చిత్రమైన కీమా ఇడ్లీ..

మనందరికీ ఇడ్లీ తెలుసు, కీమా తెలుసు. కానీ కీమాతో ఇడ్లీ మాత్రం తెలీదు. అసలిది వినడానికే విచిత్రంగా ఉందిగా! కానీ ఒక స్ట్రీట్‌ వెండర్‌ ఆ వంటకం చేసి ఆకట్టుకుంటున్నాడు.

Updated : 29 Oct 2023 05:39 IST

నందరికీ ఇడ్లీ తెలుసు, కీమా తెలుసు. కానీ కీమాతో ఇడ్లీ మాత్రం తెలీదు. అసలిది వినడానికే విచిత్రంగా ఉందిగా! కానీ ఒక స్ట్రీట్‌ వెండర్‌ ఆ వంటకం చేసి ఆకట్టుకుంటున్నాడు. దాన్ని వీడియో తీసి, పోస్ట్‌ చేస్తే.. అది కాస్తా వైరలైంది. వింత వింత కాంబినేషన్లతో వంటలు చేయడం ఇవాళ్టి ట్రెండ్‌. అందుకే చాలా మంది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మన దక్షిణాది వాళ్లకి ఇడ్లీ అంటే ఇష్టం. ఉత్తర ప్రాంతాల్లో కీమా ప్రియం. రెండు రుచులూ కలగలిపితే.. అందరికీ నచ్చుతుందనుకున్న ఓ ఔత్సాహికుడు వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేశాడు.

ఇంతకీ కీమాతో ఇడ్లీ.. ఎలా చేశారంటారా.. పెనం మీద నూనె వేసి ఇడ్లీలను వేయించి.. వాటి మీద ఘుమఘుమలు తెప్పించే మసాలా పొడి, సుగంధ దినుసులు, ఉల్లి తరుగు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, మిర్చి ముక్కలు, ఉడికించిన బంగాళదుంప, వెన్న.. ఒక్కొక్కటిగా వేస్తూ.. ఇడ్లీలను మెదపాలన్నమాట. చివర్లో ఇంకాస్త మసాలా దట్టించడంతో ఇడ్లీ కీమా సిద్ధమౌతుంది. అంతే.. కొబ్బరి పచ్చడి, సాంబార్లతో ప్లేట్లలో సర్ది వడ్డించేశాడు. ఇక అది.. కీమాలానే కనిపిస్తూ.. ఘుమాయిస్తోంది.. అంటున్నారు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫుడీ’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వైరల్‌ వీడియోను మీరూ ఒకసారి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని