ఇవి తిన్నాక పెరుగు వద్దు...

కూర, చారు, పచ్చడి.. ఏవి ఎంత రుచికరమైనవి తిన్నా.. ఆఖర్లో పెరుగన్నం తినందే భోజనం పూర్తయినట్లుండదు కదూ! దాదాపు మన తెలుగు వాళ్లందరి మనస్థితీ అదే

Updated : 20 Aug 2023 15:23 IST


కూర, చారు, పచ్చడి.. ఏవి ఎంత రుచికరమైనవి తిన్నా.. ఆఖర్లో పెరుగన్నం తినందే భోజనం పూర్తయినట్లుండదు కదూ! దాదాపు మన తెలుగు వాళ్లందరి మనస్థితీ అదే. అన్నమే కాదు.. చపాతీలు, నాన్‌ లాంటివి తిన్నా.. ఆఖర్లో కాస్త పెరుగు తింటేనే తృప్తి. పెరుగులో సి విటమిన్‌, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉన్నందున ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని పదార్థాలతో పాటు పెరుగు తినకూడదని ఇటీవల జరిగిన ఆహార పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవేమిటంటే...

  •  వేడి పదార్థాలు తిన్న వెంటనే పెరుగు తినకూడదు. అలాగే వేడిగా ఉన్న అన్నంలో పెరుగు కలిపి తినకూడదు.
  •  పరాఠాను పెరుగుతో కలిపి తింటే రుచికి బాగుండొచ్చు.. కానీ ఆరోగ్యకరం కాదు. ఎసిడిటీ, కడుపుబ్బరం, పేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  •  బెల్లంలో వేడి చేసే గుణం ఉండగా, పెరుగు చలవ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తింటే జలుబు, దగ్గు, జ్వరాలకు దారితీయొచ్చు.
  •  కొన్ని వంటకాల్లో పాలు, పెరుగు కలిపి వేస్తుంటాం. నిజానికి ఇది హానికరం. అలా తింటే పొట్టలో వికారం, ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలు వస్తాయి.

  •  కాఫీ, టీ లాంటి వేడి పానీయాలు తాగిన వెంటనే పెరుగు తింటే లేదా పెరుగు కలిపిన కర్డ్‌ శాండ్‌విచెస్‌, దహి కబాబ్‌ లాంటివి తింటే జీవక్రియ (మెటబాలిజం) దెబ్బతింటుంది.
  • పాలతోనే కాదు.. పెరుగుతో కూడా మ్యాంగోషేక్‌ చేస్తారు. పెరుగన్నంలో మామిడిపండు గుజ్జు కలిపి తింటారు. కానీ మామిడిపండును పెరుగుతో కలిపి తినడం వల్ల పులియబెట్టినట్టు అవుతుంది. ఇది తర్వాతి కాలంలో అరగకపోవడం, ఎసిడిటీ లాంటి అనారోగ్యాలకు కారణమవుతుంది.
  • పెరుగులో ఉల్లిపాయ అనేది చాలామందికి ఇష్టం. కానీ ఈ కాంబినేషన్‌తో దురద, మంట, దద్దుర్లు లాంటి చర్మసమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది.
  •  చేప తిన్నాక పెరుగు తింటే ఆహారం త్వరగా జీర్ణం కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని