చింతాకు రుచులు చేద్దామా!

మాంసం, చేపలు, రొయ్యలు... ఇలా ఏవైనా సరే చింత చిగురు రుచి ముందు దిగదుడుపే. అందుకే ఏ కూరతో అయినా సరే ఇది జట్టు కట్టేస్తుంది. చిరు పులుపుతో నోరూరిస్తుంది. మరి మీరేం వండాలని ఆలోచిస్తున్నారా?  మీకోసమే ఇవి.

Updated : 09 Jul 2023 00:43 IST

మాంసం, చేపలు, రొయ్యలు... ఇలా ఏవైనా సరే చింత చిగురు రుచి ముందు దిగదుడుపే. అందుకే ఏ కూరతో అయినా సరే ఇది జట్టు కట్టేస్తుంది. చిరు పులుపుతో నోరూరిస్తుంది. మరి మీరేం వండాలని ఆలోచిస్తున్నారా?  మీకోసమే ఇవి.


పులిహోర

కావలసినవి: చింతచిగురు - కప్పు, పొడి అన్నం - రెండు కప్పులు, వేరుసెనగ పప్పు - మూడు పెద్ద చెంచాలు, సెనగపప్పు - రెండు పెద్ద చెంచాలు, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు - పెద్ద చెంచా, పసుపు - కొద్దిగా, కరివేపాకు -  నాలుగు రెబ్బలు, ఎండు మిర్చి - మూడు, నూనె- తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, ఇంగువ - చిటికెడు.

తయారీ: అన్నం (ఉడుకుతున్నప్పుడే ఒక చెంచా నూనె, చిటికెడు ఉప్పు కలిపి) పొడిగా వండి చల్లార్చాలి. అర టీ స్పూను నూనెలో చింత చిగురును పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేయించి పక్కనుంచాలి. అదే కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, వేరుసెనగ గింజలు, సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు పసుపు, ఇంగువ ఒక్కొక్కటిగా వేగనిచ్చి తాలింపుని చిగురుతో పాటు అన్నంలో కలిపితే సరి.


కొబ్బరి పచ్చడి

కావలసినవి:  చింతచిగురు- కప్పు, తాజా కొబ్బరి ముక్కలు- కప్పు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- అయిదు, ఎండుమిర్చి- ఏడు, ఆవాలు- అరచెంచా, మినప్పప్పు- చెంచా, మెంతులు- కొద్దిగా, ఇంగువ- చిటికెడు, నూనె- మూడు చెంచాలు. తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, మినపప్పు- చెంచా చొప్పున, కరివేపాకు-రెండు రెమ్మలు, ఎండుమిర్చి- ఒకటి.

తయారీ: బాణలిలో నూనె పోసి కాగాక చింత చిగురు, కొబ్బరి ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తప్ప మిగిలినవన్నీ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి ఓసారి తిప్పాలి. ఈ మిశ్రమానికి మిగిలిన పదార్థాలు కూడా చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి చివరగా తాలింపు వేస్తే పచ్చడి తయారవుతుంది. అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది.


చిన్న చేపలతో చింతాకు కూర

కావలసినవి: చిన్న చేపలు- అరకిలో, చింత చిగురు- పావు కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, ధనియాలపొడి- చెంచా, పసుపు- కొద్దిగా, కారం- మూడు చెంచాలు, టొమాటో- చిన్నది, ఉల్లిపాయలు- మూడు, పచ్చిమిర్చి- నాలుగు, కరివేపాకు- రెండు రెబ్బలు

తయారీ: ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చింతాకుని చేత్తో పొడిలా నలిపి అందులోకి వేసుకోవాలి. ఆపై సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు అన్నీ సగం చొప్పున అందులో వేసి కలిపి మూత పెట్టి ఓ గంట పక్కనుంచాలి. ఈలోగా పొయ్యి వెలిగించి బాణలీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. అవి రంగు మారాక మిగిలిన ఉప్పు, పసుపు, కారం, ధనియాలపొడి వేసి మూతపెట్టేయాలి. కాస్త నూనె పైకి తేలాక కలిపి పెట్టుకున్న చేపల్ని కూడా వేసి గరిటె పెట్టకుండా గిన్నె పైకి ఎత్తి కదపాలి. ఇలా చిన్న మంటమీద కాసేపు మగ్గనిచ్చాక నీళ్లు పోసుకోవాలి. అవన్నీ ఆవిరై కూర దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సరి.


మటన్‌

కావలసినవి: చింత చిగురు- కప్పు, మటన్‌- అర కేజీ, ఉల్లిపాయలు- నాలుగు, పచ్చిమిర్చి- ఐదు, ఉప్పు, కారం -రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- పెద్ద చెంచా, పసుపు- చిటికెడు, ధనియాల పొడి, గరం మసాలా- రెండు పెద్ద చెంచాల చొప్పున, నూనె- కొద్దిగా, జీలకర్ర- చెంచా, బిర్యానీ ఆకులు- మూడు.

తయారీ: మటన్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత చిగురును శుభ్రం చేసుకుని చేతులతో నలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు, ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసి పెట్టుకోవాలి. కుక్కర్‌లో కొద్దిగా నూనె పోసి కాగాక... జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారే వరకూ మగ్గనివ్వాలి. ఆపై వెల్లుల్లి పేస్టుని చేర్చి పచ్చివాసన పోయే వరకూ ఉంచి, తర్వాత మటన్‌ వేసి మూత పెట్టాలి. ఇది మగ్గాక ఉప్పు, కారం, పసుపుతో పాటు రెండు నిమిషాలాగి ధనియాలపొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు కూడా చల్లి మూత పెట్టాలి. ఇందులో నీళ్లు పోయి నూనె పైకి తేలే వరకూ మంట మధ్యస్థంగా ఉంచి అడుగంటకుండా తిప్పాలి. అప్పుడు కొన్ని నీళ్లు పోసి మూతకు విజిల్‌ పెట్టి ఆరు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక ముక్క ఉడికిందో లేదో చూసి చింత చిగురు కలిపి మరో ఆరేడు నిమిషాలు సిమ్‌లో ఉంచి ఉడకనివ్వాలి. ఈ కూరను వేడి వేడి అన్నంలోకి తింటే భలే రుచిగా ఉంటుంది.


చికెన్‌ ఫ్రై

కావలసినవి:  బోన్‌లెస్‌ చికెన్‌- అరకేజీ, చింతచిగురు- ఒకటింపావు కప్పు, కొబ్బరి తురుము- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి- మూడు, పసుపు- పావుచెంచా, కారం- రెండు చెంచాలు, ధనియాలపొడి- చెంచా, గరంమసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, నూనె- అరకప్పు, దాల్చినచెక్క- రెండు ముక్కలు, లవంగాలు- మూడు.

తయారీ:  చింత చిగురును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది కాగాక దాల్చినచెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్‌ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. అయిదు నిమిషాలయ్యాక పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరి తురుము, గరంమసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక చింతచిగురు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌని సిమ్‌లో పెట్టి... మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి కూర పొడిపొడిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని