అమ్మ మెచ్చేప్రసాదం

ఇవి దేవీ నవరాత్రులు. తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలతో దర్శనమిచ్చే అమ్మను చూసి తరిస్తాం. కోరిన కోర్కెలు తీర్చే ఆ కరుణామయికి పాయసం, పులిహోర లాంటి రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తాం

Published : 22 Oct 2023 00:41 IST

ఇవి దేవీ నవరాత్రులు. తొమ్మిది రోజులు.. తొమ్మిది అలంకారాలతో దర్శనమిచ్చే అమ్మను చూసి తరిస్తాం. కోరిన కోర్కెలు తీర్చే ఆ కరుణామయికి పాయసం, పులిహోర లాంటి రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తాం. వాటితో పాటు.. శాకాన్నం, లౌకీ హల్వా లాంటి అమ్మవారికి ఇష్టమైన ప్రత్యేక ప్రసాదాలను నివేదించండి!


శాఖాన్నం 

కావలసినవి: బియ్యం - అర కిలో, కూరగాయలు - చిక్కుడు, దోస, సొర, బీర, వంకాయ, బెండకాయ, టొమాటో, బంగాళదుంప, చిలగడదుంప.. ఇలా 9 రకాలు - కప్పు ముక్కలు చొప్పున (వీటిల్లో ఏవైనా అందుబాటులో లేకుంటే వేరే కూరగాయలు లేదా శనగలు, పెసలు, అలసందలు లాంటివైనా వేయొచ్చు), నెయ్యి - ఆరు చెంచాలు, అల్లం ముద్ద - చెంచా, పసుపు, ఉప్పు - తగినంత, లవంగాలు, యాలకులు - 3 చొప్పున, జాజికాయ పొడి - చిటికెడు, జీలకర్ర - చెంచా, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, జీడిపప్పు - అర కప్పు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: ముందుగా బియ్యం కడిగి, అరగంట నానబెట్టుకోవాలి. కూరగాయలన్నీ అంగుళమంత ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు, అల్లం ముద్ద, పసుపు, జాజికాయ పొడి, ఉప్పు, తరిగిన కూరగాయ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక.. నానబెట్టిన బియ్యం, ఆరు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టాలి. రెండు విజిల్స్‌ వచ్చాక దించి, కొత్తిమీర తరుగు వేస్తే సరిపోతుంది. ఈ శాకాన్నం అమ్మవారికి ఇష్టమైన ఫలహారం.

 


యాపిల్‌ రబ్డీ

కావలసినవి: పాలు - లీటర్‌, యాపిల్స్‌ - రెండు, పంచదార - కప్పు, జీడిపప్పు, బాదం, కిస్మిస్‌లు - అర కప్పు చొప్పున, కుంకుమ పువ్వు - చిటికెడు, యాలకులు - రెండు
తయారీ: అడుగుభాగం మందంగా ఉన్న గిన్నెలో పాలు పోసి.. అవి సగం అయ్యేవరకు మరిగించాలి. అందులో చెక్కు తీసి గ్రైండ్‌ చేసిన యాపిల్‌ గుజ్జు, పంచదార వేసి ఉడికించాలి. దగ్గరపడిందనుకున్నాక.. జీడిపప్పు, కిస్మిస్‌, బాదం పలుకులు, కుంకుమ పువ్వు వేసి దించేస్తే సరి.. చక్కటి యాపిల్‌ రబ్డీ సిద్ధం.


ఆరు పప్పుల వడ

కావలసినవి: పచ్చి శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, అలసందలు - అర కప్పు చొప్పున, నువ్వులు - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ ముక్కలు కప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద - రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు - అర కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: అన్ని రకాల పప్పులనూ నాలుగు గంటలు నానబెట్టి, దోశపిండిలా మరీ మెత్తగా కాకుండా.. కాస్త బరకగా రుబ్బుకోవాలి. అందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. పిండిని చిన్న ఉండలుగా తీసుకుని.. చేతితో తట్టి వడలు చేసి కాగిన నూనెలో వేయిస్తే సరి.. ఘుమఘుమలాడే ఆరు పప్పుల వడలు తయారైపోతాయి.


లౌకీ హల్వా

కావలసినవి: పాలు - లీటరు, సొరకాయ గుజ్జు - రెండు కప్పులు, పంచదార - కప్పు, నెయ్యి - అర కప్పు, జీడిపప్పు, కిస్మిస్‌, బాదం పప్పులు - అర కప్పు చొప్పున
తయారీ: సొరకాయ చెక్కు తీసి తురిమి, నేతిలో వేయించాలి. అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో పాలు పోసి మరిగించాలి. అందులో వేయించిన సొరకాయ గుజ్జు వేసి ఉడికించాలి. దగ్గరగా అయ్యాక పంచదార, జీడిపప్పు, బాదం, కిస్మిస్‌లు వేయాలి. దించేముందు ఇంకాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది. సొరకాయతో చేసిన ఈ తియ్యని వంటకం అమ్మవారికెంతో ప్రియం.


మఖానా లడ్డు

కావలసినవి: మఖానా - 200 గ్రా, ఎండుకొబ్బరి తురుము - 2 కప్పులు, బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు - కప్పు, బెల్లం పొడి - కప్పు, నువ్వులు - రెండు చెంచాలు, గుమ్మడి గింజలు - అరకప్పు, యాలకుల పొడి - అర చెంచా
తయారీ: మఖానా, తురిమిన ఎండుకొబ్బరి, బాదం, జీడిపప్పు, పిస్తా, నువ్వులు గుమ్మడి గింజలను నేతిలో వేయించి.. అన్నిటినీ గ్రైండ్‌ చేయాలి. బెల్లం కరిగించి, అందులో గ్రైండ్‌ చేసిన మిశ్రమం, యాలకుల పొడి వేసి కలియ తిప్పాలి. సన్న సెగ మీద నాలుగు నిమిషాలుంచి దించేసి.. చల్లారాక చిన్న ఉండలు చేసి, లడ్డు చుట్టుకోవాలి. అంతే మఖానా లడ్డు సిద్ధం.- సి.శ్యామ, తెనాలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని