నింగీ నేలా తోడుగా విందుభోజనం

మనింట్లో మనకు తోచినవి చేసుకోవడంలో విశేషం లేదు. అదే.. నచ్చిన వారితో కలిసెళ్లి.. చెట్టూచేమల మధ్య కబుర్లాడుతూ గారెలు, బూరెలు, భక్ష్యాలు, సకిలాలు, ఉలవచారు లాంటి బోలెడన్ని వంటకాలతో విందు భోజనం చేయడం ఎంత బాగుంటుంది?!

Published : 19 Nov 2023 00:44 IST

మనింట్లో మనకు తోచినవి చేసుకోవడంలో విశేషం లేదు. అదే.. నచ్చిన వారితో కలిసెళ్లి.. చెట్టూచేమల మధ్య కబుర్లాడుతూ గారెలు, బూరెలు, భక్ష్యాలు, సకిలాలు, ఉలవచారు లాంటి బోలెడన్ని వంటకాలతో విందు భోజనం చేయడం ఎంత బాగుంటుంది?! పైన ఆకాశం.. చుట్టూ పచ్చదనం.. సందడీ, సంతోషాల వనభోజనానికి ఈ ప్రత్యేక వంటలు జతచేశారనుకోండి.. మాటలుండవు.. తిని తరించడమే తరువాయి..


చిలకడదుంప, ఉసిరి ఫ్రైస్‌

కావలసినవి: చిలకడదుంపలు - మూడు, బియ్యప్పిండి - కప్పు, మొక్కజొన్న పిండి - అర కప్పు, కారం - చెంచా, ఉప్పు, నూనె - తగినంత, పుదీనా ఆకులు - చారెడు, ఉసిరి గుజ్జు, అల్లం, మిర్చి ముద్ద - ఒకటిన్నర చెంచా చొప్పున, మిరియాల పొడి - చెంచా

తయారీ: చిలకడదుంపలను కడిగి, పొడుగ్గా వేలెడంత ముక్కలు చొప్పున కోసుకోవాలి. పుదీనా ఆకులను మెత్తగా నూరాలి. ఒక పాత్రలో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పుదీనా పేస్టు, అల్లం మిర్చి ముద్ద, ఉసిరి గుజ్జు- అన్నీ వేసి.. కొన్ని నీళ్లతో పిండి కలపాలి. ఈ మిశ్రమంలో చిలకడదుంప ముక్కలను ముంచి కాగుతున్న నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. చల్లారాక వాటి మీద మిరియాల పొడి చల్లితే సరి.. నోరూరించే చిలకడ దుంప, ఉసిరి ఫ్రైస్‌ రెడీ.


హరియాలీ సాబూదానా కిచిడీ

కావలసినవి: సగ్గుబియ్యం - ఒకటిన్నర కప్పు, వేయించి దంచిన పల్లీలు - అర కప్పు, ఉప్పు - తగినంత, పంచదార - చెంచా, నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - అర చెంచా, కరివేపాకు - 2 రెబ్బలు, పచ్చి బఠాణీలు - అర కప్పు, బంగాళదుంపలు - 2, దానిమ్మ గింజలు - చారెడు, కొత్తిమీర తరుగు - కప్పు, పచ్చిమిర్చి - 3, అల్లం - అరంగుళం ముక్క, నిమ్మరసం - ఒక చెంచా

తయారీ: సగ్గుబియ్యం కడిగి, నాలుగు గంటలు నానబెట్టాలి. నీళ్లు తీసేసి.. పంచదార, ఉప్పు, కచ్చాపచ్చాగా దంచిన పల్లీలు వేసి కలిపి పక్కనుంచాలి. కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మ రసం, కొన్ని నీళ్లతో గ్రీన్‌ మసాలా నూరాలి. బంగాళదుంపలు ఉడికించి, పొట్టు తీసి, ముక్కలు కోసుకోవాలి. కడాయిలో నూనె కాగాక.. జీలకర్ర, పచ్చి బఠాణీలు వేయించాలి. అందులో బంగాళదుంప ముక్కలు, గ్రీన్‌ చెట్నీ వేయాలి. రెండు నిమిషాలయ్యాక.. సగ్గుబియ్యం మిశ్రమం వేసి మూత పెట్టి సన్న సెగ మీద ఉడికించాలి. అడుగంటకుండా మధ్యలో కలుపుతుండాలి. ఐదు నిమిషాల తర్వాత దించేసి.. కొత్తిమీర తరుగు, దానిమ్మ గింజలు చల్లాలి. అంతే.. ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తూ.. నోరూరించే హరియాలీ సాబూదానా కిచిడీ సిద్ధం!


సుర్తి లోఛో

కావలసినవి: శనగపప్పు - కప్పు, కందిపప్పు, అటుకులు - ముప్పావు కప్పు చొప్పున, పచ్చిమిరప కాయలు - 2, అల్లం ముద్ద - చెంచా, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు చెంచా, కారం, మిరియాల పొడి - అర చెంచా చొప్పున, నూనె, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు - చారెడు చొప్పున, నిమ్మరసం - చెంచా, సన్న కారప్పూస - కప్పు

తయారీ: శనగపప్పు, కందిపప్పులను కడిగి విడివిడిగా నానబెట్టాలి. ఐదు గంటల తర్వాత నీళ్లు తీసేయాలి. శనగపప్పును కొంచెం బరకగా గ్రైండ్‌ చేసి, ఒక పాత్రలోకి తీయాలి. అదే జార్‌లో కందిపప్పును మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అటుకులను కడిగి అందులో వేసి మరోసారి గ్రైండ్‌ చేసి.. శనగపిండిలో వేసి కలపాలి. అందులో అల్లం ముద్ద, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కారం, ఉప్పు, రెండు చెంచాల నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మరీ గట్టిగా ఉంటే రెండు మూడు చెంచాల నీళ్లు పోయొచ్చు. పొడిగా ఉన్న పాత్రలో కాస్త నూనె రాసి.. మిశ్రమాన్ని వేసి.. పైన కారం, మిరియాల పొడి చల్లాలి. ఈ పాత్రను కుక్కర్‌లో పెట్టి.. ఆవిరి మీద 20 నిమిషాలు ఉడికించాలి. అంతే.. దిబ్బరొట్టెలా చక్కగా ఉబ్బిన ‘సుర్తి లోఛో’ తయారైపోతుంది. పైన కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, సన్న కారప్పూస చల్లాలి. ఇది కొత్తిమీర లేదా పుదీనా పచ్చడితో తింటే మరింత సూపర్‌గా ఉంటుంది.


కాయీ హోలిగే

కావలసినవి: మైదా పిండి - మూడు కప్పులు, నువ్వుల నూనె - నాలుగు టేబుల్‌ స్పూన్లు, బెల్లం - రెండు కప్పులు, కొబ్బరి కోరు - 4 కప్పులు, యాలకుల పొడి - అర చెంచా, నెయ్యి - తగినంత

తయారీ: మైదా పిండిని కొన్ని నీళ్లతో కలపాలి. కాస్త నువ్వుల నూనె వేసి మెత్తగా అయ్యేదాకా మళ్లీ మళ్లీ కలపాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో అర కప్పు నీళ్లు, బెల్లం వేసి పాకం పట్టాలి. ఐదు నిమిషాల తర్వాత కొబ్బరి తరుము వేసి మధ్యలో కలియ తిప్పుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. నీళ్లు పోయాల్సిన పని లేదు. యాలకుల పొడి వేసి.. దగ్గర పడ్డాక దించాలి. అరిటాకు మీద నూనె రాసి.. మైదా పిండిని చిన్న ఉండగా తీసుకుని, చేత్తో చిన్న రొట్టెలా మెదపాలి. ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత ఉండ తీసుకుని మైదా రొట్టె మధ్యలో ఉంచి.. అంచులతో కప్పేయాలి. దీన్ని చపాతీ కర్రతో లేదా చేత్తో కొబ్బరి బయటకు రాకుండా జాగ్రత్తగా రొట్టెలా చేయాలి. అన్నీ అయ్యాక పెనం మీద నేతితో వేయించాలి. అంతే.. పసందైన కాయీ హోలిగేలు తయారైపోతాయి.


ఉంధియూ

కావలసినవి: నెయ్యి - 2 చెంచాలు, పచ్చి అరటి కాయ - 1, బీట్‌రూట్‌ ముక్కలు - పావు కప్పు, పచ్చి బఠాణీలు, చిక్కుడు - అర కప్పు చొప్పున, చిన్న బంగాళదుంపలు, వంకాయలు - 6 చొప్పున, వాము - టేబుల్‌ స్పూన్‌, ఇంగువ - పావు చెంచా, కొబ్బరి తురుము - కప్పు, కొత్తిమీర తరుగు - చారెడు, అల్లం - అంగుళం ముక్క, మిర్చి - 4, వేయించిన నువ్వులు - అర కప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, నిమ్మరసం, పంచదార - చెంచా చొప్పున, పసుపు - అర చెంచా, వేయించిన పల్లీలు - పావు కప్పు, తాలింపు దినుసులు

మెంతి రోల్స్‌ కోసం: మెంతికూర - అర కప్పు, శనగపిండి - కప్పున్నర, ఉప్పు, పసుపు, ఇంగువ - పావు చెంచా చొప్పున, కారం, పంచదార, నిమ్మరసం - చెంచా చొప్పున, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ముందుగా మెంతికూరను కడిగి సన్నగా తరగాలి. అందులో శనగపిండి, ఉప్పు, పసుపు, ఇంగువ, కారం, పంచదార, నిమ్మరసం వేసి.. కొన్ని నీళ్లతో గట్టిగా కలపాలి. ఆ మిశ్రమంతో రోల్స్‌ చేసి వేయిస్తే మెంతి రోల్స్‌ సిద్ధమౌతాయి.

ఉంధియూ చేసేందుకు: వంకాయలను కడిగి, పూర్తిగా తెగకుండా మధ్యలో చీలికలా కోసి ఉప్పు నీళ్లలో వేయాలి. బంగాళదుంపలు చెక్కు తీసి మధ్యలో గాటు పెట్టాలి. అరటికాయను పీల్‌ చేసి ముక్కలు కోసి నీళ్లలో వేయాలి. బీట్‌రూట్‌, చిక్కుడు ముక్కలు కోసుకోవాలి. దినుసులను మిక్సీలో వేసి.. కొద్ది నీళ్లతో గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నూనె కాగాక.. బీట్‌రూట్‌, అరటికాయ, చిక్కుడు, బఠాణీలను వేయించి తీయాలి. అందులోనే చీల్చిన వంకాయలను, బంగాళదుంపలను కాస్త వేయించి.. చల్లారాక కొంత మసాలాను వాటి మధ్యలో కూరి పక్కనుంచాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె కాగాక.. తాలింపు దినుసులు వేయాలి. ఆవాలు చిటపటలాడాక.. వేయించిన బీట్‌రూట్‌, స్టఫ్‌డ్‌ బంగాళదుంపలు, చిక్కుడు, బఠాణీలు, మెంతి రోల్స్‌, అరటికాయ ముక్కలు, మిగిలిన మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి.. కాసిని నీళ్లు చిలకరించాలి. దాని మీద మసాలా కూరిన వంకాయలు వేసి, మూత పెట్టాలి. రెండు విజిల్స్‌ వచ్చిన తర్వాత దించేసి.. కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేస్తే సరి.. ఘుమఘులాడే గుజరాతీ ఉంధియూ సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని