జొన్న రొట్టె జోరు మీదుంది!

చపాతీ, రోటీ, నాన్‌...తినడం మనకు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్టలేసుకుంటూ తినేవారి సంఖ్యా పెరిగింది. నిజానికి ఒకప్పుడు జొన్నలకు పేదల ఆహారంగా పేరు. ఇప్పుడు మన వంటిళ్లలోనే కాదు... వీధుల్లోనూ జొన్న రొట్టెల తయారీ ఊపందుకుంది.

Published : 09 Jul 2023 00:31 IST

చపాతీ, రోటీ, నాన్‌...తినడం మనకు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్టలేసుకుంటూ తినేవారి సంఖ్యా పెరిగింది. నిజానికి ఒకప్పుడు జొన్నలకు పేదల ఆహారంగా పేరు. ఇప్పుడు మన వంటిళ్లలోనే కాదు... వీధుల్లోనూ జొన్న రొట్టెల తయారీ ఊపందుకుంది. అన్ని వర్గాలకూ చేరువైన ఈ చిరు ధాన్యంలో పోషకాలు పుష్కలం. రుచీ అమోఘం. అందుకే మధుమేహులు మొదలుకుని బరువు తగ్గాలనుకునే వారి వరకూ అంతా వీటినే తింటున్నారు. అయితే, దీన్ని తయారు చేయడం అంత సులువేం కాదు. కొన్ని కిటుకులు తెలుసుకోవాలి. అవేంటో, ఇందులో ఎలాంటి పోషక విలువలున్నాయో చూద్దామా!

పోషకాలివి...

* జొన్నల్లో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌కు తోడు ఫైబర్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, క్రూడ్‌ ఫ్యాట్‌, అమైనో యాసిడ్లు సమృద్ధిగా లభిస్తాయి.

* గ్లూటెన్‌ రహిత ఆహారం కావడంతో బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఎంపిక. ఈ జొన్న రొట్టెల్లోని కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ శరీరంలో గ్లూకోజ్‌ని నెమ్మదిగా విడుదల చేయడం వల్ల జొన్న రొట్టెను మధుమేహులూ తినొచ్చు. ప్రొటీన్‌ అవసరం ఎక్కువున్న శాకాహారులు దీన్ని రోజూ తీసుకోవచ్చు.

* జొన్న పిండిలోని ఫైబర్‌ అరుగదలను పెంచడమే కాదు...శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.

* జొన్న రొట్టెలు నూనె లేకుండా మంట మీద కాల్చడం వలన ఇందులోని ఇనుము తగినంతగా శరీరానికి అందుతుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అలానే, ఇందులోని పొటాషియం, మెగ్నీషియం... రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మెనోపాజ్‌ దశలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.

చిట్కాలున్నాయ్‌...

చపాతీ, రోటీ చేసిన కొద్ది గంటల్లోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోతాయి. కానీ, జొన్న రొట్టె అలాకాదు. ముఖ్యంగా కడక్‌ రోటీ వారాలూ, నెలల తరబడీ భద్రపరుచుకోవచ్చు. మరో రకం మెత్తటి రోటీని వేడివేడిగా ఉన్నప్పుడు తినడమే మేలు.

జొన్న పిండిని కలపడానికి వేణ్నీళ్లను ఉపయోగించండి. నీళ్లు మరిగేటప్పుడే కాస్త నూనె, రుచికి సరిపడా ఉప్పూ కలపండి. జొన్న పిండిని కలిపేటప్పుడే ఓ చెంచా గోధుమ పిండినీ చేర్చితే.. రొట్టెకు పగుళ్లు రావు. దీన్ని తడిపిన వెంటనే చేసేయొద్దు. ఓ పది నిమిషాలైనా తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెడితే సరి. అలానే వీటిని చపాతీ కర్రతో ఒత్తకూడదు. చేత్తో అద్దుతూ చేస్తేనే చక్కగా వస్తాయి. రొట్టెలు మృదువుగా, విడిపోకుండానూ ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని