అదిరే రుచితో.. జొన్న పెసర పొంగల్‌!

సాధారణంగా పొంగల్‌ అంటే బియ్యం, పెసరపప్పులతో చేస్తారు. నేను అందుకు భిన్నంగా జొన్న, పెసర పొంగల్‌ చేస్తాను. ఇదెంత బాగుంటుందో చెప్పడానికి మాటలు చాలవు.

Updated : 15 Oct 2023 02:53 IST

సాధారణంగా పొంగల్‌ అంటే బియ్యం, పెసరపప్పులతో చేస్తారు. నేను అందుకు భిన్నంగా జొన్న, పెసర పొంగల్‌ చేస్తాను. ఇదెంత బాగుంటుందో చెప్పడానికి మాటలు చాలవు. తిని చూడాల్సిందే! ఎలా చేస్తానంటే.. ఒక గ్లాసు జొన్న రవ్వను ముందురోజు రాత్రి నానబెట్టాలి. ఉదయం లేచాక 3 గ్లాసుల పెసలు రెండు గంటలు నానబెట్టాలి. కుక్కర్‌లో ఆరు చెంచాల నెయ్యి వేసి నాలుగు పచ్చిమిర్చి, 12 లవంగాలు, నాలుగంగుళాల దాల్చినచెక్క, చెంచా మిరియాల పొడి, మూడు చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద, బిర్యానీ ఆకు వేయాలి. అర నిమిషం తర్వాత- మంచి పరిమళం వస్తున్నప్పుడు.. పచ్చి బఠాణీలు, స్వీట్‌ కార్న్‌, క్యారెట్‌ ముక్కలు వేసి వేయించి.. పెసలు వేయాలి. అవి కాస్త వేగాక.. 10 గ్లాసుల నీళ్లు పోయాలి. రవ్వకు ఒకటికి నాలుగు, పెసలకు ఒకటికి రెండు చొప్పున అన్నమాట. నీళ్లు తెర్లుతున్నప్పుడు వడకట్టిన జొన్నరవ్వను మెల్లగా వేస్తూ కలియ తిప్పాలి. లేకుంటే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్‌ రాగానే దించేయాలి. అంతే ఘుమఘుమలాడే పొంగల్‌ రెడీ! ఇందులో కాస్త నెయ్యి వేసుకుని.. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. పెసలు అంత ఆకర్షణీయంగా ఉండవని.. కొందరికి నచ్చకపోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కావాలంటే పెసలు.. లేదంటే పెసరపప్పుతోనూ చేయొచ్చు. ఇదైతే గంటసేపు నానబెడితే సరిపోతుంది. నచ్చితే మీరూ ప్రయత్నించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని