పోషకాల బాక్సు.. సర్దండి!

పిల్లల స్కూళ్లు తెరిచారు. ఇక, రోజూ.. వారికి లంచ్‌ బాక్స్‌లో ఏం పెట్టాలా అనే ఆలోచనే తల్లులది. ఇంట్లో అమ్మ తినిపిస్తేనే సరిగా తినని చిన్నారులు... బడిలో ఇష్టంగా తినేలా చేయడమంటే మాటలేం కాదు.

Published : 25 Jun 2023 00:31 IST

పిల్లల స్కూళ్లు తెరిచారు. ఇక, రోజూ.. వారికి లంచ్‌ బాక్స్‌లో ఏం పెట్టాలా అనే ఆలోచనే తల్లులది. ఇంట్లో అమ్మ తినిపిస్తేనే సరిగా తినని చిన్నారులు... బడిలో ఇష్టంగా తినేలా చేయడమంటే మాటలేం కాదు. పోషకాలు అందేలా.. ఆ రుచుల్ని వారు మెచ్చేలా ఈ రెసిపీలు ప్రయత్నించి చూడండి...


లిటిల్‌ మిల్లెట్‌ డంప్లింగ్స్‌

కావలసినవి: సామలు: ముప్పావు కప్పు, పెసరపప్పు- పావు కప్పు, నీళ్లు- సరిపడా, బాదం పలుకులు- మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు పచ్చిమిర్చి- నాలుగు, నూనె- రెండు టీ స్పూన్లు,
తాలింపు కోసం : సెనగపప్పు, మినపప్పు- రెండు టీ స్పూన్ల చొప్పున, జీలకర్ర, ఆవాలు అరచెంచా చొప్పున, కరివేపాకు - రెబ్బ
తయారీ: సామలు, పెసరపప్పుల్ని విడివిడిగా పది నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు పారబోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలీని పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. తాలింపు గింజల్ని వేసి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు పెసరపప్పు, సామల్ని కూడా వేసి వేయించండి. రెండు నిమిషాలాగి బాదం పప్పు ఆపై ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా చేర్చి మరికొద్ది సేపు మగ్గనివ్వాలి. అదయ్యాక రెండు కప్పుల నీళ్లు పోసి మరో 7-8 నిమిషాలు ఉడికించాలి. ఆపై పొయ్యిని సిమ్‌లో కాసేపు ఉంచాక దింపేయాలి. ఈ మిశ్రమం వేడి తగ్గాక... కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని మనకు నచ్చిన ఆకృతుల్లో డంప్లింగ్‌లు చేసుకోవచ్చు. వీటిని ఇడ్లీ పాత్రలో...పెట్టి ఆవిరి మీద ఉడికిస్తే చాలు. రుచికి రుచీ...ఆరోగ్యం కూడా.


మునగాకు ఎగ్‌రోల్‌!

కావలసినవి: గుడ్లు- నాలుగు, మునగాకులు- కప్పు, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌ (మైదా)- టేబుల్‌ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, మిరియాల పొడి- అరటీ స్పూను, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరిగినవి), చీజ్‌- పావు కప్పు, నూనె-తగినంత
తయారీ: మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. దాంట్లో మునగాకులు వేసి ఒక నిమిషం మగ్గనిచ్చి ఉప్పు చల్లాలి. ఆకుల్లో తేమంతా ఆవిరైపోయే వరకూ ఉంచి.తర్వాత స్టౌ ఆపేయాలి. మరో గిన్నెలోకి  మైదా, పచ్చిమిర్చి, గుడ్లు, ఉప్పు, మిరియాలపొడి తీసుకుని బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టౌ ఆన్‌ చేసి పెనం వేడెక్కాక గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. పైన మగ్గించి పక్కన పెట్టుకున్న మునగాకుల్ని చల్లి...దాని మీద చీజ్‌ని తురిమి వేయాలి. పెనాన్ని అల్యూమినియం ఫాయిల్‌తో కప్పి...రోల్‌ బాగా కాలే వరకూ ఉంచాలి. ఇందుకోసం కనీసం పది నిమిషాల సమయమైనా పడుతుంది. తర్వాత దీన్ని తీసి రోల్‌ చేసుకుని కత్తిరించి లంచ్‌ బాక్స్‌లో పెడితే సరి. దీన్ని మామిడి పండు స్మూథీతో కలిపి తింటే భలేగా ఉంటుంది. పిల్లలూ ఇష్టపడతారు. మునగలోని క్యాల్షియం ఎముక బలానికి తోడ్పడితే, గుడ్డులోని విటమిన్‌ ఎ, సిలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.


చనా పులావ్‌చనా పులావ్‌

కావలసినవి: బాస్మతీ బియ్యం- కప్పు, తెల్ల సెనగలు- కప్పు, ఉల్లిపాయ- ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- చెంచా, పచ్చిమిర్చి - రెండు,  నిమ్మరసం- టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంతగా, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, దాల్చిన చెక్క- చిన్న ముక్క, జీలకర్ర- పావుచెంచా, లవంగాలు- రెండు, యాలకులు- రెండు, బిర్యానీ ఆకు- ఒకటి, అనాస పువ్వు- ఒకటి
తయారీ:  కొమ్ము సెనగల్ని రాత్రంతా నానబెట్టాలి. బాస్మతీ బియ్యాన్ని ఉడికించే పదినిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది.  ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి నిలువుగా కోసి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టి వేడి చేసి నెయ్యి వేసుకోవాలి. తర్వాత లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన ముక్క, జీలకర్ర కూడా చేర్చి వేగనివ్వాలి. అదయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రంగు మారే వరకూ వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకూ ఉంచాలి. ఇప్పుడు నీటిని వార్చి బియ్యం, సెనగలు, ఉప్పు వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి రెండు కప్పుల నీళ్లు పోయాలి. అందులో కాస్త నిమ్మరసం కూడా చేర్చాలి. దీన్ని సన్నటి మంట మీద ఉంచి ఉడికిస్తే...సరి. చివరగా కొత్తిమీర తరుగు చల్లితే చనా పులావ్‌ రెడీ. దీన్ని బాక్సులో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది హై ప్రొటీన్‌ ఆహారం కాబట్టి రోజంతా చురుగ్గానూ ఉంటారు.


మష్రూమ్‌ పాస్తా

కావలసినవి: మష్రూమ్స్‌, పాస్తా- ఒక్కో కప్పు చొప్పున. మైదా, వెన్న- టేబుల్‌ స్పూన్‌ చొప్పున, వెల్లుల్లి రెబ్బలు- రెండు, ఉల్లిపాయ ఒకటి, పాలు- కప్పు, చీజ్‌- పావు కప్పు, మిరియాల పొడి- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ: ముందుగా పాస్తాను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లోని వెన్న వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, మష్రూమ్‌ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పాలుపోసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం ఉడికి దగ్గరపడుతుండగా తరిగిన చీజ్‌, మిరియాల పొడి, ఉప్పు, ఉడకబెట్టిన పాస్తా కూడా వేసి మరోసారి కలపాలి. చివరగా కాస్త కొత్తిమీర చల్లుకుంటే.. వేడివేడి క్రీమీ మష్రూమ్‌ పాస్తా రెడీ. పాస్తా, పుట్టగొడుగుల్లో ప్రొటీన్‌తో పాటు ఫైబర్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులోని విటమిన్‌, ఫోలేట్‌... పిల్లల ఎదుగుదలకు కీలకంగా ఉపయోగపడతాయి.


పనీర్‌ టిక్కా

కావలసినవి: పనీర్‌ తురుము- కప్పు, బంగాళాదుంప ఒకటి (పెద్దది), ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, క్యారెట్‌ తురుము- టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తురుము- కొద్దిగా, కారం- టీస్పూన్‌, గరం మసాలా- అర టీస్పూన్‌, ఆమ్‌చూర్‌- అర టీస్పూన్‌, అల్లం- అంగుళం ముక్క, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- పావు టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌- అర కప్పు, మైదా- రెండు టేబుల్‌ స్పూన్లు, బ్రెడ్‌ క్రంబ్స్‌- అర కప్పు, నూనె- వేయించడానికి సరిపడా, వాము- కొద్దిగా.
తయారీ: గిన్నెలో పనీర్‌ తురుము, ఉడికించి మెదిపిన బంగాళాదుంప ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌, కొత్తిమీర తురుము, కారం, గరం మసాలా, ఆమ్‌చూర్‌ పొడి, అల్లం తురుము, ఉప్పు, టేబుల్‌ స్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌ వేసి బాగా కలిపి నీళ్లు పోయకుండా ముద్దలా చేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి, వేడి చేయాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, వాము, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. పనీర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో టిక్కాల్లా ఒత్తుకుని ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌ క్రంబ్స్‌లో దొర్లించాలి. వీటిని దోరగా కాల్చుకుంటే వేడివేడి పనీర్‌ టిక్కాలు సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని