కందచారు..తింటే వదలరు!

మీరు చదివింది నిజమే.. కందిపప్పుతో కాదు, కందతో చారు. కంద అనగానే- కంద పులుసు, వేపుడు, కందాబచ్చలి గుర్తొస్తాయి. మా లంకగ్రామాల్లో కందతో చారు చేస్తారు. గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నిసార్లు కాయగూరలకు బాగా కొరత ఏర్పడుతుంది.

Published : 03 Dec 2023 00:09 IST

మీరు చదివింది నిజమే.. కందిపప్పుతో కాదు, కందతో చారు. కంద అనగానే- కంద పులుసు, వేపుడు, కందాబచ్చలి గుర్తొస్తాయి. మా లంకగ్రామాల్లో కందతో చారు చేస్తారు. గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నిసార్లు కాయగూరలకు బాగా కొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు వంటకు ఇబ్బంది కలగకుండా.. కంద, గుమ్మడి కాయలు నిలవ చేసుకోవడం పరిపాటి. కూరగాయలు అందుబాటులో లేకుంటే.. గబుక్కున కందతో చారు చేసేస్తారు. దానికి తోడు వడియాలు వేయించుకుని వేడివేడిగా అన్నం తింటే.. ఇక ఏ కొరతా గుర్తుకు రాదు. ఆ రుచికి ఆహా అనాల్సిందే మరి!
కందచారు ఎలా చేయాలంటే.. ముందుగా కంద చెక్కు తీసి ముక్కలు కోయాలి. బియ్యం కడిగిన నీళ్లలో కొంచెం పుల్లటి పెరుగు వేసి, అందులో కంద ముక్కలు వేసి అరగంట ఉంచాలి. తర్వాత మంచి నీళ్లతో కడగాలి. వీటిని కుక్కర్‌లో ఉడికించి, మూడు విజిల్స్‌ వచ్చాక దించాలి. ఉడికిన కంద ముక్కల్లో కాస్త పసుపు వేసి, పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. ఇది ముద్దపప్పులా ఉంటుంది. ఇందులో తగినన్ని నీళ్లు, చింతపండు రసం, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసి మరిగించి, చివర్లో కొత్తిమీర తరుగు వేసి.. దించి, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకులతో తాలింపు వేయాలి. అంతే ఘుమఘుమలాడే కందచారు తయారైపోతుంది. దానికి కొంచెం కందిపప్పు ఉడికించి జతచేయొచ్చు. అలాగే ఉల్లిపాయలు, టొమాటో, వంకాయ, మునక్కాడలు.. లాంటివి వేసి.. కందతో సాంబార్‌ చేసినా అద్భుతంగా ఉంటుంది. అనేక పోషకాలున్నందున.. బలం కూడా. ఇందులో ఎన్ని ఔషధ గుణాలున్నాయంటే.. కొన్ని రకాల క్యాన్సర్‌లను సైతం నివారిస్తుంది.

గోబేరు సుజాత, కాకినాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని