ఇదెంత రుచో..అంత ఆరోగ్యం!

మునగాకుతో మూడొందల లాభాలంటూ చాలాకాలం క్రితం ఓ వీడియో చూశాను. అప్పటి నుంచీ వీలైనప్పుడల్లా మునగాకుతో రసం పెడుతున్నాను. ముందు పప్పుచారంత కమ్మగా లేకున్నా.. కొన్ని దినుసులు జోడించి రుచిగా తయారు చేయడం నేర్చుకున్నాను.

Published : 31 Dec 2023 00:16 IST

మునగాకుతో మూడొందల లాభాలంటూ చాలాకాలం క్రితం ఓ వీడియో చూశాను. అప్పటి నుంచీ వీలైనప్పుడల్లా మునగాకుతో రసం పెడుతున్నాను. ముందు పప్పుచారంత కమ్మగా లేకున్నా.. కొన్ని దినుసులు జోడించి రుచిగా తయారు చేయడం నేర్చుకున్నాను. అలాగే ఒకరోజు మునగాకుతో పచ్చడి ప్రయత్నించా.. బాగా కుదిరింది. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిన్నారు. ఎలా చేయాలంటే.. రెండు కప్పుల మునగాకును కడిగి, నీళ్లు వడకట్టి, కాసేపు ఫ్యాన్‌ కింద ఆరబెట్టాలి. చారెడు పల్లీలు, పచ్చి శనగ పప్పు, ఆవాలు చెంచా చొప్పున, పావు చెంచా మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి మునగాకును వేయించి మరో పాత్రలోకి తీయాలి. అదే కడాయిలో ఇంకో చెంచా నూనె వేసి.. పన్నెండు పచ్చిమిర్చి, కప్పు టొమాటో ముక్కలు వేసి మూత పెట్టాలి. మగ్గిన తర్వాత అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం సన్నసెగ మీద ఉంచి దించేయాలి. చల్లారాక.. మునగాకు, తగినంత ఉప్పు జోడించి గ్రైండ్‌ చేయాలి. పల్లీలు, ఆవాల పొడిని కలపాలి. మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకులతో తాలింపు వేయాలి. అంతే.. ఘుమఘుమలాడే మునగాక పచ్చడి సిద్ధమైపోతుంది. వింటేనే నోరూరుతోంది కదూ! సందేహమే లేదు, అద్భుతంగా ఉంటుంది. మీరూ ఒకసారి చేసి చూడండి.

ఆండాళ్‌ సుషుమ్న మహేష్‌, బెంగళూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని