రంగుల్లో పొంగింది ‘పూరీ’

పూరీ అంటే ఎప్పుడూ ఒకేలా అదీ అంతగా ఆకట్టుకోని గోధుమరంగులో ఉంటే పిల్లలకు పెద్దగా తినాలనిపించదు. అందుకే దాన్ని రంగురంగుల్లో వెరైటీ రుచుల్లో చేస్తే నిమిషంలో హాంఫఠ్‌. మరి ఇంకెందుకు ఆలస్యం... చేసేద్దాం రండి!

Published : 26 Jun 2021 17:14 IST

పూరీ అంటే ఎప్పుడూ ఒకేలా అదీ అంతగా ఆకట్టుకోని గోధుమరంగులో ఉంటే పిల్లలకు పెద్దగా తినాలనిపించదు. అందుకే దాన్ని రంగురంగుల్లో వెరైటీ రుచుల్లో చేస్తే నిమిషంలో హాంఫఠ్‌. మరి ఇంకెందుకు ఆలస్యం... చేసేద్దాం రండి!


పాలక్‌పూరీ

కావలసినవి 
పాలకూర గుజ్జు: కప్పు, గోధుమపిండి: పావుకిలో, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, అల్లంవెల్లుల్లిముద్ద: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* గిన్నెలో నూనె తప్ప మిగిలిన అన్నీ వేసి గట్టిగా పూరీ పిండిలా కలపాలి. తరవాత వీటిని చిన్న ఉండల్లా చేసి పూరీల్లా వత్తి కాగిన నూనెలో మీడియం మంట మీద వేయించి తీయాలి.


బీట్‌రూట్‌ పూరీ

కావలసినవి 
గోధుమపిండి: పావుకిలో, బీట్‌రూట్‌: ఒకటి(మీడియంసైజుది), కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* బీట్‌రూట్‌ పొట్టు తీసి ముక్కలుగా కోసి ప్రెషర్‌కుక్కర్‌లో వేసి ఉడికించి దించాలి. చల్లారాక ఆ ముక్కల్ని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తని పేస్టులా చేయాలి. 
* ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, కారం, ఉప్పు, పసుపు, దనియాలపొడి, బీట్‌రూట్‌ ముద్ద అన్నీ వేసి బాగా కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు చిలకరించి ముద్దలా కలపాలి. ఇప్పుడు దీన్ని చిన్న ఉండల్లా చేసుకుని పూరీల్లా వత్తి కాగిన నూనెలో చక్కగా పొంగేలా వేయించి తీయాలి.


బఠాణీపూరీ

కావలసినవి 
గోధుమపిండి: పావుకిలో, తాజా బఠాణీలు: అరకప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద:అరటీస్పూను, పసుపు: పావుటీస్పూను, కారం: ముప్పావు టీస్పూను, దనియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
*  బఠాణీలు ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులోనే అన్నీ వేయాలి. టేబుల్‌స్పూను నూనె కూడా వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలిపి చిన్న ఉండల్లా చేసుకోవాలి. తరవాత పూరీల్లా వత్తి మీడియం మంట మీద వేయించి తీయాలి.


సెనగపప్పు పూరీ

కావలసినవి 
సెనగపప్పు: కప్పు, గోధుమపిండి: 2 కప్పులు, బొంబాయిరవ్వ: అరకప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చిముద్ద: టీస్పూను, కారం: అర టీస్పూను, పసుపు: అరటీస్పూను, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* సెనగపప్పులో వేడినీళ్లు పోసి గంటసేపు నాననివ్వాలి. తరవాత వాటిని వంపేసి పావుకప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. 
* ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసి, అందులోనే మిగిలినవన్నీ కూడా వేసి కలపాలి. ఇందులో నీళ్లు కలపకూడదు. టేబుల్‌స్పూను నూనె వేసి ముద్దలా కలిపి చిన్న ఉండల్లా చేసి, పూరీల్లా కర్రతో వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.


గుజరాతీ మసాలా పూరీ

కావలసినవి 
గోధుమపిండి: పావుకిలో, పసుపు: పావుటీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, కారం: అరటీస్పూను, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత 
తయారుచేసే విధానం 
* వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, పసుపు, ఇంగువ, కారం, ఉప్పు, టేబుల్‌స్పూను నూనె వేసి కలపాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి సుమారు ఓ పావుగంటసేపు పక్కన ఉంచాలి. 
* ఇప్పుడు పిండిని చిన్న ఉండల్లా చేసి పూరీల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి. వీటిని పెరుగుతో నంజుకుని తిన్నా బాగుంటాయి.


మరిన్ని వంటల కోసం క్లిక్ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని