ఆరోగ్యానికి.. కిచిడీ మంత్రం!

కాసిని బియ్యం... గుప్పెడు పెసరపప్పు కలిస్తే.. బోలెడు పోషకాలు. సంపూర్ణ ఆహారం దానిపేరే కిచిడీ!  సింగిల్‌పార్ట్‌ వంటకంగా చెప్పుకొనే కిచిడీ తేలిగ్గా జీర్ణమవుతూ వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

Updated : 18 Dec 2022 02:39 IST

కాసిని బియ్యం... గుప్పెడు పెసరపప్పు కలిస్తే.. బోలెడు పోషకాలు. సంపూర్ణ ఆహారం దానిపేరే కిచిడీ!  సింగిల్‌పార్ట్‌ వంటకంగా చెప్పుకొనే కిచిడీ తేలిగ్గా జీర్ణమవుతూ వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోనూ బోలెడు రుచులు ఉంటాయి.

* కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు, విటమిన్‌ సి, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలని అందించే సంపూర్ణ ఆహారం కిచిడీ.

* అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్నం, నెయ్యి, పెసరపప్పు వేసి చేసే సింపుల్‌ కిచిడీ తేలిగ్గా జీర్ణమయి శక్తినిస్తుంది.

* ఆయుర్వేదం ప్రకారం కిచిడీకి త్రిదోషాలని నివారించే శక్తి ఉంది. శరీరంలోని వ్యర్థాలని బయటకు నెట్టేస్తుంది.


మసాలా కిచిడీ

కావాల్సినవి: నెయ్యి- చెంచా, బిర్యానీ ఆకు-1, యాలకులు- రెండు, దాల్చినచెక్క- చిన్నముక్క, లవంగాలు- మూడు, జీలకర్ర- చెంచా, ఇంగువ- చిటికెడు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, బఠానీలు- రెండు చెంచాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు, టొమాటో- ఒకటి, క్యారెట్‌ ముక్కలు- రెండు చెంచాలు, క్యాప్సికమ్‌ ముక్కలు- రెండు చెంచాలు, పసుపు- పావుచెంచా, కారం- అరచెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, గరంమసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, బియ్యం- అరకప్పు, పెసరపప్పు- అరకప్పు, నీళ్లు- మూడుంపావు కప్పులు

తయారీ: స్టౌ వెలిగించి కుక్కర్‌ పెట్టి వేడెక్కాక చెంచా నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. అవన్నీ వేగి మంచి పరిమళం వచ్చాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు బఠాణీలు, క్యారట్‌, క్యాప్సికమ్‌ ముక్కలు, పసుపు, కారం, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత బియ్యం, పెసరపప్పు వేసి తక్కువ మంట మీద ఉంచాలి. తర్వాత మూడున్నర కప్పులు నీళ్లు, కొత్తిమీర వేసుకోని కుక్కర్‌ మూత పెట్టేయాలి. ఐదు విజిల్స్‌ వచ్చాక దించితే మసాలా కిచిడీ సిద్ధం.


చికెన్‌ కిచిడీ

కావాల్సినవి: బోన్‌లెస్‌ చికెన్‌-300 గ్రా, బియ్యం- ముప్పావుకప్పు, పెసరపప్పు- ముప్పావుకప్పు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగు, అల్లం, వెల్లుల్లిపేస్ట్‌- చెంచా, కారం- చెంచా, పసుపు- పావుచెంచా, గరంమసాలా- అరచెంచా, పుదీనా ఆకులు- గుప్పెడు, కొత్తిమీర తరుగు- మూడు చెంచాలు, నూనె- నాలుగు చెంచాలు, దాల్చిన(చెక్క- చిన్నముక్క, బిర్యానీలో వేసే స్టార్‌అనైజ్‌- 1, బిర్యానీ ఆకు- 1, జీలకర్ర- అరచెంచా, నీళ్లు- రెండున్నర కప్పులు

తయారీ: స్టౌ వెలిగించి కుక్కర్‌ పెట్టుకుని నూనె పోసి వేడెక్కాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు మసాలాదినుసులు వేసుకోవాలి. అవి వేగి మంచి వాసన వస్తున్నప్పుడు... ఉల్లిపాయముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి చికెన్‌ కూడా వేసి రంగుమారేంతవరకూ రెండు, మూడు నిమిషాలపాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, గరంమసాలా మరో రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలి. అవన్నీ మెత్తబడ్డాక అందులో బియ్యం, పెసరపప్పు వేసి బాగా కలిపి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూడు విజిల్స్‌ రానిచ్చి దించుకుంటే రుచికరమైన చికెన్‌ కిచిడీ రెడీ. పైన కాసింత నెయ్యి, కొద్దిగా నిమ్మరసంపిండుకుని తింటే చాలా బాగుంటుంది.


పాకిస్తానీ కిచిడీ

కావాల్సినవి: బాస్మతి బియ్యం- అరకప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు కలిపి- అరకప్పు, నెయ్యి లేదా వెన్న- రెండు చెంచాలు, దాల్చినచెక్క- చిన్నముక్క, బిర్యానీ ఆకులు- రెండు, జీలకర్ర- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- చెంచాన్నర

తయారీ: అరగంటముందు బియ్యాన్నీ, పెసరపప్పు, కందిపప్పులని కడిగి ఓ అరగంటపాటు నాననివ్వాలి. స్టౌ వెలిగించి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, దాల్చినచెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసుకుని సన్నమంట మీద దోరగా వేయించుకోవాలి. కడిగి నానబెట్టిన బియ్యాన్ని, ఉప్పు వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. కొంతమంది మరీ మెత్తగా ఉడికించుకుంటారు. అలాకూడా బాగుంటుంది.


పంజాబీ కిచిడీ

కావాల్సినవి: బియ్యం- కప్పు, పెసరపప్పు- అరకప్పు, నీళ్లు- నాలుగు కప్పులు, ఆవునెయ్యి-రెండు చెంచాలు, జీలకర్ర- చెంచా, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు- అరచెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు

తయారీ: బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లుపోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. నెయ్యిలో జీలకర్ర, మిరియాలపొడితో తాలింపు వేసుకుని దానిని ఉడికించిన పెసరపప్పు అన్నంలో వేసి కలుపుకొంటే సరిపోతుంది. మరోరకంగా కూడా చేసుకోవచ్చు. పొయ్యిమీద కుక్కర్‌ పెట్టుకుని వేడెక్కాక అందులో నెయ్యి, జీలకర్ర, మిరియాలపొడి వేసుకుని చిటపటలాడుతున్నప్పుడు అందులో బియ్యం, పెసరపప్పు, నీళ్లను వెయ్యాలి. నాలుగు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడకనిచ్చి విజిల్‌ వచ్చాక దింపేయొచ్చు. పెరుగు పచ్చడి, అప్పడాలతో తింటే ఈ కిచిడీ బాగుంటుంది.


సోలా కిచిడీ

కావాల్సివి: బియ్యం- కప్పు, ఎర్రకందిపప్పు- నాలుగు చెంచాలు, పెసరపప్పు- చెంచా, మటన్‌ కీమా- పావుకిలో, క్యారట్- ఒకటి, బంగాళాదుంప- ఒకటి, బీన్స్‌- ఐదు, ఉల్లిపాయ- ఒకటి, వెన్న- రెండు చెంచాలు, దాల్చిన చెక్క- చిన్నముక్క, నెయ్యి- నాలుగు చెంచాలు, మిరియాలు, పసుపు- కొద్దిగా, ఉప్పు- తగినంత, పాలు- పావుకప్పు

తయారీ: అడుగు ముందంగా ఉండే కడాయిలో నూనె లేదా నెయ్యిలో ఉల్లిపాయ ముక్కలి ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో కీమా, దాల్చినచెక్క, కాయగూర ముక్కలు, కడిగి నానబెట్టిన బియ్యం, ఎర్రకంది పప్పు, పెసరపప్పు, పసుపు, మిరియాలు, ఉప్పు.. ఇవన్నీ మెత్తగా ఉడకడానికి అవసరం అయిన నీళ్లుపోసి మూతపెట్టేయాలి. కిచిడీ ఎప్పుడూ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. విజిల్స్‌ వచ్చి... కుక్కర్‌ మూత తీశాక అందులో వెన్న, పాలు (వెయ్యకపోయినా ఫర్వాలేదు) పోసి కాసేపు ఉడకనివ్వాలి. పైన కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు వేసి, వేడివేడిగా తింటే భలే ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు