస్త ఉప్పు వేసి స్వీట్‌ కార్న్‌ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలీ వేడి చేసి నూనె పోసి ముందుగా వెల్లుల్లి తరుగు వేసి వేగనివ్వాలి. ఆపై ఉల్లిపాయని రంగు మారేవరకూ మగ్గనిచ్చి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, క్యాప్సికం, క్యారెట్‌ ముక్కల్ని కూడా వేసి మగ్గనివ్వాలి. వెనిగర్‌, సోయా సాస్‌, చిల్లీ సాస్‌లను కూడా వేసి ఇరవై నిమిషాల పాటు వేయించాలి. తర్వాత స్వీట్‌ కార్న్‌, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరోసారి కలపాలి. ఉడికిన అన్నం వేసి బాగా కలిపి మంటమీద రెండు నిమిషాలు మగ్గనిచ్చి చివరగా మిరియాల పొడి చల్లుకుంటే సరి... స్వీట్‌ కార్న్‌ ఫ్రైడ్‌ రైస్‌ రెడీ.


మొక్కజొన్న అట్లు

కావాల్సినవి: మొక్కజొన్న గింజలు-కప్పు, మినపప్పు- అరకప్పు, సగ్గుబియ్యం- పావుకప్పు, బియ్యప్పిండి- పావుకప్పు, పెరుగు- కప్పు, అల్లం- చిన్న ముక్క, కరివేపాకు- రెమ్మ, జీలకర్ర- కొద్దిగా, ఉప్పు- రుచికి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు- పావుకప్పు(సన్నగా తరిగినవి), పచ్చిమిర్చిముక్కలు- పావు చెంచా, కొత్తిమీర- కొద్దిగా

తయారీ: ముందురోజు రాత్రి మినపప్పుని నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో సగ్గుబియ్యం, బియ్యప్పిండిని కూడా పెరుగులో కలిపి పక్కన పెట్టాలి. ఉదయాన్నే స్వీట్‌ కార్న్‌ గింజలను మొదట మిక్సీలోకి తీసుకుని ఓ తిప్పు తిప్పాలి. తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ దోశపిండిలా రుబ్బుకోవాలి. దోశ వేసే ముందు అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కలిపి వేస్తే సరి. ఇలా చేస్తే రుచికరమైన మొక్కజొన్న దోశ రెడీ. కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీ కారప్పొడి దేనితో తిన్నా బాగుంటుంది.


మొక్కజొన్న మష్రూమ్‌ కర్రీ

కావాల్సినవి: మొక్కజొన్న గింజలు- కప్పు, సన్నగా తరిగిన మష్రూమ్స్‌- కప్పు, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికం ముక్కలు- కప్పు చొప్పున (సన్నగా తరిగినవి), కొత్తిమీర తరుగు- పావు కప్పు, నూనె- తగినంత, ఉప్పు- రుచికి సరిపడా, కారం-రెండు చెంచాలు, పసుపు- చిటికెడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- చెంచా, లవంగాలు-మూడు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, యాలకులు-రెండు, జీలకర్ర, ధనియాల పొడి- చెంచా చొప్పున, గరం మసాలా- రెండు చెంచాలు.

తయారీ: బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేవరకూ ఉంచాలి. అప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలిపి...బంగారు రంగు వచ్చేవరకు మగ్గించాలి. ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో... రెండు నిమిషాలు ఆగి క్యాప్సికం కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. మొక్కజొన్న గింజలు, మష్రూమ్స్‌ వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి కప్పు నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటపైన ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే సరి. ఇది చపాతీల్లోకీ, పూరీ కూరగానూ కూడా బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని