చిత్రమైన ఆకు.. చిట్టింట పొట్టు

చిట్టింట పొట్టు ఆకు.. మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం. ఈ పేరెక్కడా వినలేదే అనేవాళ్లూ ఉన్నారు. కానీ.. ఒకసారి రుచి చూశారంటే ఇక వదల్లేనంత బాగుంటుంది.

Updated : 03 Sep 2023 05:03 IST

చిట్టింట పొట్టు ఆకు.. మా ఇంట్లో అందరికీ మహా ఇష్టం. ఈ పేరెక్కడా వినలేదే అనేవాళ్లూ ఉన్నారు. కానీ.. ఒకసారి రుచి చూశారంటే ఇక వదల్లేనంత బాగుంటుంది. పాలకూర, తోటకూరలకు భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఈ వంటకం ఎలా చేయాలంటే.. పావుకిలో కందిపప్పును కడిగి.. మరీ మెత్తబడకుండా కాస్త పలుకుగా ఉండేలా ఉడికించి నీళ్లు వార్చాలి. అరకిలో చిట్టింట పొట్టు ఆకును పుల్లలు లేకుండా తీసేసి కడిగి, నలిపి ఉంచుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి, చెంచా చొప్పున పచ్చి శనగపప్పు, మినప్పప్పు, అరచెంచా ఆవాలు, నాలుగు ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. అందులో వార్చిన కందిపప్పు, చిట్టింట పొట్టు ఆకు వేసి కలియతిప్పి, మూత పెట్టి సన్న సెగ మీద ఉడికించాలి. మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దించేస్తే సరి.. ఘుమఘుమలాడే చిట్టింట పొట్టు ఆకు కూర సిద్ధమైపోతుంది. ఇది అరుదైన ఆకు. అన్ని చోట్లా, అన్నిసార్లూ దొరకదు కనుక ఎండబెట్టి అమ్ముతారు. తెచ్చి భద్రం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు వండుకోవచ్చు. ఇది విభిన్న రుచితో ఆకట్టుకోవడమే కాదు.. శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులు రావు. ఈ ఆకుతో ఇగురు కూడా చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని