ఉసిరి పులిహోరతో రోగాలు దూరం

కార్తికమాసం ఉసిరికాయల సీజన్‌. ఇవి ఆరోగ్యానికి మంచిదని రోటి పచ్చడి, ఉసిరి ఊరగాయ, మురబ్బా, ఉసిరి సబ్జీ, జ్యూస్‌, ఆమ్లా రైతా, ఆమ్లా ఆచార్‌.. ఇలా ఎన్నో రూపాల్లో తింటాం.

Published : 19 Nov 2023 00:43 IST

కార్తికమాసం ఉసిరికాయల సీజన్‌. ఇవి ఆరోగ్యానికి మంచిదని రోటి పచ్చడి, ఉసిరి ఊరగాయ, మురబ్బా, ఉసిరి సబ్జీ, జ్యూస్‌, ఆమ్లా రైతా, ఆమ్లా ఆచార్‌.. ఇలా ఎన్నో రూపాల్లో తింటాం. నేను ఎప్పుడూ చేసే నిమ్మకాయ, దబ్బకాయ, చింతపండు పులిహోరలకు బదులు ఉసిరి అన్నం చేస్తుంటాను. ఇది ప్రత్యేకమైన రుచితో ఆహా అనిపిస్తుంది. కప్పు బియ్యానికి మూడు చెంచాల నూనె, మూడు చెంచాల పల్లీలు, నాలుగు ఉసిరికాయలు, తాలింపు దినుసులు, ఉప్పు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు అవసరమౌతాయి.

ఎలా చేయాలంటే.. అన్నం మరీ మెత్తగా కాకుండా కాస్త పొడిపొడిలాడేలా వండాలి. ఉసిరికాయలు గింజలు తీసేసి, మెత్తగా నూరాలి. ఈ పేస్టులో తగినంత ఉప్పు వేసి అన్నంలో కలపాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. ఆవాలు, పల్లీలు, శనగ పప్పు, మినప్పప్పులు వేయాలి. ఆవాలు చిటపటలాడు తున్నప్పుడు.. ఎండుమిరప కాయలు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి స్టవ్వు కట్టేసి, ఈ తాలింపును అన్నంలో కలపాలి. అంతేనండి.. ఘుమఘుమలాడే ఉసిరి పులిహోర తయారై పోతుంది. వింటేనే తినాలనిపిస్తోంది కదూ! ఎంతో సులువు కూడా. ఆమ్లాలో సి-విటమిన్‌ విస్తారంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలా వ్యాధులను తరిమేయొచ్చు. చర్మం కూడా నిగనిగలాడు తుంది. నచ్చితే మీరూ ఒకసారి చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని