దశాబ్దాలుగా పానీపూరీ

కాచిగూడ నింబోలి అడ్డాలోని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద సాయంత్రం నాలుగైందంటే చాలు... మెల్లిగా సందడి మొదలవుతుంది. నాలుగున్నర కల్లా జనం గుంపులుగా చేరతారు... ఎందుకంటారా...

Updated : 05 Dec 2021 06:35 IST

కాచిగూడ నింబోలి అడ్డాలోని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద సాయంత్రం నాలుగైందంటే చాలు... మెల్లిగా సందడి మొదలవుతుంది. నాలుగున్నర కల్లా జనం గుంపులుగా చేరతారు... ఎందుకంటారా... పానీపూరీ తినడానికి...

వునా... అంత డిమాండా అంటే... వినమ్రంగా నవ్వుతారు వాటి తయారీదారులు అరవై ఏళ్ల భగవతి. ఆవిడ ఓపికగా గప్‌చుప్‌ సామానంతా దుకాణంలో భర్త, కొడుకు సాయంతో సర్దుకుంటారు. వచ్చిన జనాలకు రెండు గంటలు ఏకధాటిగా పానీపూరీ అందిస్తూనే ఉంటారు. 1995 నుంచి ఇక్కడ వీటిని విక్రయిస్తున్నారు. వీరు తయారుచేసే పానీ పూరీ, రగడా పూరీ కోసం నగరం నలుమూలల నుంచి భోజనప్రియులు వస్తుండటం విశేషం.

అలా మొదలైంది...
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఠాకూర్‌ ప్రసాద్‌ మహారాజ్‌ కొన్నేళ్ల కిందట నగరానికి వలస వచ్చాడు. కాచిగూడ నింబోలి అడ్డాలోని మహంకాళి ఆలయం వద్ద 1955లో పానీ పూరీ, రగడా పూరీని విక్రయించడం ప్రారంభించాడు. ఇతర వాటికి భిన్నంగా వీటిల్లో కలిపే మసాలా దినుసులు ప్రత్యేకంగా ఉండటంతో వీటి రుచి స్థానికులను ఎంతో నచ్చింది. వీటి గురించి విస్తృత ప్రచారం జరగడంతో నగరం నలుమూలల నుంచి జనం రావడం ప్రారంభించారు. ఠాకూర్‌ తను పెంపుడు కూతురు భగవతితో కలిసి వీటిని విక్రయించేవాడు. ఆమె వివాహమయ్యాక తను, ఆమె భర్త వీరస్వామిగౌడ్‌ కూడా ఠాకూర్‌కి వ్యాపారంలో చేదోడుగా ఉండేవారు. 1991లో ఠాకూర్‌ మరణించారు.

కొనసాగుతున్న...పరంపర
భగవతి, వీరాస్వామి గౌడ్‌ దంపతులకు ఇద్దరు కొడుకులు. మొదట నింబోలి అడ్డాలో ఉండే వీరు తమ నివాసాన్ని సరూర్‌నగర్‌కు మార్చారు. భగవతి, వీరస్వామిగౌడ్‌, కొడుకు రాజేశ్వర్‌ రోజూ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి పానీ పూరీ, రగడా పూరీ తయారీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నానికల్లా వీటిని సిద్ధం చేసుకుని విక్రయానికి ఆటోలో కాచిగూడ నింబోలి అడ్డాలోని మహంకాళి ఆలయం వద్దనున్న దుకాణానికి తీసుకొస్తారు. అప్పటికే అక్కడ వీటిని తినడానికి జనం గుంపులుగా సిద్ధంగా ఉంటారు.  రెండు గంటల వ్యవధిలో అమ్మకం పూర్తవుతుంది. రాత్రి 7 గంటల కల్లా దుకాణాన్ని మూసివేస్తారు. డిమాండ్‌కు అనుగుణంగా వీటిని ఇంకా ఎక్కువ తయారు చేయొచ్చుగా అంటే వయసు పైబడుతున్నందు వల్ల తాము ఇంతకు మించి చేయలేమని చెబుతారు భగవతి. ‘చిన్నతనంలో మా నాన్న చేయిపట్టుకుని తీసుకొచ్చి ఇక్కడే పానీ పూరీని తినిపించేవాడు. ప్రస్తుతం కవాడిగూడలో ఉంటున్నా. గత 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా వీటిని తినడానికి వస్తున్నా.’ అంటూ యాభై ఏళ్ల వ్యాపారి భరత్‌ చెప్పడం కొసమెరుపు.

- వినోద్‌, అంబర్‌పేట, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని